logo

పుదువై సర్కారులో రూ.27.98 కోట్ల అవినీతి

పుదుచ్చేరి ప్రభుత్వ శాఖల్లో 27.98 కోట్ల అవినీతి జరిగినట్లు తమిళనాడు, పుదుచ్చేరి ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌ ఆనంద్‌ తెలిపారు. గత ఆర్థిక ఏడాదికి సంబంధించి ఇండియన్‌ ఆడిట్‌ అండ్‌ అకౌంట్స్‌ విభాగం ఛైర్మన్‌ ఆర్థికశాఖ ఆడిట్‌ నివేదికను పుదుచ్చేరి శాసనసభలో బుధవారం సమర్పించింది

Published : 22 Sep 2023 00:06 IST

ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌

ఆడిట్‌ నివేదిక ప్రతులతో ఆనంద్‌ తదితరులు

చెన్నై, న్యూస్‌టుడే: పుదుచ్చేరి ప్రభుత్వ శాఖల్లో 27.98 కోట్ల అవినీతి జరిగినట్లు తమిళనాడు, పుదుచ్చేరి ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌ ఆనంద్‌ తెలిపారు. గత ఆర్థిక ఏడాదికి సంబంధించి ఇండియన్‌ ఆడిట్‌ అండ్‌ అకౌంట్స్‌ విభాగం ఛైర్మన్‌ ఆర్థికశాఖ ఆడిట్‌ నివేదికను పుదుచ్చేరి శాసనసభలో బుధవారం సమర్పించింది. అందులోని ముఖ్యాంశాలను ఆనంద్‌ పాత్రికేయులకు వెల్లడించారు. పుదుచ్చేరిలో 2020-21వ ఏడాదిలో రూ.240 కోట్లుగా ఉన్న మూలధన ఖర్చు 2021-22వ ఏడాదిలో రూ.163 కోట్లకు తగ్గిందన్నారు. 2021లో రెవెన్యూ పన్నులు అంతకు ముందటి ఏడాది కన్నా రూ.1,969 కోట్లకు పెరిగాయని తెలిపారు. ప్రజాపనులశాఖ, విద్యుత్తుశాఖలో 34 పూర్తికాని పథకాలతో రూ.114.31 కోట్లు స్తంభించాయని పేర్కొన్నారు. 2017-18లో రూ.8,799 కోట్లుగా ఉన్న అప్పులు 2021-22లో రూ.12,593 కోట్లకు పెరిగాయని తెలిపారు. పలు ప్రభుత్వ శాఖల్లో 32 కేసుల్లో రూ.27.98 కోట్ల ప్రభుత్వ ధనం అవినీతి, నష్టం, అపహరణకు గురైందని వెల్లడించారు. పుదుచ్చేరిలో ఐదు ప్రభుత్వ రంగ సంస్థలు రూ.38.48 కోట్ల లాభాన్ని, 7 ప్రభుత్వ రంగ సంస్థలు రూ.49.87 కోట్ల నష్టాన్ని చవిచూశాయని తెలిపారు. 12 ప్రభుత్వ రంగ సంస్థల లెక్కలు పూర్తి కాకుండా పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు. విలేకర్ల సమావేశంలో జనరల్‌, సీనియర్‌ డిప్యూటీ అకౌంటెంట్‌ జనరల్‌ వర్షిని అరుణ్‌, సీనియర్‌ ఆడిట్‌ అధికారులు మెయ్యప్పన్‌, మణి మొళి తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని