logo
Published : 28/11/2021 04:03 IST

సంక్షిప్త వార్తలు

 ‘పోలీసుల వాహనాల్లో వెళ్లొద్దు’

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: గిరిజనులకు ప్రత్యామ్నాయం చూపకుండా గంజాయి తోటలను ధ్వంసం చేయడం హేయమైన చర్య అని సీపీఐ మావోయిస్టు ఈస్టు డివిజన్‌ కమిటీ ఆరోపించింది. ఈ మేరకు శనివారం విశాఖ జిల్లా చింతపల్లి మండలం కోరుకొండ, బలపం గ్రామాల్లో సీపీఐ మావోయిస్టుల పేరిట గోడపత్రికలు వెలిశాయి. పోలీసులు ప్రయాణిస్తున్న వాహనాల్లో ప్రజలు వెళ్లొద్దు, గంజాయి తోటల తొలగింపులో ప్రజలు పాల్గొనవద్దని వాటిలో పేర్కొన్నారు.


 ఆర్మీలో ఉద్యోగాల పేరిట మోసం

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: ఆర్మీలో ఉద్యోగాల పేరిట డబ్బులు వసూలు చేసి నకిలీ అపాయింట్‌మెంట్‌ పత్రాలు ఇచ్చిన వ్యక్తిపై అనకాపల్లి పట్టణ పోలీసులు కేసు నమోదుచేశారు. పట్టణ ఎస్సై ధనుంజయ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కూండ్రం గ్రామానికి చెందిన బీరా విజయ్‌కుమార్‌ అలియాస్‌ సాయిరాం ఆర్మీలో ఉద్యోగం ఇప్పిస్తానని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన 20 మంది నుంచి రూ.20 వేలు చొప్పున రూ.4 లక్షలు వసూలు చేశారు. ఉద్యోగం వచ్చినట్లు నకిలీ అపాయింట్‌మెంట్‌ పత్రాలను వారికి ఇచ్చాడు. దీన్ని గుర్తించిన ఏపీ యూత్‌ అసోసియేషన్‌ గేమ్స్‌ సెక్రటరీ పి. పావని పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శనివారం రాత్రి నిందితుడు విజయ్‌కుమార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.


 పెళ్లయిన పది రోజులకే వధువు అదృశ్యం

పెందుర్తి, న్యూస్‌టుడే : వివాహం జరిగి పది రోజులు కూడా కాకముందే నవవధువు అదృశ్యమైన ఘటన పెందుర్తిలో చోటు చేసుకుంది. పెందుర్తి పోలీస్‌ స్టేషన్‌ ఏఎస్‌ఐ సత్యనారాయణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా అన్నవరానికి చెందిన యువతి(22) కొవిడ్‌ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయింది. దీంతో పెందుర్తి ప్రశాంతినగర్‌లోని బంధువుల ఇంట్లో ఉంటోంది. ఈనెల 19న ఆమెకు సమీప బంధువుతో వివాహం జరిపించారు. అయితే ఈనెల 24న అర్ధరాత్రి ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. బంధువులు పలుచోట్ల వెదికినా ప్రయోజనం లేకపోయింది. భర్త ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నారు.


చింతపల్లి శాస్త్రవేత్త శేఖర్‌ బదిలీ

చింతపల్లి, న్యూస్‌టుడే: చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్‌ శేఖర్‌ను శ్రీకాకుళం జిల్లా రాగోలు వరి పరిశోధనాస్థానానికి బదిలీ  అయ్యారు. గూడెంకొత్తవీధి మండలంలోని గిరిజన కుటుంబానికి చెందిన శేఖర్‌ వ్యవసాయ విద్యనభ్యసించి శాస్త్రవేత్త అయ్యారు.


కె.కె. లైన్‌లో పట్టాలు తప్పిన గూడ్స్‌

విశాఖపట్నం, న్యూస్‌టుడే: తూర్పు కోస్తా రైల్వే వాల్తేర్‌ డివిజన్‌ కొత్తవలస-కిరండూల్‌ మార్గంలో గూడ్స్‌ రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈనెల 26న రాత్రి 8.30 గంటల సమయంలో బచేలి నుంచి విశాఖ వెళ్తున్న గూడ్స్‌ రైలు ఛత్తీస్‌గఢ్‌లో కమ్లూర్‌-బాన్సీ వద్ద పట్టాలు తప్పింది. మావోయిస్టులు పట్టాలు పేల్చేయడంతో ఈ ప్రమాదం జరిగినట్లు రైల్వే అధికారులు భావిస్తున్నారు. ప్రమాదంలో 19 వ్యాగన్లు పట్టాలు తప్పినట్లు వాల్తేర్‌ సీనియర్‌ డీసీఎం ఎ.కె త్రిపాఠి తెలిపారు. విశాఖ నుంచి రిలీఫ్‌ రైలులో ఘటన స్థలానికి చేరుకొని పునరుద్ధరణ పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు.  శనివారం రాత్రి బయలుదేరిన విశాఖ-కిరండూల్‌ (18514) ఎక్స్‌ప్రెస్‌ రైలు జగదల్‌పూర్‌ నుంచి వెనక్కి రానున్నట్లు తెలిపారు.ఆదివారం విశాఖ నుంచి బయలుదేరే విశాఖ-కిరండూల్‌(18551) ఎక్స్‌ప్రెస్‌ రైలు కోరాపుట్‌ నుంచి తిరుగు ప్రయాణం సాగిస్తుందన్నారు. అరకు పర్యాటకుల కోసం అదనంగా మరో  అద్దాల బోగీని జత చేయనున్నట్లు తెలిపారు.


విశాఖ ఉక్కు కర్మాగారానికి అపూర్వ హోదా

ఈనాడు, విశాఖపట్నం: విశాఖ ఉక్కు కర్మాగారానికి ‘డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌’(డి.జి.ఎఫ్‌.టి.) అధికారులు ‘ఫోర్‌స్టార్‌ ఎక్స్‌పోర్ట్‌ హౌస్‌’గా అపూర్వ హోదా ప్రకటించారు. భారత విదేశీ వాణిజ్య విధాన ప్రకారం వరుసగా రెండు ఆర్థిక సంవత్సరాల కాలం పాటు ఏటా 500 మిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువ విలువైన ఎగుమతులు చేస్తే ‘ఫోర్‌స్టార్‌’ హోదా దక్కుతుంది. విశాఖ ఉక్కు కర్మాగారం చరిత్రలో ఇప్పటివరకు ఆ స్థాయి ఎగుమతులు చేయలేదు. దీంతో ‘త్రీస్టార్‌’ కేటగిరీలోనే ఉండిపోయింది. తాజాగా 500 మిలియన్‌ డాలర్ల ఎగుమతుల మార్కును వరుసగా రెండేళ్లపాటు దాటిన నేపథ్యంలో డి.జి.ఎఫ్‌.టి. అధికారులు ‘ఫోర్‌స్టార్‌’ హోదా ప్రకటించారు. ఆమేరకు సంస్థకు లేఖను పంపారు. దీంతో ఉద్యోగుల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి. సంస్థ నష్టాలపాలవుతోందని, దాన్ని లాభాల బాటలోకి తీసుకురావడం కష్టమని చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొటడానికి ఉద్యోగ వర్గాలకు పెద్ద అస్త్రం దొరికినట్లైంది. తాజాగా వచ్చిన హోదా 2026 అక్టోబరు 21వ వరకు కొనసాగుతుంది. కొవిడ్‌ పరిస్థితుల్లో తాజా హోదా దక్కడం మరో విశేషం. అపూర్వ విజయం దక్కడానికి కారణమైన సంస్థ మార్కెటింగ్‌ విభాగానికి ఉన్నతాధికారులు అభినందనలు తెలిపారు.


ఓటర్ల జాబితా పారదర్శకంగా లేకపోతే చర్యలు

విశాఖపట్నం: జిల్లా వ్యాప్తంగా అర్హులైన ప్రతి పౌరుని పేరు ఓటరు జాబితాలో నమోదు కావాలని ఓటరు జాబితాల పరిశీలకులు, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి కాంతిలాల్‌ దండే అన్నారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్‌లో వివిధ రాజకీయ పక్షాల చెందిన ప్రతినిధులు, జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఓటర్ల జాబితా పారదర్శకంగా లేకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు.


‘గుడివాడలో తగిన గుణపాఠం చెబుతాం’

విశాఖపట్నం, న్యూస్‌టుడే: అసెంబ్లీ సాక్షిగా తెదేపా అధినేత చంద్రబాబు సతీమణిపై మంత్రులు, ఎమ్మెల్యేలు అనుచిత వ్యాఖ్యలు చేయడం నీతిమాలిన చర్య అని తెదేపా రాష్ట్ర కార్యదర్శి ఆరేటి మహేష్‌ అన్నారు. శనివారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబుపై ఇష్టానుసానురంగా మాట్లాడితే గుడివాడలో కొడాలి నానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై ఆడియో, వీడియో టేపులను ప్రజల ముందు ఉంచే ధైర్యం వైకాపాకు ఉందా అంటూ నిలదీశారు.  


వేర్వేరు ఘటనల్లో ముగ్గురి మృతి

నక్కపల్లి, న్యూస్‌టుడే: జిల్లాలో వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతిచెందారు. ఉద్దండపురం వద్ద శుక్రవారం రాత్రి కుక్కనే తప్పించే క్రమంలో ద్విచక్ర వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ యువకుడు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అదనపు ఎస్సై రమణ తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం చెముడులంక గ్రామానికి చెందిన కోడి సునీల్‌కుమార్‌ (29) ఆర్‌ఎంపీగా పనిచేస్తున్నాడు. మందులు కొనుగోలు నిమిత్తం స్నేహితుడు ఎస్‌.వెంకటహరికృష్ణతో కలిసి ద్విచక్ర వాహనంపై విశాఖ బయలుదేరాడు. ఉద్దండపురం దాటగానే కుక్క అడ్డుగా రావడంతో అకస్మాతుగా బ్రేకు వేశాడు. దీంతో ఇద్దరూ డివైడర్‌పై పడ్డారు. 108లో హైవే పెట్రోలింగ్‌ పోలీసులు తుని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో సునీల్‌కుమార్‌ను రాజమహేంద్రవరం తరలిస్తుండగా మరణించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు అదనపు ఎస్సై పేర్కొన్నారు.


లారీ ఢీకొని ఒకరు..

అక్కిరెడ్డిపాలెం, న్యూస్‌టుడే: జాతీయ రహదారిపై విశాఖ డెయిరీ కూడలి వద్ద శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో విశ్రాంత ఆర్మీ ఉద్యోగి దుర్మరణం చెందారు. గాజువాక పోలీసుల వివరాల మేరకు... కంచరపాలేనికి చెందిన ఎల్‌.నూకరాజు(70)లో ఆర్మీలో పదవీ విరమణ పొంది... బ్యాంకులో సెక్యూరిటీగా పని చేస్తున్నారు. ఆయనకు భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు. శనివారం అనకాపల్లిలో కుమార్తె ఇంటికి వెళ్లి, ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా విశాఖ డెయిరీ కూడలిలో వెనుక నుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు భోరున విలపించారు. గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


గూడెంకొత్తవీధి, న్యూస్‌టుడే: కాలకృత్యాలు తీర్చుకునేందుకు చెక్‌డ్యామ్‌ వద్దకు వెళ్లి కాలుజారి పడి గిరిజనుడు మృతి చెందాడు. మృతుడి భార్య సోనియా, స్థానికులు వివరాల ప్రకారం.. నీలవరం గ్రామానికి చెందిన కిల్లో భీమన్న ఈనెల 25న గ్రామానికి సమీపంలోని కొత్తగూడెం చెక్‌డ్యామ్‌ వద్దకు కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లాడు. తిరిగి రాకపోవడంతో భార్య, కుటుంబసభ్యులు వెతికారు. రెండు రోజుల తరువాత శనివారం చెక్‌డ్యామ్‌ వద్ద ఈయన మృతదేహాన్ని స్థానికులు గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.

Read latest Visakhapatnam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని