తుపాను ముప్పును ఎదుర్కొనేందుకు సిద్ధం
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ మల్లికార్జున, సీపీ మనీష్‌కుమార్ సిన్హా, ఎస్పీ కృష్ణారావు, తదితరులు
వన్‌టౌన్, న్యూస్‌టుడే: తుపాను ముప్పును ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో, సీపీ మనీష్‌కుమార్ సిన్హాతో కలిసి సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 3 నుంచి 6వ తేదీ వరకు జిల్లాపై తుపాను ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక, వైద్య ఆరోగ్య, ఇంజినీరింగ్ శాఖలతో పాటు అన్ని శాఖల అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. వ్యవసాయశాస్త్రవేత్తల సూచనలను రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు చేరవేయాలన్నారు. నగరంలో లోతట్టుప్రాంతాలు, పాత భవనాలను గుర్తించడంతోపాటు సహాయక శిబిరాల ఏర్పాటు చేయాలని కమిషనర్‌ను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ముంపునకు గురయ్యే ప్రాంతాల్లోని ఆనకట్టల వద్ద ఎన్డీఆర్ఎఫ్ బలగాలను ఉంచాలన్నారు. గాలుల తీవ్రతకు చెట్లుకూలే అవకాశం ఉన్నందున మర రంపాలు, జేసీబీలను సిద్ధం చేసుకోవాలన్నారు. మత్స్యకారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందజేసి అప్రమత్తం చేయాలన్నారు. నగర సీపీ మనీష్‌కుమార్ సిన్హా మాట్లాడుతూ చిన్న సంఘటన జరిగినా కంట్రోలు రూమ్‌కు తెలియజేయాలన్నారు. ఎస్పీ కృష్ణారావు, జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీశ, జేసీలు వేణుగోపాల్‌రెడ్డి, అరుణ్‌బాబు, డీఆర్వో శ్రీనివాసమూర్తి, తదతరులు పాల్గొన్నారు.