logo

పది నిమిషాల్లో ఇంటికి వస్తానని..అంతలోనే మృత్యు ఒడిలోకి

పిల్లలకు కొత్త దుస్తులు కొందాం.. పది నిమిషాల్లో ఇంటికి వచ్చేస్తాను.. అందరూ ముస్తాబు అయి రెడీగా ఉండాలని ఫోన్‌ చేసిన ఐదు నిమిషాలకే అతను చనిపోయాడన్న మరణ వార్త ఆ ఇంట్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

Published : 15 Jan 2022 05:29 IST

మాధవధార, న్యూస్‌టుడే: పిల్లలకు కొత్త దుస్తులు కొందాం.. పది నిమిషాల్లో ఇంటికి వచ్చేస్తాను.. అందరూ ముస్తాబు అయి రెడీగా ఉండాలని ఫోన్‌ చేసిన ఐదు నిమిషాలకే అతను చనిపోయాడన్న మరణ వార్త ఆ ఇంట్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గాజవాక పంతులుగారి మేడ దశమికొండ కాలనీలో నివాసముంటున్న గండిబోయిన భవానీశంకర్‌(42) ఎలక్ట్రికల్‌, ఏసీ రిపేర్‌ వర్క్స్‌ చేస్తుంటారు. శుక్రవారం ఉదయం నగరంలోకి వెళ్లి పనులు ముగించుకొని సంక్రాంతికి కావాల్సిన పూజా సామగ్రిని కొనుగోలు చేసుకొని తిరిగి ఇంటికి వస్తుండగా జాతీయ రహదారి విమానాశ్రయం రెండో వంతెన వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వస్తున్న గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఎయిర్‌పోర్టు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను సేకరిస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి షీలానగర్‌ వరకు మధ్యలో ఎటువంటి సీసీ కెమేరాలు లేకపోవడంతో ఢీ కొట్టిన వాహనాన్ని గుర్తించడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎయిర్‌పోర్టు సీఐ సి.హెచ్‌.ఉమాకాంత్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి తల్లి పైడితలమ్మ, భార్య లతితకుమారి, కుమారుడు భానోదయ్‌(11) కుమార్తె కీర్తి(7) ఉన్నారు. కుటుంబ పెద్దదిక్కు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని