logo
Published : 02/12/2021 03:49 IST

మా వల్ల కాదు..

గానుగాటపై చేతులెత్తేసిన తాండవ, ఏటికొప్పాక
అనకాపల్లి, న్యూస్‌టుడే

జిల్లాలో ఎంతో సుదీర్ఘ చరిత్ర కలిగిన తాండవ, ఏటికొప్పాక సహకార చక్కెర కర్మాగారాలకు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయాయి. ఈ ఏడాది గానుగాట నిర్వహించలేమని రెండు కర్మాగారాల యజమాన్యాలు చేతులెత్తేశాయి. ఈ మేరకు చెరకు అభివృద్ధి మండలికి లేఖలు అందజేశాయి. దీంతో ఆయా కర్మాగారాల పరిధిలోని చెరకును వేరేచోటకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం తాండవ కర్మాగారం పరిధిలో 21 వేలు, ఏటికొప్పాక పరిధిలో 26 వేల టన్నుల చెరకు సాగులో ఉన్నట్లు ఆయా కర్మాగారాల యాజమాన్యాలు తెలిపాయి. దాదాపు 9,600 మంది సాగుదారులు వీటిపై ఆధారపడి ఉన్నారు. కర్మాగారాల పరిధిలో ఏటా సాగు విస్తీర్ణం తగ్గిపోవడం, ఉత్పత్తి ఖర్చులు పెరుగుతుండగా అందుకు అనుగుణంగా పంచదార ధరలు పెరగకపోవడం, పురాతన యంత్రాలతోనే గానుగాట నిర్వహించాల్సి రావడం, ఆధునీకరణ లేకపోవడం వంటి కారణాలతో కర్మాగారాలు నష్టాలబాట పట్టాయి. రైతులకు సకాలంలో డబ్బు చెల్లించలేని దుస్థితికి చేరుకున్నాయి. ఇప్పుడు మూసి
వేత ముంగిట నిలిచాయి.

దేశానికి స్వాతంత్య్రం రాకముందే
ఏటికొప్పాక కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు. 88 ఏళ్లగా ఆ ప్రాంతంలో చెరకు రైతులకు అండగా నిలిచింది. రోజుకు 1,800 టన్నుల సామర్ధ్యంలో నడిచేది. ఏటా రెండున్నర లక్షల టన్నులు గానుగాట ఆడేది. 1999-2000 సీజన్‌లో రికార్డు స్థాయిలో 2.84 లక్షల టనులు గానుగాడి 2.60 లక్షల పంచదార బస్తాలు ఉత్పత్తి చేసింది. మంచి రికవరీ సాధించేది. 2000-2001 సీజన్‌లో ఏకంగా 10.60 శాతం రికవరీ సాధించి రాష్ట్రంలోని సహకార కర్మాగారాల్లో మొదటి స్థానంలో నిలిచింది. 2015-16 వరకూ బాగానే నెట్టుకొచ్చింది. ఆ తర్వాత నుంచి గానుగాట తగ్గడంతోపాటు రికవరీ పడిపోయింది. ముగిసిన సీజన్‌లో కేవలం 31,711 టన్నులు గానుగాడి 7.12 శాతం రికవరీ సాధించింది. ఇంత తక్కువ రికవరీ దేశంలో మరెక్కడా ఉండకపోవచ్చని అధికారులు చెబుతున్నారు.

తాండవ కర్మాగారాన్ని 1962లో ఏర్పాటు చేశారు. ఇక్కడ రోజుకు 1,600 టన్నులు గానుగాట చేయవచ్చు. ఏటా రెండు లక్షల టన్నులు గానుగాడేవారు. 2006-07 సీజన్‌లో 2.73 లక్షల టన్నులు గానుగాట అడారు. గత రెండు సీజన్ల నుంచి ఇక్కడ గానుగాట తగ్గిపోయింది. ముగిసిన సీజన్‌లో 39,350 టన్నులు ఆడారు. గతంలో పదిశాతానికి పైగా రికవరీ సాధించేది. 2004-05 సీజన్‌లో 10.30 శాతం రికవరీ సాధించింది. ముగిసిన సీజన్‌లో 8.16 శాతానికి పడిపోయింది.

లేఖలు అందాయి
- ఎస్‌.ఎస్‌.ఎస్‌.సత్యనారాయణ, చెరకు అభివృద్ధి అధికారి

గానుగాట నిర్వహించలేమని రెండు కర్మాగారాల యాజమాన్యలు లేఖలు ఇచ్చాయి. వీటిని చెరకు కమిషనర్‌కు పంపాం. రెండు కర్మాగారాల పరిధిలోని చెరకును సమీపంలోని కర్మాగారానికి తరలిస్తాం. ఏఏ ప్రాంతంలో ఎంత చెరకు ఉన్నదీ లెక్కలు తీస్తున్నాం, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తాం. గోవాడలో ఈనెల మూడో వారంలో గానుగాట మొదలు పెట్టడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Read latest Visakhapatnam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని