logo
Published : 02/12/2021 04:34 IST

పెందుర్తిలో... ఆక్రమణల పర్వం

ఎక్కడికక్కడ కబ్జా

రెవెన్యూ దస్త్రాలు తారుమారు

ఈనాడు, విశాఖపట్నం

పెందుర్తి ప్రాంతంలో ప్రైవేటు.. ప్రభుత్వ భూములకు రక్షణ కరవయింది. జిరాయితీ భూముల దస్త్రాలను ఇష్టానుసారంగా మార్చేస్తున్నారు. యజమానులకు తెలియకుండానే పాసు పుస్తకాల్లో పేర్లు మారిపోతున్నాయి. రెవెన్యూలోని కొందరు అధికారుల చేతివాటం.. అక్రమాలే ఈ పరిస్థితికి కారణమనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

పెందుర్తి మండలం సరిపల్లిలో 1.60 ఎకరాలను ఓ కుటుంబం కొన్ని దశాబ్దాలుగా సాగు చేసుకుంటోంది. భూమి పత్రాలు వారి పేరునే ఉన్నాయి. ఈ-క్రాప్‌లో సైతం నమోదు చేశారు. అయినా పట్టాదారు పాసుపుస్తకాల్లో పేర్లు మార్చేశారు. విషయం బయటకు తెలియడంతో అధికారులకు ఫిర్యాదు అందింది. ఉద్యోగుల తప్పిదం స్పష్టంగా కనిపిస్తున్నా...దీని వెనుక కొందరు ప్రజాప్రతినిధుల హస్తం ఉందనే విమర్శలొస్తున్నాయి.

వేపగుంట, సుజాతనగర్‌, చినముషిడివాడ ప్రాంతాల్లో ఇటీవల భూములకు విలువ పెరిగింది. గృహ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ప్రభుత్వ స్థలాలు, చెరువులు ఎక్కువే ఉన్నాయి. ప్రస్తుతం వాటికి రక్షణ కరవయింది. కొందరు ఖాళీ స్థలాలను ఆక్రమించుకొని తొలుత చిన్నచిన్న గదులు నిర్మిస్తున్నారు. ఆ తరువాత అన్ని రకాల అనుమతులు తెచ్చుకుంటున్నారు. ఇదంతా రెవెన్యూ అధికారులకు తెలియకుండా జరగదనే ప్రచారం సాగుతోంది.

గతంలో పెందుర్తి మండలం ఎస్‌ఆర్‌పురంలో అర ఎకరాకి పట్టా చేయించేందుకు ప్రయత్నించి డబ్బులు సైతం ముట్టజెప్పినట్లు బాధితుడు గతంలో అవినీతి నిరోధకశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.


బీఆర్‌టీఎస్‌ రోడ్డులో పురుషోత్తపురం వద్ద గెడ్డ స్థలంలో కొందరు షెడ్లు నిర్మిస్తున్నారు. వాటి వెనుక వాణిజ్య భవనం నిర్మించాలని చూస్తున్నారు. అయినప్పటికీ రెవెన్యూ అధికారులు, ఇటు జీవీఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదు.


కృష్ణరాయపురంలో సర్వే నంబరు 17లోని ఎనిమిది ఎకరాలకుపైగా ఉన్న చెరువు కబ్జాకు గురవుతోంది. ఈ చెరువును మట్టితో కప్పేస్తున్నారు. జేసీబీతో చదును చేయిస్తున్నారు. దీని వెనుకాల ఓ ప్రజాప్రతినిధి ఉన్నట్లు సమాచారం. ఇక్కడి ప్రక్రియ పరిశీలించిన అధికారులు అది ప్రభుత్వభూమని తేల్చారు.


రాంపురం వీర్రాజు చెరువు వ్యవహారం కూడా చర్చనీయాంశంగా మారింది. వీఎంఆర్‌డీఏ గతంలో చూపిన బృహత్తర ప్రణాళికలో దానిని చెరువుగానే పేర్కొంది. నూతన ప్రణాళికలో జలవనరుల విభాగం నుంచి  తొలగించారు.  వీఎంఆర్‌డీఏ అధికారులను వివరణ కోరగా మాస్టార్‌ప్లాన్‌లో చూపినంత మాత్రాన ఇబ్బంది లేదన్నారు.


తప్పుచేస్తే కఠినచర్యలు..
సరిపల్లిలో జరిగిన వ్యవహారం మా దృష్టికి వచ్చింది. పూర్తి స్థాయిలో దృష్టిపెట్టాం. ఉద్యోగులు ఏ విధంగా దస్త్రాలు మార్చారో పరిశీలిస్తున్నాం. ఇరువర్గాలను త్వరలో విచారణకు హాజరుకావాలని ఆదేశించాం. సర్వేయర్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా దస్త్రాల్లో పేర్లు మార్చినట్లు తెలుస్తోంది. ఇందులో వాస్తవమేదో తేల్చి ఉద్యోగులు తప్పుంటే కఠిన చర్యలు తీసుకుంటాం. మిగిలిన చోట్ల ప్రభుత్వ భూముల ఆక్రమణలుంటే రక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించాం. చెరువుల ఆక్రమణలపైనా దృష్టిసారించాం’
అని ఆర్డీవో పి. కిశోర్‌ పేర్కొన్నారు.

Read latest Visakhapatnam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని