logo

భూములకు అంకెల ఆభయం!

జిల్లాలో మొత్తం నాలుగు గ్రామాలను ఇందుకు ఎంపిక చేశారు. అవి.. భీమిలి మండలంలో రామజోగి అగ్రహారం, అచ్యుతాపురంలో గంగమాంబపురం అగ్రహారం, చింతపల్లిలో బాలాజిపేట, నాతవరంలో చొల్లంగిపాలెం. ఈ గ్రామాల్లో సర్వే శాఖాధికారులు భూములను క్షేత్రస్థాయిలో సర్వే చేసి ఆ వివరాలను నూతన విధానంలో పొందుపరిచారు

Published : 15 Jan 2022 05:03 IST
ఈనాడు, విశాఖపట్నం

భీమిలి మండలంలో ఎల్‌పీఎంఎన్‌ విధాన చిత్రాన్ని పరిశీలిస్తున్న జిల్లా రిజిస్ట్రార్‌ మన్మథరావు

రాష్ట్రంలోని ఎంపిక చేసిన సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలు త్వరలో ప్రారంభమవనున్నాయి. ఇందుకు సంబంధించిన కసరత్తు పూర్తయింది.

జిల్లాలో మొత్తం నాలుగు గ్రామాలను ఇందుకు ఎంపిక చేశారు. అవి.. భీమిలి మండలంలో రామజోగి అగ్రహారం, అచ్యుతాపురంలో గంగమాంబపురం అగ్రహారం, చింతపల్లిలో బాలాజిపేట, నాతవరంలో చొల్లంగిపాలెం. ఈ గ్రామాల్లో సర్వే శాఖాధికారులు భూములను క్షేత్రస్థాయిలో సర్వే చేసి ఆ వివరాలను నూతన విధానంలో పొందుపరిచారు.ఈ విధానంలో ప్రయోజనాలను జిల్లా రిజిస్ట్రార్‌ కె.మన్మథరావు ‘ఈనాడు’కు వివరించారు. అవి ఆయన మాటల్లోనే.

● కొత్త విధానంలో ఇలా: గ్రామ స్థాయిలోనే రిజిస్ట్రేషన్లు జరిగేలా ఎంపిక చేసిన సచివాలయాల్లో కొత్త విధానం అమలు చేయనున్నారు. ఆయా గ్రామాల్లోని భూములను సర్వే శాఖ ప్రక్షాళించి ఎల్‌పీఎంఎన్‌ (ల్యాండ్‌ పర్మినెంట్‌ మ్యాప్‌ నంబరు) విధానాన్ని కొత్తగా తీసుకొచ్చారు. సర్వే నంబర్ల స్థానంలో ప్రతి ఖాతాదారుడికి ఒక నంబరు ఇవ్వనున్నారు. ఒక ప్రాంతంలో ఒక వ్యక్తికి సంబంధించి వేర్వేరు సర్వే నంబర్లలో పక్కపక్కనే భూములుంటే వాటన్నింటికీ కలిపి ఒకే ఎల్‌పీఎం నంబరు కేటాయించనున్నారు. పక్కపక్కనే ఎంతున్నా ఒకే నంబరు ఇస్తారు. మధ్యలో మరొకరిది వస్తే అప్పుడు మారిపోతుంది. ఎంపిక చేసిన నాలుగు గ్రామాల్లో ఎల్‌పీఎం నంబర్లు కేటాయింపు పూర్తయింది. భీమిలి మండలం రామజోగి అగ్రహారంలో 186 ఎల్‌పీఎం నంబర్లు వచ్చినట్లు గుర్తించారు.

నమూనా గ్రామాల్లో పూర్తయిన సర్వే

సచివాలయాల సిబ్బందికి అవసరమైన శిక్షణ పూర్తయింది. డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌కు అవసరమైన సామగ్రి వచ్చింది. నెటవర్క్‌ అనుసంధానం పూర్తయింది. ప్రభుత్వం అనుమతిచ్చిన వెంటనే ఈ ప్రక్రియ ప్రారంభంకానుంది. కొద్ది రోజుల కిందట రిజిస్ట్రేషన్‌ శాఖలో నకిలీ చలానాలు బయటపడ్డాయి. అందుకే కక్షిదారులు చలానా కట్టిన నంబరు సీఎఫ్‌ఎంఎస్‌లో ఉందో లేదో తనిఖీ చేసుకోవాల్సి ఉంది. దీన్ని రిజిస్ట్రార్‌లు తప్పనిసరిగా పాటించాలి.

ఇదీ ప్రయోజనం..

నూతన విధానంతో ప్రభుత్వ మార్కెట్‌ విలువ నిర్ణయించడం సులభతరం అవుతుంది. సాధారణంగా విలువలను సవరించడానికి ఆయా ప్రాంతాలు నివాస, వ్యవసాయ, వాణిజ్య ప్రాంతాల్లో ఉన్నాయా, జాతీయ రహదారులు, ఇతర రహదారుల పక్కనే ఉన్నాయా వంటివి అధికారులు చూస్తారు. చాలా మంది దీన్నుంచి తప్పించుకునేందుకు వారి భూములు పక్కపక్కనే ఉన్నప్పటికీ సబ్‌డివిజన్లు ఉండడంతో దారి లేదని, రహదారికి దూరమనే సాకులు చెప్పేవారు. కొత్త విధానంలో పక్కపక్కనే ఉన్నా వాటన్నింటికీ ఒకే నంబరు ఇవ్వడంతోపాటు వాటన్నింటినీ ఒకే కేటగిరిలోకి తీసుకుంటారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ, గుర్తింపు సులభతరం అవుతుంది.

మధ్యవర్తులను అనుమతించొద్ధు.

సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో మధ్యవర్తుల జోక్యాన్ని నివారించాలి. ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం కొద్ది రోజుల కిందటే దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఇచ్చింది. మధ్యవర్తులు లోపలికి రాకుండా సబ్‌ రిజిస్ట్రార్‌ చూసుకోవాలి. నేరుగా కక్షిదారులతోనే మాట్లాడాలి. అనిశా తనిఖీల తరువాత ప్రభుత్వం కొన్ని స్పష్టమైన సూచనలు చేసింది.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని