logo
Published : 02/12/2021 03:49 IST

అడ్డులేని కాలుష్యం.. అంతులేని కలవరం

నేడు కాలుష్య నివారణ దినం

అచ్యుతాపురం, అనకాపల్లి పట్టణం, నక్కపల్లి, న్యూస్‌టుడే

అచ్యుతాపురం సెజ్‌లో పడేసిన ప్లాస్టిక్‌, ఇతర వ్యర్థాలు

పీల్చే గాలి, తాగేనీరు ప్రాణాంతకంగా మారుతున్నాయి. జిల్లా ఓ పక్క ప్రగతిబాటలో పరుగులు తీస్తున్నా మరోపక్క రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యం ప్రజాజీవనాన్ని ప్రమాదంలోకి నెడుతోంది.
ఎగిసి పడే అలలు..పచ్చని తోటలు..చేపల వేట సాగించడానికి గుంపులుగా సాగిపోయే మత్స్యకారుల పడవలతో ప్రకృతి సౌందర్యం మొత్తం తనలోనే చూపే జిల్లాలోని తీర ప్రాంతాలు ప్రస్తుతం వీటికి భిన్నంగా ఉన్నాయి. పారిశ్రామికీకరణ పేరిట విచ్చలవిడిగా పుట్టుకొస్తున్న రసాయన పరిశ్రమల వ్యర్థాలతో ఈ అందాలన్నీ మసకబారుతుండగా, మత్స్యకారులు ఉపాధి కోసం వలసపోయే దుస్థితి ఏర్పడింది.


క్వారీ క్రషర్లతో అనర్థాలు..
* క్వారీ క్రషర్ల కారణంగా తలెత్తిన దుమ్ము, నీటి కాలుష్యంతో అనకాపల్లి మండలంలోని మొండిపాలెం, మామిడిపాలెం గ్రామాల్లో గతంలో పలువురు కిడ్నీ వ్యాధుల బారినపడటం అందరిలోనూ ఆందోళన రేకెత్తించింది.

పాయకరావుపేట మొదలుకుని భీమిలి వరకు సుమారు 132 కిలోమీటర్ల మేర 63 తీర గ్రామాలున్నాయి. లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సముద్రంలో మత్స్య సంపదే జీవనాధారం. పరవాడ, అచ్యుతాపురం, నక్కపల్లి, పాయకరావుపేట మండలాల్లో ఉన్న అనేక రసాయన పరిశ్రమలు విడుదల చేస్తున్న వ్యర్థాలన్నీ సముద్రంలో కలిసి చేపలు చనిపోతున్నాయి.  

నక్కపల్లి మండలం హెటిరో మందుల పరిశ్రమ నుంచి సముద్రంలోకి వేస్తున్న పైపులైను నిర్మాణ పనులను ఆపేయాలంటూ రాజయ్యపేట, బోయపాడు, దొండవాక, పెద, చినతీనార్ల గ్రామాల మత్స్యకారులు పలుమార్లు ఆందోళనలు చేపట్టారు. తాజాగా బుధవారం కూడా మహా శాంతియుత ధర్నా నిర్వహించారు.

విశాఖ-చెన్నై కోస్టల్‌ కారిడార్‌ నిమిత్తం నక్కపల్లి మండలంలో సేకరించిన భూముల్లో మున్ముందు అనేక రసాయన పరిశ్రమలు ఏర్పాటు కానున్నట్లు అధికారులే పేర్కొంటున్నారు. ఇప్పటికే ఇక్కడినుంచి వందల మంది మత్స్యకారులు వేట నిమిత్తం ఇతర ప్రాంతాలకు వలసవెళ్లారు. భవిష్యత్తులో వీరంతా శాశ్వత వలస వెళ్లే ప్రమాదం ఉందని సంబంధిత నాయకులు ఆందోళన చెందుతున్నారు.

ఒకప్పుడు మేలైన చేపలు దొరికే పెంటకోట, బంగారమ్మపేట, డీఎల్‌పురం, బోయపాడు, రాజయ్యపేట, తీనార్ల, రేవుపోలవరం తీరాల్లో చిన్నాచితకా రకాలే లభిస్తున్నాయి. ఇక పరిశ్రమలనుంచి విడుదలవుతున్న విష వాయువులతో సమీప ప్రజలకు ఊపిరాడని పరిస్థితి. వీటి కారణంగా గర్భిణులు మాతృత్వపు మాధుర్యాన్ని అనుభవించే పరిస్థితి ఉండటం లేదనే ఆరోపణలున్నాయి.

నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేస్తున్న రొయ్యల చెరువులతో తీరప్రాంతాలను ఆనుకుని ఉన్న సాగు భూములు సారాన్ని కోల్పోయి చౌడు బారిపోతున్నాయి. పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్‌.రాయవరం, రాంబిల్లి మండలాల్లో వెయ్యి ఎకరాల్లో చెరువులుండగా, యజమానులు విచ్చలవిడిగా బోర్లు వేసి భూగర్భ జలాలను నాశనం చేస్తున్నారు. చెరువుల నిర్వహణలో విడుదల చేస్తున్న వ్యర్థాలతో ఇటు సముద్రం, అటు గ్రామాల్లో తాగునీటి వనరులు కలుషితమై పోతున్నాయి. ముఖ్యంగా రాంబిల్లి, పాయరావుపేట, ఎస్‌.రాయవరం మండలాల్లో నిబంధనలు తుంగలో తొక్కుతున్న ఉదంతాలెన్నో. దీనికితోడు హేచరీలూ కాలుష్యాన్ని పెంచడంలో తమవంతు పాత్ర పోషిస్తున్నాయి.


అనకాపల్లిలోని జాతీయ రహదారి పక్కగా ఒక కంపెనీ నుంచి తెచ్చిన వ్యర్థాలను పడేశారు. ఇది సంచలనమైంది. ఈ వ్యర్థాలతో పొలాలు దెబ్బతిన్నాయి. దీనిపై పోలీసులు విచారణ చేపట్టి నిందితులను అరెస్ట్‌చేశారు.  


విశాఖ ప్రాంతీయ రవాణా కార్యాలయ పరిధిలో 10.62 లక్షల వాహనాలు ఉండగా వాటిలో 8.6 లక్షలు ద్విచక్ర వాహనాలే. మిగతా వాటిలో 90శాతం వాణిజ్య అవసరాలకు చెందినవే. వీటిలో కాలంచెల్లినవే ఎక్కువగా ఉన్నాయి. 92000 డీజిల్‌ వాహనాలే తిరుగుతున్నాయి. గత ఏడాదిలో కాలుష్యకారక వాహనాలపై 1,200 కేసులు నగరంలో, మరో 700 కేసులు గ్రామీణంలో నమోదయ్యాయి.

Read latest Visakhapatnam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని