logo

చిన్నారుల క్షేమానికి ప్రణాళిక!

చెన్నై మహానగరంలో చాలా పాఠశాలల బయట తీవ్రమైన ట్రాఫిక్‌ ఉంటోంది. మరోవైపు వాహనదారుల మితిమీరిన వేగం పిల్లల పాలిట శాపంగా మారుతోంది. రోడ్డుమీద అడుగుపెట్టాలన్నా, రోడ్డు దాటివెళ్లాలని విద్యార్థులు భయపడే పరిస్థితి.

Published : 08 Jun 2023 00:10 IST

ప్రమాదాల బారినపడుతున్న విద్యార్థులు
బడి పరిసరాల్లో రోడ్ల డిజైన్‌ మార్పు
పలుచోట్ల ప్రయోగాత్మక పరిశీలన

చెన్నై మహానగరంలో చాలా పాఠశాలల బయట తీవ్రమైన ట్రాఫిక్‌ ఉంటోంది. మరోవైపు వాహనదారుల మితిమీరిన వేగం పిల్లల పాలిట శాపంగా మారుతోంది. రోడ్డుమీద అడుగుపెట్టాలన్నా, రోడ్డు దాటివెళ్లాలని విద్యార్థులు భయపడే పరిస్థితి. ఇలా ప్రయత్నించిన పలువురు మృతి చెందడం తీవ్ర విషాదం నింపింది. పాఠశాలల బయట సురక్షిత ప్రాంతాల్ని తెచ్చేందుకు గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ వినూత్న ప్రాజెక్టుతో ముందుకొచ్చింది.
ఈనాడు, చెన్నై

పసి ప్రాణం విలవిల..

*2019లో జీసీసీ నిర్వహించిన సర్వే ప్రకారం.. నగరవ్యాప్తంగా పాఠశాలలకు చెందిన 50మంది విద్యార్థులు రోడ్డు ప్రమాదాలలో మరణించారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు సైకిళ్లను కూడా అందిస్తోంది. కానీ రోడ్లపై వెళ్తున్న విద్యార్థులకు వాహనాలు ఢీకొనడంతో పలువురు చనిపోవడం, మరికొందరు గాయపడటం పరిపాటిగా మారింది. ఈ దారుణాల నేపథ్యంలో విద్యార్థులు సైకిళ్లపై పాఠశాలలకు వచ్చేందుకు ఆసక్తి చూపడంలేదు. రోడ్లు, ట్రాఫిక్‌ వారికి అనుకూలంగా లేకపోవడమే కారణం.

‌*ఎన్‌ఐటీ తిరుచ్చి, ఐఐటీ బాంబే బృందం చెన్నై నగరంలో ఓ సర్వే చేశారు. ఇందులో 706మంది పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. వీరంతా 6 నుంచి 10వ తరగతులకు చెందినవాళ్లు. ఈ సర్వేలో తేలిందేంటంటే.. 47.5శాతం మంది పిల్లలు రోడ్లమీద వివిధరకాల ప్రమాదాలకు గురయ్యారని, వీరంతా గాయాలపాలయ్యారని తేలింది. ఇలాంటి బాధితుల్లో 32శాతం మందికి కాళ్లకు, ఇంకో 30 శాతం మందికి చేతులకు గాయాలు కాగా, 5  శాతంమందికి తలకు గాయాలయ్యాయి. సర్వేలో పాల్గొన్నవారిలో మొత్తం 84 శాతం మంది విద్యార్థులు సైకిల్‌, తల్లిదండ్రుల ద్వారా ద్విచక్రవాహనాలు వాడుతున్న వారేనని తేలింది.

చెన్నై నగరంలో మొత్తం 420 దాకా పాఠశాలలున్నాయి. ఇందులో చాలా ఇరుకు రోడ్లలోనే కొనసాగుతున్నాయి. అక్కడ రోడ్లు అస్తవ్యస్తంగా ఉండటం, వాహనదారులు క్రమశిక్షణతో ప్రయాణాలు చేయకపోవడం తీవ్ర ఇబ్బందికి గురిచేస్తోంది. నగరంలోని చాలా పాఠశాలలకు వచ్చే పిల్లల బస్సులు, ఆటోలు ఇలా ప్రజారవాణాపైనే ఆధారపడుతున్నారు. ఇంటి నుంచి పాఠశాలకు, మళ్లీ ఇంటికి వీటిలోనే ప్రయాణిస్తున్నారు. ఈ రోడ్లలో విద్యార్థులకు తీవ్ర గాయాలవడం, పలువురు మరణించిన నేపథ్యంలో గత అనుభవాల దృష్ట్యా.. పాఠశాలల బయట రోడ్లను వారికి అనువుగా, సురక్షితంగా మార్చాలని గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ (జీసీసీ) యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. చెన్నై యునిఫైడ్‌ మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ అథారిటీ, సిటీస్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ టు ఇన్నోవేట్ ఇంటిగ్రేట్ అండ్‌ సస్టెయిన్‌ సంస్థలు, పలు ఏజెన్సీలతో కలిసి వీరు పనిచేస్తున్నారు. ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తున్నారు.

అనుకూల విధానాలపై దృష్టి

ఉపాధ్యాయులు, ఇంజినీర్లతో జీసీసీ ప్రతినిధుల సమావేశం

ఈ మధ్యే నగరంలో పాఠశాల ఉపాధ్యాయులు, జీసీసీ ఇంజినీర్లు, ఇతర అధికారులు కలిసి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేశారు. జీసీసీ డిప్యూటీ కమిషనర్‌ (విద్య) శరణ్య ఆరి ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. వీరందరి అభిప్రాయాలు తీసుకోవడంతో పాటు కొంతమంది పిల్లలతోనూ వీరు మాట్లాడారు. అనంతరం పలు ఏజెన్సీల ద్వారా పాఠశాలల బయట ఎలాంటి విధానాలు పాటిస్తే పిల్లలకు సురక్షితమే పలు డిజైన్లను రూపొందించారు. తది డిజైన్లు కొలిక్కి వచ్చిన తర్వాత తొలిసారిగా అమింజికరైలోని పుల్లాఅవెన్యూ జీసీసీ పాఠశాలపై ఒక పరిశీలన కూడా చేశారు.

‌*పాఠశాల సమీపంలో వాహనాల వేగాన్ని తగ్గించేలా రోడ్లపై బారికేడ్లను అమర్చారు. వాహనాలు ఆ ప్రాంతానికి రాగానే తప్పనిసరి పరిస్థితుల్లో వేగాన్ని బాగా తగ్గించేలా.. గంటకు 10 నుంచి 25 కి.మీ. వేగం మధ్యే వెళ్లేలా ఇతర ఏర్పాట్లు చేశారు.

‌*అక్కడ సరైన సూచికలు ఏర్పాటుచేయడంతో పాటు రోడ్లను దాటేందుకు అనువుగా తెల్లటి గీతలు వేశారు.

‌*రోడ్డు పక్కగా పాఠశాల వైపు విద్యార్థులు ప్రత్యేకంగా నడక సాగించేందుకు దారిని వదిలారు. వాహనదారులకు ఇలాంటివి తెలిసేలా అవగాహన కల్పిస్తున్నారు.

రోడ్డుపక్కగా విద్యార్థులు నడిచేందుకు బాట ఉండేలా అధికారుల పరిశీలన

బారికేడ్ల మధ్య నుంచి వేగాన్ని తగ్గించి వెళ్తున్న బస్సు

సమగ్ర నివేదిక దిశగా..

పుల్లా అవెన్యూతో పాటు నగరంలోని మరిన్ని పాఠశాలల్లో పలు ప్రయోగాలు చేసేలా ప్రణాళికలు చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో పాఠశాలలు తెరుస్తుండటంతో.. క్షేత్రస్థాయిలో పిల్లలకు ఈ ప్రయోగాలు ఎలాంటి ఫలితాలు ఇవ్వనున్నాయో చూడనున్నారు. వీటి ఆధారంగా చెన్నై యునిఫైడ్‌ మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ అథారిటీ యంత్రాంగం ప్రత్యేక నివేదిక తయారుచేస్తోంది. ఏ పాఠశాలల సమీపంలో ఎలాంటి పరిస్థితి ఉంది, దానికేం చేయాలనేదానిపై పరిశీలించనుంది. ఈ మొత్తం ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు నిధులు ఇస్తోంది. అనువైన చోట్ల రోడ్లను వెడల్పు చేయడం, పాఠశాలల సమీపంలో వెహికిల్‌ ఫ్రీ       జోన్లుగా మార్చడం లాంటి వాటిపై సమాలోచనలు  సాగుతున్నాయి. పాఠశాల సమీపంలో ట్రాఫిక్‌ నిబంధనలు ఎలా ఉండాలనే దానిపై ప్రణాళిక రచిస్తున్నారు.  విద్యార్థులు, టీచర్లు, వాహనదారులకు తగిన అవగాహన కల్పించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని