logo

నరక మార్గం NH 71

నాయుడుపేట - రేణిగుంట మార్గంలో 20 నుంచి 30 టన్నుల సామర్థ్యం గల భారీ వాహనాలు పెరగడంతో దశాబ్దాల కిందటి ప్రమాణాల మేరకు నిర్మించిన ఈ రహదారి త్వరగా దెబ్బతింటోంది. మరమ్మతులు ఎంతోకాలం నిలవడం లేదు. 2019 వరకు పాత గుత్తేదారు నిర్వహణ బాధ్యతలు చూడగా 2020 నుంచి మేఘా సంస్థ చూడాల్సి

Updated : 25 May 2022 10:05 IST

గుంతలతో నిండిన రేణిగుంట- నాయుడుపేట మార్గం

ఇటీవలి వర్షాలతో మరింత అధ్వానం

ఇటీవల జరిగిన రహదారి ప్రమాదం

నాయుడుపేట - రేణిగుంట మార్గంలో 20 నుంచి 30 టన్నుల సామర్థ్యం గల భారీ వాహనాలు పెరగడంతో దశాబ్దాల కిందటి ప్రమాణాల మేరకు నిర్మించిన ఈ రహదారి త్వరగా దెబ్బతింటోంది. మరమ్మతులు ఎంతోకాలం నిలవడం లేదు. 2019 వరకు పాత గుత్తేదారు నిర్వహణ బాధ్యతలు చూడగా 2020 నుంచి మేఘా సంస్థ చూడాల్సి ఉంది. గత ఏడాది భారీ వర్షాల అనంతరం మరమ్మతులు చేయగా ఇటీవల వర్షాలతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది.రేణిగుంట నుంచి శ్రీకాళహస్తి, శ్రీకాళహస్తి నుంచి నాయుడుపేట వరకు ఆరు వరుసల రహదారి నిర్మాణం పూర్తయ్యే వరకు మరమ్మతులు తరచూ జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది.

ప్రమాద ఘటనలు ఇలా..

●శ్రీకాళహస్తి సమీపంలో ఏప్రిల్‌ 24న మినీ ట్రక్‌, లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందగా 8 మందికి గాయాలయ్యాయి. ●ఏర్పేడు మండలం సీతారాంపేట సమీపంలో ఏప్రిల్‌ 18న లారీ, కారు ఢీకొన్న ఘటనలో దంపతులు మరణించారు. ●పెళ్లకూరు మండలం తాళ్వాయపాడు వద్ద మే 16న గోమతి మలుపులో సైక్లిస్టు సుబ్బరామయ్యను ఆటో ఢీకొనడంతో మరణించారు. ఇక్కడి కీలక మలుపు ప్రమాదాలకు నెలవుగా మారింది.

స్వచ్ఛందంగా కదిలి.. గోతులు పూడ్ఛి.

దుస్థితికి చేరిన జాతీయ రహదారి (71)లో పలు చోట్ల ఏర్పడ్డ గుంతలను నాయుడుపేట పట్టణానికి చెందిన కారు డ్రైవర్ల సంఘం ప్రతినిధులు మంగళవారం పూడ్చివేశారు. పెళ్లకూరు మండలం చావలి వద్ద ఉన్న పెద్దపెద్ద గుంతలు మూడింటిని రాళ్లతో కప్పి పైన సిమెంట్‌ వేశారు. ఇక్కడ మార్గం రూపు కోల్పోవడంతో చందాలు వేసుకుని పనులు చేసినట్లు వారు తెలిపారు.

ఆ రహదారిపై ప్రయాణం నరకాన్ని తలపిస్తోంది. జాతీయ రహదారి 71 ప్రయాణికుల్లో గుబులు రేపుతోంది. దారి పొడవునా పెద్దపెద్ద గోతులతో దారుణంగా తయారైంది. ఇటీవల కురిసిన వర్షాలకు అవి మరింత పెద్దవయ్యాయి. గతేడాది నవంబరులో కురిసిన వర్షాల తర్వాత గోతులు పూడ్చగా తాజాగా కురిసిన వర్షాలతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ప్రయాణం సాగించాల్సి వస్తోంది. - న్యూస్‌టుడే, పెళ్లకూరు, గూడూరు

రేపటి నుంచి పూడ్చుతాం :  రహదారి ఆరు వరుసల పనులు చేపడుతున్న గుత్తేదారు సంస్థ ద్వారా గుంతలు పూడ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి. గతేడాది పడ్డ గుంతలు పూడ్చాం. మళ్లీ అకాల వర్షాలతో పడ్డ గుంతలు పూడ్చివేయిస్తాం. - సత్యనారాయణ, ఎన్‌హెచ్‌ఏఐ ప్రతినిధి

ఇదీ పరిస్థితి

రహదారి పొడవు: 64 కి.మీ

కృష్ణపట్నం పోర్టుకు నాలుగు రాష్ట్రాల నుంచి రాకపోకలకు ఈ రోడ్డే కీలకం.

పలు ప్రాంతాల్లో అడుగుకో గుంత ఉంది. కొన్నిచోట్ల గోతులు పది అడుగుల పొడవు ఉన్నాయి.

పెళ్లకూరు మండలం చావలి వద్ద పది అడుగులు పైనే గుంతలేర్పడి ప్రయాణం నరకంగా మారింది.

ఈ మార్గంలో గంట ప్రయాణానికి అరగంట ఎక్కువగా పడుతోంది.

ఏడాది కాలంలో..

ప్రమాదాలు: 120

మృతులు: 45

క్షతగాత్రులు: 253

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని