logo
Published : 02/12/2021 04:34 IST

నిరుద్యోగులకు టోకరా

ఉద్యోగాల కోసమంటూ వచ్చి మోసపోయిన బాధితులు

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: నిరుద్యోగుల ఆశలను ఆసరాగా తీసుకున్నారు.. వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాలిప్పిస్తామంటూ వసూళ్లుకు పాల్పడ్డారు. నియామక పత్రాలూ ఇచ్చారు. తీరా ఆ పత్రాలు పట్టుకుని సంబంధిత కార్యాలయానికి వెళితే ఇవన్నీ నకిలీవి.. మిమ్మల్ని ఎవరో మోసం చేశారని చెప్పడంతో వారి గుండెల్లో రాయిపడింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కొంతమంది యువతీ, యువకులు బుధవారం విశాఖపట్నం డీఎంహెచ్‌వో కార్యాలయానికి వచ్చి విధుల్లో చేరడానికి ప్రయత్నించే క్రమంలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బాధితులు రాజమహేంద్రవరం, అమలాపురం, కాకినాడ ప్రాంతాలకు చెందినవారే. కాకినాడ సర్వజనాసుపత్రిలో పనిచేస్తున్న కొందరు ఈ నకిలీ నియమాకాల్లో సూత్రధారులు వ్యవహరించినట్లు తెలుస్తోంది. జూనియర్‌ అసిస్టెంట్‌, ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టుల పేరుతో సుమారు 60 మంది యువకులకు నకిలీ నియామక పత్రాలు జారీచేశారు. వాటిపై కేంద్ర ప్రభుత్వ రాజముద్రను కూడా వినియోగించడం విశేషం.

కార్యాలయం లేనిచోట ఉద్యోగాలంట..

రాజమహేంద్రవరంలోని ఆర్యాపురానికి చెందిన పిల్లి అనిల్‌కుమార్‌ పేరిట జూనియర్‌ అసిసెస్టెంట్‌ (అడ్మినిస్ట్రేషన్‌) ఉద్యోగం వచ్చినట్లు ఓ నియామక పత్రం ఇచ్చారు. అందులో విశాఖపట్నంలోని జాయింట్‌ డైరెక్టర్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌, ఫ్యామిలీ వెల్ఫేర్‌ కార్యాలయంలో విధుల్లో నియమిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వాస్తవానికి విశాఖలో అలాంటి కార్యాలయమే లేదు. అతనికే కాదు అందరి ఉత్తర్వుల్లోనూ అలానే ఉంది. మౌఖిక పరీక్షల కోసం మంగళవారం విశాఖ కలెక్టరేట్‌కు రావాలని అందరికీ సమాచారం ఇచ్చారు. ఉద్యోగాలొచ్చాయన్న సంతోషంతో వారంతా కలెక్టరేట్‌కు వచ్చారు. అక్కడేమీ ఏర్పాట్లు లేకపోవడంతో వారిలో అనుమానం మొదలైంది. అయితే నియామక ఉత్తర్వుల్లో డిసెంబర్‌ 1 నుంచి విధుల్లో చేరాలని ఉండడంతో బుధవారం డీఎంహెచ్‌వో కార్యాలయానికి వచ్చి తాము ఎక్కడ చేరాలో ఆరా తీయడంతో నిజం బయటపడింది. అభ్యర్థులంతా తమతో వచ్చిన మధ్యవర్తిని కార్యాలయ ఆవరణలోనే నిలదీశారు. మేం కట్టిన డబ్బులైనా ఇవ్వండి.. లేదా ఉద్యోగమైనా చూపండంటూ అతన్ని చుట్టుముట్టారు. ‘ఇందులో నా తప్పేమీ లేదు, మీరిచ్చిన డబ్బులు వేరేవారికి ఇచ్చా.. కాకినాడ వెళ్లాక అతనితో ఇప్పించేస్తాన’ని మధ్యవర్తి వారితో రాజీకి వచ్చినట్లు తెలిసింది. దీంతో వారంతా ఎక్కడా ఫిర్యాదు చేయకుండానే తిరుగుముఖం పట్టారు.

Read latest Visakhapatnam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని