logo

చెన్నై-న్యూదిల్లీ 20 గంటలే

చెన్నై నుంచి న్యూదిల్లీకి వెళ్లే రైలు ప్రయాణికులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. రైళ్ల వేగం పెరిగి సమయం బాగా కలిసి రానున్నట్లు వెల్లడించింది. అందుకు తగ్గట్టు భారతీయ రైల్వే విభాగం  ట్రాక్‌లను బలోపేతం చేస్తోంది.

Published : 18 Sep 2023 00:07 IST

తగ్గనున్న రైలు ప్రయాణ సమయం

గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్

వడపళని, న్యూస్‌టుడే: చెన్నై నుంచి న్యూదిల్లీకి వెళ్లే రైలు ప్రయాణికులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. రైళ్ల వేగం పెరిగి సమయం బాగా కలిసి రానున్నట్లు వెల్లడించింది. అందుకు తగ్గట్టు భారతీయ రైల్వే విభాగం  ట్రాక్‌లను బలోపేతం చేస్తోంది. ట్రాక్‌ బలోపేతం అయిన తర్వాత రైలు వేగం గంటకు 160 కి.మీ కానుంది. 2,181 కి.మీ దూరానికి ప్రస్తుతం గ్రాండ్‌ ట్రంక్‌ ఎక్స్‌ప్రెస్‌ (జీటీ)కి 34 గంటల 15 నిమిషాలు, తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌కు అయితే 32 గంటల 30 నిమిషాల సమయం పడుతోంది. చెన్నై నుంచి దిల్లీ వరకు మొత్తం మార్గానికి బలోపేతం పనులు పూర్తి కాగానే వేగం పెరిగి 20 గంటల్లోనే దిల్లీకి చేరుకోవచ్చని ఇటీవల ఐసీఎఫ్‌ జనరల్‌ మేనేజరు బీజీ మాల్యా తెలిపారు. ప్రొటోటైప్‌ స్లీపరుతో కూడిన నాన్‌ ఏసీ వందే భారత్‌ బోగీల తయారీ వచ్చే మార్చి నాటికి పూర్తి కానుంది. దగ్గర, దూరాలకు 12 బోగీలతో కూడిన వందే భారత్‌ మెట్రో బోగీలను డిజైన్‌ చేశారు. ఇవి వచ్చే ఏడాది జనవరి నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. మునుపటి రైళ్ల మాదిరిగా కాకుండా వందే మెట్రో కేటర్స్‌, ప్రతి సీటుకు ఛార్జింగు పాయింట్లు రాత్రిళ్లు ప్రయాణాలకు కూడా వీలుగా ఉండనుంది. ఆటోమేటిక్‌ తలుపులుంటాయి. ఏసీలు ఉండవు. 2019లో సెమీ హైస్పీడు వందే భారత్‌ రైలు పరిచయమైంది. దగ్గర ప్రాంతాలకు వెళ్లే వారి నుంచి ఈ రైలుకు మంచి స్పందన కనిపిస్తోంది. కొత్తగా తయారవుతున్న స్లీపర్‌ బోగీ రైళ్లు దేశంలోని ‘రైల్‌ వికాస్‌ నిగం లిమిటెడ్‌ (ఆర్‌వీఎన్‌ఎల్‌), రష్యాలోని టీఎంహెచ్‌ గ్రూపు సంస్థతో కలిసి ఉత్పత్తి చేస్తున్నారు. 200 రకాల వందే భారత్‌ స్లీపర్‌ రైళ్లకు వచ్చిన ఆర్డర్లలో 120 పైరెండు సంస్థల సహకారంతో, మిగిలిన 80 టిటాగర్‌ వ్యాగన్స్‌, బీహెచ్‌ఈఎల్‌ (భెల్‌)తో కలిసి ఉత్పత్తి కానున్నాయి. కొత్త రకానికి చెందిన స్లీపర్‌ రైళ్లు రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ప్రత్యామ్నాయంగా ఉంటాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు