logo
Updated : 07/12/2021 10:19 IST

Crime News: పసిమొగ్గలపై పైశాచికం!!

రౌడీషీటర్‌పై బాలికల కుటుంబీకులు కన్నెర్ర

దేహశుద్ధి చేసిన స్థానికులు

ఈనాడు, విశాఖపట్నం, న్యూస్‌టుడే, సింధియా, మల్కాపురం 

సాయం ముసుగులో రమ్మన్నాడు..

ఆపై అతనిలో క్రూరత్వం.. పైశాచికం బయటపడ్డాయి 

పసిపిల్లలనే కనికరం చూపలేదు..

అమాయకపు బాలికలనే దయ కలగలేదు.. 

వారితో అసభ్యకరంగా ప్రవర్తించాడు...

ఇంత దారుణంగా వ్యవహరించిన దోమాన చిన్నారావు తీరు సోమవారం వెలుగు చూసింది.

 విద్యార్థినుల కుటుంబీకులు.. స్థానిక యువకులు ఆగ్రహంతో దేహశుద్ధి చేశారు! 

నిందితుడికి గాయాలు కావడంతో అతన్ని కేజీహెచ్‌కు పంపారు. మరికొందరు పిల్లల తల్లిదండ్రులను కూడా విచారణ చేస్తే మరిన్ని నిజాలు వెలుగుచూసే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో పోలీసులు ఆ కోణంలో వివరాల సేకరణ మొదలుపెట్టారు. అతనిపై పోక్సో కేసు నమోదు చేశారు. 

సేవంటూ.. 

మల్కాపురం ప్రాంతానికి చెందిన దోమాన చిన్నారావు రౌడీషీటర్‌. మూడేళ్ల కిందట ‘చిన్నారావు వెల్ఫేర్‌ సొసైటీ’ పేరుతో ఒక సంస్థను నెలకొల్పారు. నాటి నుంచి పలువురికి సన్మానాలు చేయడం, పోటీలు నిర్వహించడం, బహుమతులు ఇవ్వడం..పాఠశాలల విద్యార్థులకు పుస్తకాలు, అట్టలు, పెన్నులు తదితరాలను ఉచితంగా పంపిణీ చేస్తూ వచ్చారు. ఇటీవల పలువురు ప్రముఖులకు సైతం అవార్డులు అందించారు. ప్రకాశ్‌నగర్‌ జీవీఎంసీ ఉన్నత పాఠశాల, సమీపంలోని ప్రాథమిక పాఠశాలల్లో ఈ తరహా కార్యక్రమాలు గతంలో చేశారు. ఆయా కార్యక్రమాల వెనుక ఆ రౌడీషీటర్‌ దుర్భుద్ది ఉందనే విషయం... సోమవారం నాటి ఘటనతో వెలుగులోకి వచ్చిందని బాధిత కుటుంబీకులు మండిపడ్డారు. 

అనుమానం రావడంతో.. 

గత గురువారం కూడా పాఠశాలకు వెళ్లి చిన్నారులకు బహుమతులు అందించారు. కొందరికి ఇంటికి వస్తే అట్టలు ఇస్తానన్నారు. అతని నైజం తెలియని వారు వెెళ్లారు. తరువాత ట్యూషన్‌కు తోటి విద్యార్థినులతో కాకుండా...ఆలస్యంగా వెళ్లడం..ఆందోళనగా ఉండటంతో టీచర్‌ కారణమడిగింది. వారు జరిగింది చెప్పారు. మరికొందరు కూడా అదే తరహాలో వివరాలు వెల్లడించడంతో ఆమె సోమవారం ఉదయం జీవీఎంసీ ఉన్నత పాఠశాలకు వెళ్లి ప్రధానోపాధ్యాయుడిని ప్రశ్నించింది. అతని ఇంట్లో జరిగిన విషయాలు తమకు ఎలా తెలుస్తాయని చిన్నారావునే పిలిపిస్తానంటూ ఆయన్ను పాఠశాలకు పిలిపించారు. 

ఇంటికి పిలిచి..

పాఠశాలలకు సమీపంలోనే చిన్నారావు నివాసం. కొందరికి బహుమతులు పంపిణీ చేసి మిగిలిన వారిని ఇంటికొచ్చి తీసుకోమనేవారు. అతని నిజస్వరూపం తెలియని పసిపిల్లలు ఉచితమే కదాని  ఇంటికి వెళ్లేవారు. ఆ తరువాత వారిపట్ల చాలా అసభ్యకరంగా ..వికృతంగా ప్రవర్తించిన విషయం చర్చనీయాంశమైంది. నాలుగు, ఐదు తరగతులు చదువుతున్న కొందరు విద్యార్థినులు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కొందరు బాలికలు తమకు ఏం జరిగిందన్న విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. వారు తమ పరువుపోతుందన్న ఉద్దేశంతో బయటకు చెప్పకుండా కన్నీటిని దిగమింగుకుని అంతులేని ఆవేదన అనుభవించారు. తమలోతామే కుమిలిపోయారు. చివరికి విషయం సోమవారం బయటపడింది. 

కట్టలు తెంచుకున్న ఆగ్రహం.. 

చిన్నారావు ప్రవర్తనపై అప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఉన్న విద్యార్థినుల తల్లులు పాఠశాలకు చేరుకున్నారు. అతడిని ప్రశ్నించారు. వారిని అతను బెదిరించడంతో అందరూ కోపోద్రిక్తులై దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మహిళా పోలీసులు పలువురు పిల్లలను విచారణ చేసి ఆరా తీశారు. కొందరు బాలికలు పూసగుచ్చినట్లు చెప్పడంతో చిన్నారావు వికృత చేష్టలు బయటపడ్డాయి. ఆరోతరగతి బాలికలు నలుగురు, ఐదోతరగతి బాలిక ఒకరు, నాలుగోతరగతి బాలిక ఒకరు పోలీసులకు వివరాలు తెలియజేశారు. కొందరు బాలికల తల్లిదండ్రులు కూడా పోలీసులకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. మరో 14 మంది బాలికలను కూడా లైంగికంగా వేధించినట్లు ప్రాథమికంగా తల్లిదండ్రులకు తెలిసింది. 


వస్తే కాదనలేం కదా

‘చిన్నారావు గురించి మాకు తెలియదు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడని తెలిస్తే అనుమతించాం. పాఠశాలలో కొన్ని విగ్రహాలు కూడా ఏర్పాటు చేయించారు. ఆయన కుమార్తె కూడా ఇక్కడే చదువుతోంది. కూతురు కోసం పాఠశాలలోకి వస్తానంటే కాదనలేంకదా? ఇలాంటి పనులు చేస్తాడని ఊహించలేదు. పసిమొగ్గలని కూడా చూడకుండా ప్రవర్తించాడు’ అని ప్రధానోపాధ్యాయుడు బి.వెంకటనారాయణకుమార్‌ పేర్కొన్నారు.


కేసు నమోదుచేశాం

‘నిందితుడు చిన్నారావుపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోక్సో కేసు నమోదు చేశాం. బాలికలు చెప్పిన వివరాల మేరకు లైంగిక వేధింపులు జరిగినట్లు ప్రాథమికంగా తెలిసింది. అతన్ని అరెస్ట్‌ చేసి ఆసుపత్రికి పంపాం. తదుపరి దర్యాప్తు చేస్తున్నాం’ అని హార్బర్‌ ఏసీపీ శిరీష పేర్కొన్నారు.


 

Read latest Visakhapatnam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని