ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు.. సన్నద్ధం
విదేశాల నుంచి వస్తే కొవిడ్ పరీక్షలు
జిల్లా కలెక్టర్ మల్లికార్జున వెల్లడి
న్యూస్‌టుడే, వన్‌టౌన్
ప్రపంచదేశాలను వణికిస్తున్న కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. విదేశాల నుంచి ఇటీవల విశాఖకు వచ్చిన ప్రయాణికుల జాబితాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లాకు పంపుతున్నాయి. ఇప్పటికిప్పుడు ఒమిక్రాన్‌తో జిల్లాకు ముప్పు లేకున్నప్పటికీ ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకున్న తరుణంలో యంత్రాంగం అప్రమత్తమైందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున బుధవారం విలేకర్లకు తెలిపారు.
* గత నాలుగైదు రోజుల్లో 30 మంది నేపాల్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, హాంకాంగ్, సింగపూర్, బ్రెజిల్ తదితర దేశాల నుంచి వచ్చారని తెలిపారు. చిరునామాల ఆధారంగా ఇంత వరకు ముగ్గురిని గుర్తించి కొవిడ్ పరీక్షలు చేశామన్నారు. మిగతా వారి కోసం అన్వేషణ కొనసాగుతోందన్నారు. కొవిడ్ నిర్ధారణ అయితే నమూనాలను హైదరాబాద్‌లోని సీసీఎంబీ ల్యాబ్‌కు పంపుతామన్నారు. ఆయా నివేదికలు వచ్చే వరకు విదేశాల నుంచి వచ్చిన వారిని ఐసొలేషన్‌లో ఉంచుతామన్నారు.
నౌకాయాన, విమానయాన మార్గాల్లో విశాఖ వచ్చే వారికి విమానాశ్రయంలో పరీక్షలు చేసేందుకు 24గంటలు అందుబాటులో ఉండేలా వైద్య సిబ్బందిని నియమిస్తున్నామన్నారు. శరీర ఉష్ణోగ్రత పరిశీలిస్తారని, లక్షణాలు ఉంటే ఆర్టీపీసీఆర్ పరీక్ష చేస్తామని చెప్పారు.
70% మందికి రెండో డోసు..
జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ వేగవంతం చేయనున్నట్లు చెప్పారు. నాలుగు లక్షల డోసులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఆర్కేబీచ్ సహా పర్యాటక ప్రదేశాల్లో రద్దీ నియంత్రణకు చర్యలు తీసుకుంటామన్నారు. కొత్తగా జిల్లాలో రెండుచోట్ల ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌లు అందుబాటులోకి రానున్నాయని, ఐసీఎంఆర్ అనుమతులు రాగానే నిర్ధారణ పరీక్షలు చేస్తామని కలెక్టర్ వెల్లడించారు. బీ కొవిడ్ నియంత్రణ చర్యలపై కలెక్టరేట్లో కలెక్టర్ నిర్వహించిన సమీక్షలో సీపీ మనీష్‌కుమార్ సిన్హా, జేసీ అరుణ్‌బాబు, ఎస్పీ కృష్ణారావు, కమిషనర్ లక్ష్మీశ, , పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. 74 ఆసుపత్రులు, 7500 పడకలను సిద్ధం చేశామన్నారు.