logo

నీట్‌తో ప్రయోజనం శూన్యం

నీట్‌ అనే బలిపీఠంతో కేంద్రంలోని భాజపా సర్కార్‌ విద్యార్థుల ప్రాణాలు బలిగొంటోందని, ముఖ్యమంత్రి స్టాలిన్‌ విమర్శించారు. సామాజిక మాధ్యమాల్లో ఆయన చేసిన పోస్టులో...

Published : 22 Sep 2023 00:06 IST

సీఎం స్టాలిన్‌

చెన్నై, న్యూస్‌టుడే: నీట్‌ అనే బలిపీఠంతో కేంద్రంలోని భాజపా సర్కార్‌ విద్యార్థుల ప్రాణాలు బలిగొంటోందని, ముఖ్యమంత్రి స్టాలిన్‌ విమర్శించారు. సామాజిక మాధ్యమాల్లో ఆయన చేసిన పోస్టులో... నీట్‌ ఫలితం ఏమిటంటే ‘జీరో’ అని కేంద్రంలోని భాజపా సర్కారే అంగీకరించిందన్నారు. పీజీ వైద్య కోర్సులకు అర్హతా మార్కులను ఎత్తివేయడం ద్వారా నీట్‌లోని ఎలిజిబిలిటీకి అర్థం లేదని అంగీకరించిందని తెలిపారు. శిక్షణా కేంద్రాల్లో చేరండి, నీట్‌ పరీక్షలకు డబ్బు చెల్లించండి చాలనే పరిస్థితి కల్పించిందని పేర్కొన్నారు. నీట్‌ అంటే ‘సున్నా’ అయ్యిందని, దీనినే సంవత్సరాలుగా చెబుతున్నామని తెలిపారు. నీట్‌ కారణంగా ఎన్నో ప్రాణాలు బలైన తర్వాత ఇలాంటి ఉత్తర్వులు జారీ చేశారని విమర్శించారు. నీట్‌ అనే బలిపీఠంతో ప్రాణాలు బలిగొంటున్న ఈ భాజపా సర్కారును గద్దె దించాలని కోరారు.


రోడ్డు పనులపై నివేదిక సమర్పించాలని ఆదేశం

రామ్‌నగర్‌లోని ఓ రోడ్డులో పనులు పరిశీలిస్తున్న సీఎం

చెన్నై, న్యూస్‌టుడే: రోడ్డు పనుల పురోగతిపై నివేదిక సమర్పించాలంటూ ముఖ్యమంత్రి స్టాలిన్‌ అధికారులను ఆదేశించారు. గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ పరిధిలోని రామ్‌నగర్‌ 7వ క్రాస్‌ వీధి, మూడో మెయిన్‌ రోడ్డు పశ్చిమ భాగం, తూర్పు భాగం తదితర ప్రాంతాల్లో రూ.85 లక్షల వ్యయంతో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను ముఖ్యమంత్రి స్టాలిన్‌ గురువారం పరిశీలించారు. రహదారులశాఖ తరఫున మణపాక్కం-కొళపాక్కం-కిరుగంపాక్కం రోడ్డులో రూ.4.05 కోట్ల వ్యయంతో, రామాపురం-తిరువళ్లూరు రోడ్డులో రూ.2.23 కోట్ల వ్యయంతో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనుల పురోభివృద్ధిపై ప్రతివారం సమీక్షా సమావేశం నిర్వహించి నివేదిక సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించారు. చెన్నై మెట్రో రైలు పనులను ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చేపట్టాలని, ఆ పనులను సకాలంలో ముగించాలని అధికారులకు ఆదేశించారు. వెంట మంత్రులు కేఎన్‌ నెహ్రూ, అన్బరసన్‌, సుబ్రమణియన్‌, మేయర్‌ ప్రియ, ఎమ్మెల్యేలు అరవింద్‌ రమేశ్‌, గణపతి, డిప్యూటీ మేయర్‌ మహేశ్‌కుమార్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శివ్‌దాస్‌ మీనా, గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ కమిషనరు డాక్టర్‌ జె.రాధాకృష్ణన్‌ తదితరులు ఉన్నారు.


అధికారులతో సమీక్ష

సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి

చెన్నై, న్యూస్‌టుడే: నగరంలో మెట్రో రైలు పనులు జరుగుతున్న ప్రాంతాల్లోని రోడ్డు పునరుద్ధరణ పనుల గురించి ముఖ్యమంత్రి స్టాలిన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో మంత్రి కేఎన్‌ నెహ్రూ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శివ్‌దాస్‌ మీనా, గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ కమిషనరు డాక్టర్‌ జె.రాధాకృష్ణన్‌, రహదారులు, చిన్న ఓడరేవులశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌ యాదవ్‌, చెన్నై మెట్రో రైలు లిమిటెడ్‌ ఎండీ సిద్ధిక్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని