logo

రోశయ్య ఆలోచన మెరిసె విశాఖ తీరాన!

రాజకీయాల్లో తనదైన ప్రత్యేకత చాటుకున్న మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి పలువురిని కలచివేసింది. ముఖ్యమంత్రిగా విశాఖ నగర అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకొన్న విషయాన్ని నేతలు గుర్తు చేసుకుంటున్నారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా విశాఖలోనే ఉండటంతో నగరంతో విడదీయరాని బంధం ఏర్పడింది.

Published : 05 Dec 2021 05:06 IST
ఈనాడు, విశాఖపట్నం, న్యూస్‌టుడే, వన్‌టౌన్‌, సాగర్‌నగర్‌, మద్దిలపాలెం, అచ్యుతాపురం

 

రాజకీయాల్లో తనదైన ప్రత్యేకత చాటుకున్న మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి పలువురిని కలచివేసింది. ముఖ్యమంత్రిగా విశాఖ నగర అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకొన్న విషయాన్ని నేతలు గుర్తు చేసుకుంటున్నారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా విశాఖలోనే ఉండటంతో నగరంతో విడదీయరాని బంధం ఏర్పడింది. సీఎం, గవర్నర్‌ హోదాల్లో పలుమార్లు నగరానికి వచ్చారు. రోశయ్య కుమార్తె రమాదేవి, అల్లుడు పైడా కృష్ణప్రసాద్‌లు నగరంలోని బాలాజీనగర్లో నివసిస్తున్నారు. కీలక హోదాల్లో వచ్చినప్పుడు కూడా ఆయన కుమార్తె ఇంట్లోనే బస చేసేవారు.

2009లో నగరంలోని ఎమ్మెల్యేల వినతి మేరకు వైఎస్‌ఆర్‌ సిటీ సెంట్రల్‌ పార్కు (జీవీఎంసీ ఎదురుగా) ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. బీఆర్టీఎస్‌ రహదారి తొలిదశ పనుల సహా జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం, యూజీడీ పనులకు అప్పటిలో రోశయ్య శంకుస్థాపన చేశారు. ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రిగా ఉన్న సమయంలో కేజీహెచ్‌ను సందర్శించారు. కార్డియాలజీ విభాగంలో వసతులను మెరుగుపర్చేందుకు కృషి చేశారు. మధురవాడలో ఐ.టి.సెజ్‌ ఏర్పాటు చేసినా తగినన్ని సదుపాయాలు లేని విషయాన్ని ఐ.టి. సంస్థల ప్రతినిధులు ముఖ్యమంత్రిగా ఉన్న రోశయ్యకు వివరించగా..హామీ ఇచ్చారు. సింబయోసిస్‌ సంస్థ ప్రారంభానికి ఆయన వచ్చినప్పుడు కొంతమేర విద్యుత్తు వ్యవస్థ మెరుగుపరిచారు. కల్వర్టులను కూడా విస్తరించారు. తెన్నేటిపార్కు నుంచి రుషికొండ వరకు పూర్తిస్థాయిలో విద్యుత్తు వ్యవస్థను ఆ తరువాత ఏర్పాటు చేశారు. గీతంలోని గ్రామీణ బయోటెక్నాలజీ కేంద్రంను ప్రారంభించారు. . నగరంలోని పారిశ్రామిక ప్రముఖుల్లో ఒకరైన పైడా కృష్ణప్రసాద్‌ తన తన మామయ్య రోశయ్య గురించి గుర్తు చేసుకుంటూ... ‘నిరాడంబర వ్యక్తిత్వానికి, నిబద్దతకు నిలువెత్తు నిదర్శనం’ అన్నారు.

కొణిజేటి రోశయ్యను సత్కరిస్తున్న నగర ప్రముఖులు (దాచిన చిత్రం)

నగరాభివృద్ధిలో చెరగని ముద్ర

● ఆ పేరుతో బహుమతి: మధురవాడ ఐ.టి.హిల్స్‌ అభివృద్ధికి రోశయ్య చేసిన కృషికి ‘సింబయోసిస్‌’ సంస్థ సీఈవో ఒ.నరేశ్‌కుమార్‌ ఓ నిర్ణయం తీసుకున్నారు. ‘గీతం’లో వాణిజ్య విభాగంలో ప్రతిభ చూపిన విద్యార్థికి అవార్డుతోపాటు రూ.లక్ష నగదు బహుమతిని 2014 నుంచి రోశయ్య పేరున ఇచ్చే ఏర్పాటు చేశారు. కళాభారతి ఆడిటోరియంలో 2018 ఆగస్టులో ‘125వ సంగీత నవావధానం, స్వర్ణకంకణ సన్మానం’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రోశయ్య పాల్గొన్నారు. కళాభారతి ఆడిటోరియంలో జరిగిన పలు కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు.

● గౌరవ డాక్టరేట్‌ ప్రదానం: అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్రాభివృద్ధిలో కీలక బాధ్యతలు నిర్వర్తించినందుకు 2007లో రోశయ్యకు ఏయూ గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది. తమిళనాడు గవర్నర్‌గా ఉన్న సమయంలో కేజీహెచ్‌లోని సూపర్‌ స్పెషాలిటీ వార్డులో రోటరీక్లబ్‌, సింబయోసిస్‌ సంస్థలు సంయుక్తంగా ఏర్పాటుచేసిన నీటిశుద్ధి విభాగాన్ని ఆయన ప్రారంభించారు.

● బ్రాండిక్స్‌..: ఆసియాలోనే అతిపెద్ద టెక్స్‌టైల్స్‌ పార్కు బ్రాండిక్స్‌ అపెరల్‌ సిటీని ముఖ్యమంత్రి హోదాలో రోశయ్య 2010 మేలో ప్రారంభించారు. రోశయ్య చేతులమీదుగా ప్రారంభమైన బ్రాండిక్స్‌ ఉపాధి అందించే ఒక దేవాలయంగా మారడం గొప్ప విషయమని బ్రాండిక్స్‌ భారతీయ భాగస్వామి దొరస్వామి పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని