logo
Published : 02/12/2021 03:49 IST

శాశ్వత హక్కు.. వసూళ్ల చిక్కు

ఓటీఎస్‌పై క్షేత్ర సిబ్బందికి టార్గెట్లు
ఆసక్తి చూపని గృహ లబ్ధిదారులు
ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం, న్యూస్‌టుడే అచ్యుతాపురం

ఎం.జగన్నాథపురంలో కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఇల్లు

తంలో వివిధ పథకాల ద్వారా మంజూరైన ఇళ్లకు వన్‌టైం సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌)తో శాశ్వత హక్కు కల్పిస్తామని సర్కారు చెబుతోంది. ప్రాంతాల వారీగా లబ్ధిదారుల నుంచి రూ.10 నుంచి 20 వేలు చొప్పున వసూలు చేస్తోంది. ఈ పథకంపై పెద్దఎత్తున ప్రచారం చేపడుతోంది. అయినా చాలాచోట్ల స్పందన రావడం లేదు. దీంతో నియోజకవర్గం, మండలం, క్లస్టర్ల వారీగా ప్రత్యేకాధికారులను నియమించి ఎలాగైనా సొమ్ము రాబట్టాల్సిందేనని ఒత్తిడి తెస్తున్నారు. వీఆర్వో, కార్యదర్శులు, సచివాలయాల వారీగా రోజువారీ లక్ష్యాలను విధించడంతో తెల్లారింది మొదలు ఇదే పనిలో మునిగితేలుతున్నారు.

జిల్లాలో 1983-2011 వరకు వివిధ పథకాల ద్వారా 4.3 లక్షల ఇళ్లు నిర్మించారు. వీటిలో 2.30 లక్షల గృహాలకు ఓటీఎస్‌ కింద డబ్బులు వసూలు చేయాలని వివరాలను వెబ్‌సైట్‌లో నమోదు చేశారు. అందులో 1.84 లక్షల ఇళ్లు మాత్రమే రుణాలు తీసుకున్నవి. వీటి నుంచే ప్రస్తుతం ఓటీఎస్‌ వసూలు చేయాల్సి ఉంటుంది. వీటితో సుమారు రూ.125 కోట్ల ప్రభుత్వానికి ఆదాయం రావాల్సి ఉంది. ప్రతి సచివాలయ పరిధిలో రోజూ అయిదుగురి నుంచైనా తప్పకుండా ఓటీఎస్‌ వసూలు చేయాలి. లేకుంటే ఆయా సిబ్బంది ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తోంది. అయితే లబ్ధిదారులు ముందుకు రాకపోవడంతో జీవీఎంసీ, గ్రామీణ జిల్లా పరిధిలో 528 సచివాలయాల్లో ఒకరి దగ్గరి నుంచి కూడా వసూళ్లు జరగడం లేదు. జిల్లాలో రూ.124.38 కోట్ల లక్ష్యంలో ఇప్పటి వరకు రూ. 9 కోట్లు వసూలు చేయగలిగారు.

తిమ్మరాజు పేటలో డబ్బులు చెల్లించబోమని చెబుతున్న లబ్ధిదారులు


డబ్బులు చెల్లించొద్దు

అనకాపల్లి, న్యూస్‌టుడే: గృహనిర్మాణ సంస్థ ద్వారా గతంలో ఇళ్లు నిర్మించుకున్నవారు ఇప్పుడు ప్రభుత్వానికి ఎటువంటి డబ్బు చెల్లించవద్దని మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు కోరారు. అనకాపల్లిలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే పేద వర్గాలు తీసుకున్న ఇళ్లకు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేయించి ఇస్తామన్నారు. ప్రభుత్వం ఆదాయం పెంచుకునేందుకు వాలంటీర్లను ఇంటింటికి పంపి ప్రజలపై ఒత్తిడి తీసుకొస్తోందని విమర్శించారు.


వద్దంటే.. వద్దు

1983లో ఎన్టీఆర్‌ ప్రభుత్వ హయాంలో మొదటిసారిగా కాలనీ ఇళ్లు మంజూరయ్యాయి. అప్పట్లో ఒక్కో యూనిట్‌ విలువ రూ.6 వేలు మాత్రమే. అలాంటి ఇళ్లలో కొందరికి రూ.10 వేలు, మరికొందరికి రూ. 5.400 చెల్లించమని పేర్కొనడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఇల్లు మంజూరైనా డబ్బులు, సిమెంటు స్థానిక నాయకులే కాజేశారని, మా పేరుతో మరొకరు ఇంటిని నిర్మించుకున్నారని కొందరు చెబుతున్నారు. అలాగే కొవిడ్‌తో ఉపాధిలేక ఇబ్బంది పడుతున్నామని, ఇప్పుడు చెల్లించలేమంటూ తెగేసి చెబుతున్నారు.


చాలా ఉపయోగం..

- పి.శ్రీనివాసరావు, పీడీ, గృహనిర్మాణ సంస్థ, విశాఖపట్నం
ఓటీఎస్‌ వల్ల లబ్ధిదారులకు చాలా ఉపయోగం. గృహాలకు పూర్తిస్థాయి హక్కులు వస్తాయి. ప్రస్తుతం రుణవిముక్తి పత్రాలను అందిస్తున్నాం. ఈనెల 20 తరువాత సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేసి పత్రాలు అందిస్తాం. లబ్ధిదారులపై ఒత్తిడి తేవడం లేదు. అవగాహన కల్పిస్తున్నాం.


రూ.6 వేలిచ్చి..రూ. 10 వేలంటే ఎలా..

- రేబాక రమేష్‌, తిమ్మరాజుపేట
ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి రూ.6 వేలు రుణం ఇచ్చి ఇప్పడు రూ.10వేలు చెల్లించమనడం అన్యాయం. వడ్డీగా రూ.4వేలు కలిపి వసూలు చేస్తున్నారు. ఆటో నడుపుకొని జీవించే మాలాంటి వారికి రూ.10 వేలు అంటే చాలా కష్టం. ఎస్సీ కాలనీలకు ఉచితంగా హక్కుపత్రాలు అందివ్వాలి.


వాయిదా అవకాశం ఇచ్చినా..

- మేరుగు బాపు నాయుడు, పూడిమడ
సముద్రంలో వేటసాగితే తప్ప కడుపునిండని మత్స్యకారులు రూ.10 వేలు ఎలా చెల్లించగలరు? వీటి కోసం మరలా బయట అప్పులు తేవాల్సి వస్తోంది. ఏకమొత్తంలో కాకుండా వాయిదాలు రూపంలో చెల్లించమంటే బాగుండేది.  

Read latest Visakhapatnam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని