logo

ఇల్లు లేకున్నా ..ఋణం చెల్లించాలా?

గృహ నిర్మాణ సంస్థ నుంచి ఎటువంటి రుణాలు పొందని వారిని ‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు’ పథకం కింద వన్‌ టైం సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) లబ్ధిదారులుగా కొన్ని చోట్ల గుర్తించారు. నగదు చెల్లించాలని చెబుతుండటంతో వారు ఆందోళనకు గురవుతున్నారు.

Published : 05 Dec 2021 05:06 IST

ఇల్లు లేకపోయినా లబ్ధిదారుగా గుర్తించారని తహసిల్దార్‌కు ఫిర్యాదు చేస్తున్న జీరుపేటకు చెందిన వరలక్ష్మి
 

గృహ నిర్మాణ సంస్థ నుంచి ఎటువంటి రుణాలు పొందని వారిని ‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు’ పథకం కింద వన్‌ టైం సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) లబ్ధిదారులుగా కొన్ని చోట్ల గుర్తించారు. నగదు చెల్లించాలని చెబుతుండటంతో వారు ఆందోళనకు గురవుతున్నారు.

అసలు ఇల్లే లేదంటే తమ పేరిట రుణం తీసుకున్నట్లు దస్త్రాలు తేవడం ఏమిటని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొన్నిచోట్ల ప్రజలకు తెలియకుండానే వారి ఫొటోలు తీసి ఓటీఎస్‌ లబ్ధిదారులుగా డబ్బులు చెల్లించాలని సచివాలయ సిబ్బంది ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలో ప్రాథమికంగా నాలుగు లక్షల మందికిపైగా ఓటీఎస్‌కు అర్హులు ఉన్నట్లు గుర్తించారు. వేపగుంటలోని ఒక సచివాలయం పరిధిలో 20 మందిని గుర్తిస్తే నలుగురు మాత్రమే చెల్లించారు. పరవాడ మండలంలో 2,921 మందికి 523 మంది కట్టారు.

ఇదేం విచిత్రమంటూ..

జీరుపేటకు చెందిన వరలక్ష్మి తమకు జగనన్న కాలనీల్లో గృహం మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఓటీఎస్‌ కింద డబ్బులు చెల్లించాలని సచివాలయ సిబ్బంది చెప్పడంతో అవాక్కయ్యారు. గతంలో ఇల్లు కేటాయించడంతో పాటు రుణం తీసుకున్నట్లు చెప్పారు. తనకు ఇల్లే లేదని, ఇదేం పరిస్థితని తహసిల్దార్‌, జడ్సీకి ఆమె ఫిర్యాదు చేశారు.

భీమిలి మండలం రామయోగి అగ్రహారంలో ఓ కుటుంబం సొంత స్థలంలో వారి డబ్బులతోనే ఇల్లు నిర్మించుకుంది. అయితే వారిని ఓటీఎస్‌ కింది డబ్బులు కట్టాలని సిబ్బంది చెప్పడంతో ఇదెక్కడి చోద్యమని ప్రశ్నించారు. ఆనందపురం మండలంలో ఏ విషయం చెప్పకుండా ఒకరి ఫొటోలు తీశారని.. రెండు రోజుల తరువాత రూ.పదివేలు చెల్లించాలని చెప్పారని ఒకరు పేర్కొనడం గమనార్హం.

● అంత మొత్తం చెల్లించేదెలా: ప్రభుత్వ అమలు చేయాలనుకుంటున్న ఓటీఎస్‌ పథకానికి కొందరు మొగ్గు చూపుతున్నా...మరికొందరు ఆసక్తి చూపడం లేదు. అయితే చాలా చోట్ల సచివాలయ ఉద్యోగులు, అధికారులు అకస్మాత్తుగా వచ్చి రూ.10 వేలు కట్టాలని చెబుతుండడంపై ఆందోళన రేపుతోంది. ఒక్కసారిగా అంతమొత్తం ఎలా కట్టాలని మధనపడుతున్నారు. వికలాంగుడైన కొడుకుతో జీవిస్తున్న ఆనందపురం మండలం కణమాం గ్రామానికి చెందిన రాములమ్మ ఇదే అభిప్రాయం వెల్లడించారు.

రిజిస్ట్రేషన్‌ సామగ్రి కొనుగోలు తరువాత..

నిర్దేశిత మొత్తం చెల్లించిన వారికి ఈ నెల మూడో వారం నుంచి ఆయా సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. డాక్యుమెంట్లు ప్రభుత్వమే సరఫరా చేయనుంది. ఓటీఎస్‌లో ప్రభుత్వం తరఫున విక్రయదారుగా తహసిల్దార్‌ వ్యవహరించనున్నారు. సచివాలయానికి వచ్చి లబ్ధిదారునికి సదరు ఇంటిని రిజిస్ట్రేషన్‌ చేయిస్తారు. సచివాలయ కార్యదర్శి ఈ ప్రక్రియను పూర్తి చేసే సబ్‌ రిజిస్ట్రార్‌గా వ్యవహరించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని