logo
Published : 06/12/2021 02:48 IST

అపరెల్‌.. ఆపసోపాల్‌..!

కొవిడ్‌ తర్వాత తగ్గిన క్రయ విక్రయాలు, ఉపాధి అవకాశాలు

న్యూస్‌టుడే, ఆటోనగర్‌

ఆటోనగర్‌ అపరెల్‌ పార్కు వస్త్ర పరిశ్రమ కుట్టు పనిలో మహిళలు

ఆటోనగర్‌ అపరెల్‌ పార్కులో కొవిడ్‌కు ముందు వస్త్రాల క్రయ, విక్రయాలు జోరుగా సాగడంతో మహిళలకు ఉపాధి అవకాశాలు బాగానే ఉండేవి. ఇతర జిల్లాలతో పాటు, రాష్ట్రాల నుంచి వస్త్రాల ఆర్డర్లు రావడం, సకాలంలో వాటిని సిద్ధం చేసి ఇవ్వడం.. అంతా సజావుగానే సాగేది. కొవిడ్‌ తర్వాత ముడిసరకు కొనుగోలు నుంచి పని చేసే కార్మికుల వరకు అన్నీ ఇబ్బందులే ఎదురవుతున్నాయని... నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు.

ఆటోనగర్‌లో 146 ఎకరాల స్థలానికి లే-అవుట్‌ చేసి అపరెల్‌పార్కు పేరుతో 2006 ఏడాదిలో ప్రత్యేక బ్లాకు ఏర్పాటు చేశారు. అప్పట్లోనే 75 ప్లాట్లను వస్త్ర పరిశ్రమల కోసం పారిశ్రామికవేత్తలకు కేటాయించారు. మొదట్లో 40 వరకు పరిశ్రమలు ప్రారంభించినా... ప్రస్తుతం ఏడెనిమిది మాత్రమే నడుస్తున్నాయి. వాటిల్లో వందలాది మంది మహిళలు ఉపాధి పొందుతుండగా, అన్నీ అందుబాటులోకి వస్తే వేలల్లో ఉపాధి అవకాశాలు దక్కుతాయని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

* కొందరు యజమానులు అసలు పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రాకపోవడంతో ఆయా స్థలాలు నేటికీ ఖాళీగానే ఉన్నాయి.  కొన్ని స్థలాల్లో మాత్రం నిబంధనలకు విరుద్ధంగా ఇతర తరహా పరిశ్రమలు కొలువుదీరాయి.

* అయితే బ్లాక్‌ ఏర్పాటు చేసినప్పుడు ప్రకటించిన రాయితీలు... ఆ తర్వాత అందుబాటులో లేకపోవడంతో పరిశ్రమలు ఏర్పాటు చేయలేదని పారిశ్రామికవేత్తలు వాపోతున్నారు. ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లేక ఏళ్ల నుంచి అరకొర లాభాలతో పరిశ్రమలను నెట్టుకొస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు.

ముడిసరకు - ఆర్డర్లు

ఇక్కడ కుట్టు పరిశ్రమలు నిర్వహించే వారంతా యువతీ, యువకుల దుస్తులకు సంబంధించి, కిటికీలు- తలుపుల కర్టెన్స్‌కు, చిన్నపిల్లల వస్త్రాల తయారీకి, బెడ్‌షీట్స్‌- దిండ్లుకు సంబంధించిన మెటీరియల్స్‌ను ముంబయి, సూరత్‌, అహ్మదాబాద్‌, కోల్‌కతా నుంచి దిగుమతి చేసుకుంటారు. అలాగే ఆయా ప్రాంతాల్లోని ఇతర సంస్థల నుంచి రెడీమేడ్‌ వస్త్రాలనూ ఆర్డర్లపై తెచ్చుకుని... ఇక్కడ విక్రయిస్తుంటారు.

* అపెరల్‌ పార్కులోని కుట్టు కేంద్రాలకు విశాఖ నగరంతో పాటు, అనకాపల్లి, విజయనగరం, విజయవాడ, హైదరాబాద్‌ తదితర ప్రదేశాల నుంచి వస్త్రాలు కుట్టే ఆర్డర్లు వస్తుంటాయి. ఆయా పనుల నిమిత్తం స్థానిక మహిళలకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.

కొవిడ్‌కు ముందు..   తర్వాత..

కొవిడ్‌ ముందు వరకు వ్యాపార లావాదేవీలు బాగానే ఉండడంతో...స్థానిక ఉపాధి, ఎగుమతి, దిగుమతులకు ఢోకా ఉండేది కాదు. కొవిడ్‌ తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. ముడిసరకుతో పాటు రెడీమేడ్‌ వస్త్రాల ధరల్లో పెరుగుదల ఉండడంతో స్థానికంగా గిట్టుబాటు కావడం లేదు. గతంలో మాదిరిగా ఆర్డర్లు రావడం లేదని, అరకొరగా వస్తున్న ఆర్డర్లు పూర్తి చేసేందుకు అవసరమైన మహిళా కార్మికులు దొరకడం లేదని..ప్రస్తుతం ఉన్న వారితో నెట్టుకొస్తున్నామని పలువురు పారిశ్రామికవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు మళ్లీ మూడోదశ కొవిడ్‌ హెచ్చరికలతో భవిష్యత్తు ఎలా ఉంటుందోనని వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

* వస్త్ర పరిశ్రమలు కాస్త గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నా... రిటైల్‌ దుకాణాలు ఏర్పాటు చేసిన అమ్మకాలు సాగిస్తున్న వారు లాభాలు పొందుతున్నారు. ప్రత్యేక రాయితీలతో పండగ సీజన్‌లో పెద్దఎత్తున వినియోగదారులను ఆకర్షిస్తున్నారు.

మార్కెట్‌ పుంజుకోవాలి...

వస్త్ర పరిశ్రమ నడపడం, పది మంది మహిళలకు ఉపాధి చూపడం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. కొవిడ్‌ తర్వాత ముడిసరకు ధరలు బాగా పెరిగిపోయాయి. ఆ మేరకు మార్కెట్‌లో విక్రయించాలంటే చాలా కష్టతరమవుతోంది. ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా మార్కెట్‌ పుంజుకోవాలంటే కొంత సమయం పడుతుంది. అప్పటి వరకు పరిశ్రమ నిర్వహణలో ఇబ్బందులు తప్పవు. ప్రభుత్వô ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి వస్త్ర పరిశ్రమలను ఆదుకోవాలి.

 సువర్ణారెడ్డి, పరిశ్రమ నిర్వాహకురాలు

కుటుంబానికి ఆర్థిక చేయూత

మూడేళ్ల కిందట జరిగిన రోడ్డు ప్రమాదంలో నా భర్త గాయపడ్డాడు. నేటికీ కాళ్లు సరిగ్గా పని చేయవు. దీంతో కుటుంబ పోషణ కష్టంగా మారింది. అప్పుడు నేను ఇక్కడ కార్మికురాలిగా చేరా. నా సంపాదనతో ఇంటిని నెట్టుకొస్తూ, పిల్లల్ని చదివిస్తున్నా. మహిళా కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలి.

- సాలాపు జగదీ, కుట్టు కార్మికురాలు

Read latest Visakhapatnam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని