logo
Published : 06/12/2021 02:14 IST

సగంపైగా దాచేశారు!

కొవిడ్‌ మృతుల లెక్కల్లో గిమ్మిక్కు

జిల్లాలో కరోనా కల్లోలం గతేడాది మేలో మొదలైంది. మొదటిదశలో వైరస్‌ బారిన పడిన వారు వేలల్లో ఉంటే, మరణించిన వారు వందల్లో ఉన్నారు. రెండోదశకు వచ్చేసరికి విజృంభణ పతాక స్థాయికి చేరుకుంది. వైరస్‌ బాధితులు లక్ష దాటిపోగా మృతులు వేల సంఖ్యలో ఉన్నారు. రోజుకు 20 నుంచి 30 మంది వరకు చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. అయితే వాటన్నింటినీ అధికారిక లెక్కల్లో చూపించలేదు.

కరోనా తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు కూడా నాలుగైదు మరణాలే చూపించేవారు. దీంతో మరణాల సంఖ్య తక్కువగా ఉన్నట్లు కనిపించేది. అయితే కొవిడ్‌తో చనిపోయిన వారికి ప్రభుత్వమిచ్చే ఆర్థిక సాయం కోసం వచ్చిన దరఖాస్తులను చూస్తే ఈ వైరస్‌కు ఎంతమంది బలైపోయారో అర్థమవుతోంది. అధికారికంగా గుర్తించిన మరణాల కంటే రెట్టింపు దరఖాస్తులు రావడంతో కొవిడ్‌ సృష్టించిన మారణకాండ వెలుగులోకి వచ్చినట్లయింది.

ఇప్పటి వరకు కొవిడ్‌ కారణంగా జిల్లాలో 1,103 మంది చనిపోయినట్లు అధికారికంగా గుర్తించారు. గతేడాది మే నుంచి డిసెంబర్‌ వరకు 523 మంది చనిపోగా ఈ ఏడాది మే నుంచి జులై మధ్యలో 500 మంది వరకు మరణించినట్లు దస్త్రాల్లో చూపించారు. రెండోదశలో ఆక్సిజన్‌ అందక, ఆసుపత్రిలో పడకలు దొరక్క కుటుంబసభ్యుల కళ్ల ముందే ప్రాణాలు కోల్పోయిన వారు ఎందరో ఉన్నారు. వీరిలో చాలామంది వైద్యారోగ్య శాఖ దస్త్రాల్లో నమోదు కాలేదు. దీంతో కరోనా వల్ల చనిపోయిన వారి వివరాలు పూర్తిగా వెలుగులోకి రాలేదు. తాజాగా ప్రభుత్వం కొవిడ్‌ మృతుల కుటుంబాలకు ఇచ్చే రూ.50 వేల ఆర్థిక సాయానికి 2,500పైగా దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటివరకు 1,996 దరఖాస్తులకు పరిహారం కోసం సిఫార్సు చేశారు. మిగతావి పరిశీలనలో ఉన్నాయి. వీటినిబట్టి చూస్తే ప్రభుత్వ లెక్కల్లో చూపిన మరణాల కంటే అదనంగా 1400 మంది కొవిడ్‌తో చనిపోయినట్లు తెలుస్తోంది. ఇంత స్థాయిలో మరణాల లెక్క ఎక్కడ తప్పిందని సంబంధిత శాఖలోనే చర్చనీయాంశమవుతోంది.

మరణాల లెక్కలు తప్పాయిలా..

రెండోదశలో కొవిడ్‌ తీవ్రస్థాయికి వెళ్లిపోవడం, ఎక్కువ మంది ఆక్సిజన్‌ అందక చనిపోవడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. వారిలో భయం పోగొట్టడానికి కొవిడ్‌ మరణాలను తగ్గించి చూపించారనే వాదన వినిపిస్తోంది. అలాగే కొవిడ్‌తో చనిపోయారని తెలిస్తే చిన్నచూపు చూస్తారని కుటుంబ సభ్యులు కూడా కొన్ని మరణాల వివరాలను బయటకు వెల్లడించలేదు. ఇప్పుడు ఆర్థిక సాయం ప్రకటించిన తర్వాత కొవిడ్‌ మృతుల కుటుంబాలు బయటకు వస్తున్నాయి. ప్రభుత్వం కూడా కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చి చనిపోయినట్లు ఆధారముంటే చాలు అలాంటి వారందరికీ పరిహారం ఇవ్వాలని సూచించింది. దీంతో ఇళ్లల్లో, ప్రైవేటు క్లినిక్‌లలో వైద్యం పొంది చనిపోయిన వారి కుటుంబాలు ఇప్పుడు దరఖాస్తు చేసుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు. దరఖాస్తులన్నింటినీ నిశితంగా పరిశీలించే పరిహారం కోసం ప్రతిపాదిస్తున్నామని డీఆర్వో శ్రీనివాసమూర్తి తెలిపారు. ఇప్పటివరకు జిల్లాకు రూ.6.63 కోట్ల సాయం వచ్చిందని, ఆ మొత్తం బాధితుల నామినీ ఖాతాలకు జమవుతున్నాయన్నారు.

* అత్యధికంగా గోపాలపట్నంనుంచి 308 మంది కొవిడ్‌ సాయానికి దరఖాస్తు చేసుకున్నారు. తరువాత గాజువాక నుంచి 204, విశాఖ గ్రామీణ మండలం నుంచి 180, సీతమ్మధార నుంచి 174, మహరాణిపేట నుంచి 148 మంది మృతుల కుటుంబసభ్యులు దరఖాస్తు చేశారు.

* గ్రామీణంలో అనకాపల్లి నుంచి అత్యధికంగా 135 మంది దరఖాస్తు చేయగా, నర్సీపట్నం నుంచి 50 మంది, ఎలమంచిలి, కె.కోటపాడు నుంచి 31 మంది చొప్పున దరఖాస్తు చేశారు.

* డుంబ్రిగుడ, ముంచంగిపుట్టు, పాయకరావుపేట, జి.మాడుగుల, హుకుంపేట, అచ్యుతాపురం, కోటవురట్ల మండలాల్లో కొవిడ్‌ మృతులున్నా ఒక్క దరఖాస్తు కూడా డీఎంహెచ్‌వో కార్యాలయానికి పరిశీలనకు రాకపోవడం గమనార్హం.

Read latest Visakhapatnam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని