logo

కొవిడ్‌ పరీక్షలు ఎక్కడ?

‘సార్‌.. నాకు జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి. రెండు రోజులుగా బాధపడుతున్నాను. మా దగ్గరి సచివాలయానికి వెళితే కొవిడ్‌ పరీక్ష ఎక్కడో తెలియదంటున్నారు? ఆరోగ్య కేంద్రాలకు వెళితే అక్కడా వెనక్కి పంపుతున్నారు. ఇంతకీ ఎక్కడ కొవిడ్‌ నిర్దరణ పరీక్షలు చేస్తున్నారో చెప్పండి’ అంటూ కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన 104 కాల్‌సెంటర్‌కు ఫోన్లు వెల్లువలా వస్తున్నాయి

Published : 18 Jan 2022 05:14 IST

కాల్‌ సెంటర్‌కు ఫోన్ల వెల్లువ

బుచ్చిరాజుపాలెంలో కొవిడ్‌ పరీక్షలు చేస్తున్న వైద్య సిబ్బంది

‘సార్‌.. నాకు జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి. రెండు రోజులుగా బాధపడుతున్నాను. మా దగ్గరి సచివాలయానికి వెళితే కొవిడ్‌ పరీక్ష ఎక్కడో తెలియదంటున్నారు? ఆరోగ్య కేంద్రాలకు వెళితే అక్కడా వెనక్కి పంపుతున్నారు. ఇంతకీ ఎక్కడ కొవిడ్‌ నిర్దరణ     పరీక్షలు చేస్తున్నారో చెప్పండి’ అంటూ కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన 104 కాల్‌సెంటర్‌కు ఫోన్లు వెల్లువలా వస్తున్నాయి. నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా    గతంలో చేసిన కేంద్రాల్లో నిర్దరణ పరీక్షలు పూర్తి స్థాయిలో జరగడం లేదు. కొన్ని వైద్యశాలల్లోనే నిర్వహిస్తున్నారు. దీంతో కొవిడ్‌ లక్షణాలతో బాధపడుతున్న వారికి పరీక్షలు ఎక్కడ చేస్తున్నారో తెలియక అవస్థలు తప్పటం లేదు. మరో వైపు జిల్లాలో ఓ ముఖ్య అధికారికి కూడా పాజిటివ్‌ అని తేలడంతో హోం ఐసొలేషన్‌ పాటిస్తున్నారు.

రాష్ట్రంలో రెండో స్థానంలో ఉన్నా
జిల్లాలో కరోనా శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ సమయంలో పరీక్షల సంఖ్యను పెంచి బాధితుల సంబంధికులను గుర్తించడం వంటి అంశాలపై దృష్టి సారించాల్సి ఉన్నా ఆ దిశగా ఇంకా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయకపోవడం ఆందోళన రేపుతోంది.నగర పరిధిలోని అన్ని ఆరోగ్య కేంద్రాల్లో కొవిడ్‌ పరీక్షల నమూనాలు సేకరించడం లేదు. రెండో దశలో రోజుకు 9 వేల నుంచి 10వేల వరకు పరీక్షలు చేశారు. ప్రస్తుతం రోజుకు వెయ్యికిపైగా కేసులు వస్తున్నాయి. రాష్ట్రంలో జిల్లా రెండో స్థానంలో ఉంది. అయినా  పరీక్షల సంఖ్య పెరగకపోవడం గమనార్హం.

ఆ స్థాయి నమూనాలేవీ..
కేజీహెచ్‌లోని వైరాలజీ ల్యాబ్‌లో రోజుకు 10 ఆర్టీపీసీఆర్‌ యంత్రాలున్నాయి. ఆరు వేల వరకు పరీక్షలు చేయొచ్చు. అయినా అందుకు తగ్గట్టు నమూనాలు  రావడం లేదు. దీంతో ఈనెలలో ఇప్పటి వరకూ రోజుకు సగటున 3వేల లోపే పరీక్షలు చేశారు. 13న మాత్రమే 4,229 పరీక్షలు చేశారు.
అనకాపల్లి, నర్సీపట్నం ఆసుపత్రుల్లో పరీక్ష పరికరాలు ఏర్పాటు చేసినా ఇంకా సాంకేతిక అనుమతులు రాలేదు. దీంతో లక్షణాలున్న వారు పరీక్షల నిమిత్తం ఆరోగ్య కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు.  పరీక్షల సంఖ్య పెంచితే వ్యాప్తిని అడ్డుకోవచ్చునని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో పరీక్షలు చేస్తున్నా రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకు వసూలు చేస్తున్నారు. ఈ విషయాలను పర్యవేక్షక అధికారి దృష్టికి తీసుకెళ్లగా పరీక్షల సంఖ్యను పెంచేందుకు చర్యలను చేపట్టామని, మంగళవారం నుంచి గరిష్ఠస్థాయిలో చేస్తామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని