ఉపాధి కోసం వచ్చి.. ఊపిరి పోగొట్టుకుని..
సింహాచలం, న్యూస్టుడే: అప్పన్న కొండపై ఓ దుకాణంలో పనిచేస్తూ ఉపాధి పొందుతున్న యువతి అనూహ్యంగా బావిలో శవమై కనిపించిన ఘటన ఆదివారం సంచలనం కలిగించింది. యువతి తల్లిదండ్రులు, బంధువులు తెలిపిన వివరాలిలా.. ఆనందపురం మండలం శొంఠ్యాం గ్రామానికి చెందిన సిమ్మ సత్యం, లక్ష్మీల కుమార్తె భవానీ (22) సింహాచలం కొండపై ఓ దుకాణంలో పనిచేస్తోంది. అదే మండలం కణమాం గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ వెన్ని రాజు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఆమెను ఆటోలో శొంఠ్యాం నుంచి సింహాచలం తీసుకువచ్చి తిరిగి తీసుకువెళ్తుంటాడు. ఎప్పటి మాదిరిగానే ఈనెల 3వ తేదీన ఉదయం ఆమె ఆటోలో సింహాచలం వెళ్లింది. ఆ రోజు మధ్యాహ్నం రాజు ఆ యువతి తల్లిదండ్రులకు ఫోన్ చేసి భవానీ ఇంటికి వచ్చిందా అని అడిగాడు. రాలేదని చెప్పడంతో వారింటికి వచ్చి యువతి ఫొటో తీసుకుని వెళ్లాడు. ఏం జరిగిందని ప్రశ్నించినా సమాధానం చెప్పలేదు. తర్వాత రాజు సామాజిక మాధ్యమాల్లో ఆమె ఫొటో పెట్టాడు. మర్నాడు తెల్లవారుజామున ఓ వ్యక్తి అందించిన సమాచారం మేరకు రాజు.. భవానీ ఇంటికి వెళ్లి ఆమె కుటుంబ సభ్యులను, బంధువులను అడివివరం సమీప భైరవవాకలోని ఓ బావి వద్దకు తీసుకువచ్చాడు. అక్కడ ఆమెకు చెందిన బ్యాగు, చెప్పులు, చరవాణి ఉండడం గమనించి బావిలోనూ, పరిసరాల్లో గాలించారు. ఆచూకీ లభించకపోవడంతో తిరిగి వెళ్లిపోయి ఆనందపురం స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్.ఐ. నరసింహమూర్తి అదృశ్యం కేసు నమోదు చేసి . పోలీసుల సూచన మేరకు 5వ తేదీ ఉదయం ఆదివారం కూడా మరోసారి యువతి కుటుంబ సభ్యులు బావి వద్దకు వచ్చి చూడగా.. నీటిలో తేలుతున్న భవానీ మృతదేహాన్ని గుర్తించి బోరున విలపించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.