logo
Published : 02/12/2021 04:34 IST

అభియోగాల వేళ!

శ్రీనివాసరాజుపై సస్పెన్షన్‌ ఎత్తివేత
విశాఖ డివిజన్‌ ఇన్‌స్పెక్టర్‌గా నియామకం
దేవాదాయశాఖ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం

న్యూస్‌టుడే, వన్‌టౌన్‌

పలు ఆరోపణలపై నాలుగు నెలల కిందట సస్పెండ్‌ అయిన దేవాదాయశాఖ అనకాపల్లి డివిజన్‌ ఇన్‌స్పెక్టర్‌ వి.శ్రీనివాసరాజుకు తిరిగి పోస్టింగ్‌ ఇస్తూ ఆ శాఖ ఉప కమిషనర్‌ వి.శ్రీనివాసరెడ్డి నవంబరు 30న ఉత్తర్వులు జారీ చేశారు. ఆపై విశాఖ డివిజన్‌ ఇన్‌స్పెక్టర్‌గా నియమించారు. 22 అభియోగాలను ఎదుర్కొంటున్న వ్యక్తికి విశాఖ డివిజన్‌ను కేటాయించడంపై దేవాదాయశాఖలో తీవ్ర చర్చనీయాంశమైంది.

శ్రీనివాసరాజుపై ఉన్న 22 అభియోగాలపై దేవాదాయశాఖ కాకికాడ ఆర్జేసీ విచారణ చేపట్టారు. ఇంకా విచారణ కొనసాగుతోంది. తన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని అతను హైకోర్టును ఆశ్రయించినా ఊరట లభించలేదు. ఈ నేపథ్యంలో నాటి డీసీ పుష్పవర్ధన్‌ను దేవాదాయశాఖ కమిషనర్‌ బదిలీ చేశారు. ఆయన స్థానంలో డీసీగా వచ్చిన సింహాచలం దేవస్థానం ఈఓ సూర్యకళ సైతం శ్రీనివాసరాజు సస్పెన్షన్‌ ఎత్తివేతకు ససేమిరా అన్నారు. దీంతో ఈమెను సైతం నెల రోజుల క్రితం మార్చి..ఇన్‌ఛార్జి డీసీగా నెల్లూరు జిల్లాకు చెందిన దేవాదాయశాఖ అధికారి శ్రీనివాసరెడ్డిని నియమించారు. ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత శ్రీనివాసరాజు సస్పెన్షన్‌ ఎత్తివేతకు దస్త్రాలు చురుగ్గా కదిలాయని దేవాదాయశాఖ వర్గాలు చెబుతున్నాయి.

గతంలో శ్రీనివాసరాజు ఎంపీ విజయసాయిరెడ్డిని ప్రజాదర్బార్‌లో కలిసి తన సస్పెన్షన్‌ ఎత్తివేయాలని వినతి పత్రం అందజేశారు. ఆ తర్వాతే దేవాదాయశాఖ అధికారుల్లో మార్పులు చోటు చేసుకున్నాయని ఆయా వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ప్రస్తుతం విశాఖ డివిజన్‌ ఇన్‌స్పెక్టర్‌గా కొనసాగుతున్న ఆర్‌వీఎస్‌ఎస్‌ గౌరి స్థానంలో శ్రీనివాసరాజును నియమించారు. గౌరిని దేవాదాయశాఖ సహాయ కమిషనర్‌ కార్యాలయానికి సీనియర్‌ ఇన్‌స్పెక్టర్‌గా వెనక్కి పంపుతున్నట్లు ఉప కమిషనర్‌ శ్రీనివాసరెడ్డి జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

షరతులతో పోస్టింగ్‌: డీసీ
శ్రీనివాసరాజుపై సస్పెన్షన్‌ ఎత్తివేసినప్పటికీ కొన్ని షరతులను విధించి విశాఖ డివిజన్‌ ఇన్‌స్పెక్టర్‌గా నియమించామని డీసీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. విశాఖ డివిజన్‌ పరిధిలోని ఆలయాల హుండీలపై పర్యవేక్షణ బాధ్యతలను తప్పించామని, అతనిపై ఉన్న అభియోగాలకు సంబంధించిన దస్త్రాలు తీసుకోవడం, పైరవీలు చేయడం, రికార్డులు, డాక్యుమెంట్లు సేకరించడం వంటివి చేయరాదని, ఆయా నిబంధనలను శ్రీనివాసరాజు కచ్చితంగా పాటించాల్సి ఉంటుందని డీసీ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అతనిపై వచ్చిన అభియోగాలపై విచారణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. మరొక చోట ఖాళీ లేకపోవడంతో ఇక్కడ నియమించామన్నారు.

విశాఖలో ఖాళీ ఎలా వచ్చిందంటే..
విశాఖ ఉప కమిషనర్‌ పరిధిలో  శ్రీకాకుళం జిల్లా సోంపేట డివిజన్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టు ఖాళీగా ఉన్నా అక్కడ శ్రీనివాసరాజుకు పోస్టింగ్‌ ఇవ్వలేదు. దేవాదాయశాఖ విశాఖ జిల్లా ఏసీ కార్యాలయంలో జూనియర్‌ సహాయకురాలుగా పనిచేస్తున్న ప్రభకు సీనియర్‌ సహాయకురాలుగా పదోన్నతి కల్పించి సోంపేట ఇన్‌స్పెక్టర్‌గా నియమిస్తూ రెండు రోజుల క్రితం డీసీ ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో శ్రీనివాసరాజుకు మరో చోట ఖాళీ లేకపోవడంతో పోస్టింగ్‌ ఇవ్వలేకపోయారు. దీంతో శ్రీనివాసరాజుకు విశాఖ డివిజన్‌ కేటాయించినట్లు చెబుతున్నారు.

Read latest Visakhapatnam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని