logo
Updated : 04/12/2021 04:09 IST

జవాద్‌పై గురి

ఈనాడు, విశాఖపట్నం, వన్‌టౌన్‌, న్యూస్‌టుడే

‘జవాద్‌’ తుపాను ప్రభావంపై ఓ అంచనాకు వచ్చిన యంత్రాంగం అప్రమత్తం అయింది. అన్ని విధాలా రక్షణ చర్యలను ఆరంభించింది. ప్రజలు ఇబ్బందులు పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంది. అర్ధరాత్రి నుంచే నగరంలో స్వల్పంగా వర్షం ఆరంభమయింది.

తుపాను తీరానికి సమీపిస్తున్న కొద్దీ గాలుల వేగం పెరిగింది. తీరం వెంట 45 కి.మీ.నుంచి 65 కి.మీ. వేగంతో వీచాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. మీటరు వరకు అలలు ఎగిసిపడ్డాయి. శుక్రవారం రాత్రి వరకు పరిస్థితులు సాధారణంగానే ఉన్నప్పటికీ తుపాను సమీపించే కొద్దీ వాతావరణం మారిపోయింది. తుపాను దిశను మార్చుకుని ప్రయాణించే అవకాశం ఉందంటున్నారు. దీంతో విశాఖకు సమీపంగా వచ్చినా ఆ తరువాత దూరంగా వెళ్తుందని అంచనా.

ముందస్తు జాగ్రత్తగా..

సెప్టెంబరులో వచ్చిన గులాబ్‌ తుపానుకు నగరంలోని లోతట్టు ప్రాంతాలు తీవ్ర ప్రభావానికి గురయ్యాయి. పెందుర్తి, చినముషిడివాడ, సుజాతనగర్‌, గోపాలపట్నం, నరవ, అల్లిపురం, జ్ఞానాపురం, కంచరపాలెం, గాజువాక, జనతా కాలనీ, వైఎస్సార్‌నగర్‌ తదితర కాలనీల్లోని వందల ఇళ్లు నీట మునిగాయి.

* గులాబ్‌ తుపానుకు గెడ్డలు పొంగి అర్ధరాత్రి ఇళ్లల్లోకి వరద రావడంతో ప్రజలు అవస్థలకు గురయ్యారు. చాలా చోట్ల మోకాల్లోతు నీరు నిలిచిపోయింది. పూడికలు కారణంగా గెడ్డలు పొంగి ఇళ్లల్లోకి నీరు చేరడంతో ఈసారి జీవీఎంసీ అధికారులు ముందస్తుగా చర్యలు చేపట్టారు. నగరంలోని ప్రధాన గెడ్డల్లో పూడిక తీసి..లోతు చేశారు. పేరుకుపోయిన వ్యర్థాలను యంత్రాలతో తొలగించారు.

విశాఖలో నిలిచిన రైళ్లు

కష్టం రాకుండా...నష్టం జరగకుండా

* శనివారం శ్రీకాకుళం, విజయనగరం, ఒడిశా వైపు తుపాను గమనం ఉంటుందని అంచనా వేస్తున్నారు. తీరానికి దగ్గరగా వచ్చినప్పుడు హోరు గాలులతో కూడిన జోరు వానలు ఉండొచ్చని, తీరం వెంట అత్యధికంగా 90 నుంచి 120 కి.మీ. వేగంతో గాలులు వీయొచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

* విశాఖలోని తీర ప్రాంతాల్లో గాలులు అధికంగా ఉండొచ్చని వివరించారు. పలు చోట్ల భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు పడొచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 100 వరకూ రైళ్లను రద్దు చేశారు. కొన్ని గమ్యాలు కుదించారు.

జవాద్‌ తుపానును ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. అతి తక్కువ నష్టాలతో ఈ గండం నుంచి బయటపడేలా పక్కాగా ప్రణాళికను రూపొందించి అమలు చేయనున్నట్లు’ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున ‘వెల్లడించారు.

శుక్రవారం మధ్యాహ్నం కలెక్టర్‌ ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ తుపాను నేపథ్యంలో జిల్లాలో తీసుకుంటున్న చర్యలను వివరించారు.

‘వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో శనివారం వరకు జిల్లా వ్యాప్తంగా తీవ్ర గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలంతా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి. కళాశాలలు, పాఠశాలలకు 5వ తేదీ వరకు సెలవులు ప్రకటించాం.

* జిల్లాలో ఏడు రిజర్వాయర్లున్నాయి. మేహాద్రి, తాండవ, రైవాడ రిజర్వాయర్లలో పూర్తి స్థాయిలో నీటి నిల్వ ఉంది. మిగిలిన చోట తక్కువగా ఉంది. గులాబ్‌ తుపానుకు ఒకేసారి 13500 క్యూసెక్కుల నీరు మేహాద్రిగెడ్డ నుంచి విడుదల చేయడంతో పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. ఈసారి అలా కాకుండా వచ్చిన వరద వచ్చినట్టే విడుదల చేస్తాం. అన్ని రిజర్వాయర్ల వద్ద ఎప్పటికప్పుడు వరద నీటిని పంపించే చర్యలు చేపడుతున్నాం.

* మండల స్థాయిలో 8 శాఖలకు చెందిన అధికారులతో నష్ట నివారణ బృందాలు ఏర్పాటు చేశాం.

* మత్స్యకారులు వేటకు వెళ్లవొద్దని ఆదేశాలు జారీ చేశాం. సహాయక కేంద్రాల ద్వారా 24గంటలూ పర్యవేక్షిస్తున్నాం. నౌకాదళం, కోస్టుగార్డులను అప్రమత్తం చేశాం. రెస్య్కూ బృందాలు, హెలికాప్టర్ల సేవలను సైతం వినియోగించుకోనున్నాం’.

కైలాసగిరి వద్ద సిద్ధంగా ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు


5 వరకు విశాఖ జూ మూసివేత

వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఈనెల 5వ తేదీ వరకు విశాఖ జూను మూసివేస్తున్నట్లు జూ క్యూరేటర్‌ నందనీ సలారియా శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జంతువులు, సిబ్బంది భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. సమీప కంబాల కొండ పార్కును శనివారం మూసి వేస్తున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు.

-న్యూస్‌టుడే, ఎండాడ


తుపాను ప్రభావం..

జిల్లా తీరంలోని 60 మత్స్యకార గ్రామాలు, నగరంపై ఉంటుంది.

సహాయక శిబిరాలకు తరలించేవారి సంఖ్య: 2.30 లక్షలు (అంచనా)

నగరంలో ముంపునకు గురయ్యే ప్రాంతాలు: పెదగంట్యాడ, షీలానగర్‌, జ్ఞానాపురం ప్రాంతాలు

జిల్లాకు వచ్చినవి: మూడు ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఒక ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు.

సహాయ శిబిరాలు: జీవీఎంసీలో 21, గ్రామీణ ప్రాంతాల్లో ఆరు

సహాయ కార్యక్రమాలకు మంజూరైన నిధులు: రూ.కోటి

Read latest Visakhapatnam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని