logo
Updated : 26 May 2022 06:17 IST

ఉద్యోగ విధులు.. విలువిద్య పాఠాలు


చిన్నారులకు మెలకువలు చెబుతున్న హారతి 

విద్యార్థి దశ నుంచే ఆ యువతి విలువిద్యపై ఆసక్తి కనబరిచింది. కలల సాధన దిశగా శ్రమించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో సత్తాచాటి క్రీడాకోటాలో ప్రభుత్వ ఉద్యోగం సాధించింది. అంతటితో ఆగకుండా తన నైపుణ్యం మెరుగుపర్చుకుంటూనే పిల్లలకు శిక్షణ ఇస్తూ వారిని పతకధారులుగా తీర్చిదిద్దుతోన్న శ్రీహరికోటకు చెందిన ‘మంచి’ హారతిపై కథనం. - న్యూస్‌టుడే, సూళ్లూరుపేట  

అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్‌లో మంచి మోహన్‌ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. భార్య జయమ్మ గృహిణి. వీరి సంతానం కమలాకర్, హారతి. కమలాకర్‌ చిన్నతనంలోనే విలువిద్య క్రీడపై ఆసక్తి కనబరిచి, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నారు. సోదరుడు విలువిద్యలో ప్రతిభ కనబరచడం, హారతిలో ప్రేరణ రగిల్చింది. అంతరిక్ష కేంద్రీయ పాఠశాలలో చదివేటప్పుడు విలువిద్య సాధన ప్రారంభించింది. పీఈటీ లక్ష్మణ్‌ ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. విద్యార్థి దశలో ఆరేళ్లపాటు రోజూ ఉదయం, సాయంత్రం రెండు గంటలపాటు కఠోర సాధన చేసింది. సోదరుడి సలహాలు, సూచనలు తీసుకుంది. అనతికాలంలోనే రాష్ట్ర, జాతీయ స్థాయిలో జరిగిన పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరచి, పతకాలు సొంతం చేసుకుంది. తల్లిదండ్రులు తమ బిడ్డ అభిరుచిని, ప్రతిభను గుర్తించి తమవంతు ప్రోత్సాహం అందించడంతో హారతి ఇక వెనుదిరిగి చూడలేదు. 
జాతీయ స్థాయిలో రాణింపు 
హారతి జాతీయస్థాయి పోటీల్లో 2007 నుంచి 2017 వరకు 11 సార్లు పాల్గొంది. ఇందులో టీమ్‌లో ఒకసారి ప్రథమ, రెండుసార్లు తృతీయ స్థానంలో నిలిచారు. రాష్ట్రస్థాయి పోటీల్లో 9 సార్లు పాల్గొన్నారు. ఇందులో మూడుసార్లు ప్రథమ, రెండుసార్లు ద్వితీయ, నాలుగుసార్లు తృతీయ స్థానాలతో సత్తాచాటారు. 
క్రీడాకోటాలో ఉద్యోగం
శ్రీహరికోటలోని అంతరిక్ష కేంద్రీయ పాఠశాలలో 12వ తరగతి వరకు విద్యాభ్యాసం పూర్తిచేసింది. జేఎన్‌టీయూ పరిధిలోని కుప్పం ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ చదివింది. అనంతరం చెన్నైలో హెచ్‌టీసీ గ్లోబల్‌ సర్వీసెస్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తుండగా రాష్ట్రంలో సచివాలయం ఉద్యోగాలకు ప్రకటన విడుదలైంది. అందులో పాల్గొని క్రీడాకోటాలో పంచాయతీ కార్యదర్శిగా ఎంపికై స్థానికంగా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల నెల్లూరు జిల్లా కేంద్రంగా జరిగిన విలువిద్య పోటీల్లో స్థానిక చిన్నారులు ఈమె ప్రోత్సాహంతో పతకాలు సాధించి అబ్బురపరిచారు.

నిరంతర సాధన: హారతి
నా సోదరుడు కమలాకర్‌ను చూసే నేను విలువిద్యపై ఆసక్తి పెంచుకున్నా. ఉద్యోగం వచ్చి రెండేళ్లు గడిచినా విలువిద్యపై మక్కువగానే ఉన్నాను. పరిసర ప్రాంతాల్లోని పిల్లలను ప్రోత్సహిస్తున్నా. జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో రాణించేలా తర్ఫీదు ఇస్తున్నా.  

Read latest Tirupati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts