logo

ఇదెక్కడి కాల పరీక్ష!!

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పీజీ కోర్సుల్లో సీట్లు నేటికీ భర్తీకాకపోవడం అటు విద్యార్థుల్లోనూ... ఇటు ఆచార్యుల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది.

Published : 19 Jan 2022 04:46 IST

పీజీ కోర్సుల్లో సీట్ల భర్తీ ఎప్పుడు

 

ఈనాడు, విశాఖపట్నం

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పీజీ కోర్సుల్లో సీట్లు నేటికీ భర్తీకాకపోవడం అటు విద్యార్థుల్లోనూ... ఇటు ఆచార్యుల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది.

● బోసిపోతున్న తరగతి గదులు: ఏయూ ప్రాంగణ కళాశాలల్లో అత్యధికులు పీజీ విద్యార్థులే ఉంటారు. ‘డైరెక్టరేట్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌’(డి.ఒ.ఎ.) విభాగం అధికారులే సీట్ల భర్తీ వ్యవహారాల్ని పర్యవేక్షిస్తారు. పీజీ ప్రవేశాల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడంతో వారు వివిధ విభాగాల్లో ఉన్న ‘సర్టిఫికెట్‌ కోర్సుల’కు సంబంధించిన సీట్ల భర్తీనే నిర్వహించారు. పీజీ కోర్సుల మొదటి సంవత్సరం విద్యార్థులు లేకపోవడంతో ఆయా తరగతి గదులన్నీ బోసిపోతున్నాయి.

● నాటి నుంచి ఎదురుచూపులే..

ఏయూ పరిధిలోని డిగ్రీ ఫలితాలు గత సంవత్సరం అక్టోబరులో విడుదలయ్యాయి. అదే నెలలో ప్రవేశ పరీక్ష రాసి పీజీ ప్రవేశాలకు విద్యార్థులు ఎదురుచూస్తూనే ఉన్నారు. గత సంవత్సరం నవంబరు నెలకల్లా తరగతులు మొదలవుతాయని కూడా ప్రకటించారు. అందుకు విరుద్ధంగా జనవరి సగం గడిచిపోయినా ఎప్పటి నుంచి తరగతులు ప్రారంభం అవుతాయన్న అంశంపై ఎవరూ సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది.

జూన్‌, జులై నెలల్లో పూర్తికావాల్సిన ప్రవేశాల ప్రక్రియ ఏకంగా ఆరు నెలలకు పైగా ఆలస్యం కావడం విస్మయం కలిగిస్తోంది. కొవిడ్‌ పరిస్థితుల కారణంగా ఆంధ్రవిశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో చదువుకున్న విద్యార్థుల పరీక్షల ఫలితాలను గత సంవత్సరం అక్టోబరులో ప్రకటించారు. 2021-22 విద్యా సంవత్సరంలో రాష్ట్రప్రభుత్వమే అన్ని విశ్వవిద్యాలయాల పరిధిలోని పీజీ సీట్లను భర్తీ చేస్తుందని ప్రకటించింది. దీంతో ఎం.ఎ., ఎమ్మెస్సీ, ఎంకాం తదితర పీజీ కోర్సుల్లో చేరాలనుకున్నవాళ్లు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన పీజీసెట్‌ ప్రవేశ పరీక్షను రాశారు. గత సంవత్సరం అక్టోబరులో పరీక్ష నిర్వహించినా అక్కడి నుంచి ప్రక్రియ ముందుకు సాగలేదు. విశ్వవిద్యాలయ చరిత్రలో గతంలో ఎప్పుడూ ఇంత జాప్యం జరగలేదు.

● వాస్తవానికి 2020లో కొవిడ్‌ పరిస్థితులు ఉద్ధృతంగా ఉన్నప్పుడు కూడా ఏయూ ప్రవేశాల విభాగం అధికారులు పీజీ సీట్ల భర్తీని 2021 జనవరి నాటికి పూర్తి చేశారు. 2020లో ఆసెట్‌ నిర్వహించి అక్టోబరు నెలకల్లా ఫలితాలను కూడా ఏయూ అధికారులు ప్రకటించారు. నాడు కళాశాలకు ఫీజులు నిర్ణయించడంలో జరిగిన జాప్యం కారణంగా సుమారు రెండు నెలలపాటు అధికారులు ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేయలేకపోయారు.

● విద్యాసంవత్సరం ఆలస్యమైనట్లే: ఒక సెమిస్టర్‌ పూర్తి చేయాలంటే కచ్చితంగా 90రోజులబోధన జరగాలి. ఒక సంవత్సరం పూర్తికావాలంటే కనీసం 180 రోజుల బోధన సాగాలి. ఈ నిబంధన నేపథ్యంలో ప్రవేశాలు ఆలస్యం జరిగితే విద్యాసంవత్సరం ఆలస్యమైనట్లేననే చర్చ సాగుతోంది.


ఏయూలోని కళాశాలల పరిధిలో పీజీ కోర్సులు ఇలా..

ఆర్ట్స్‌: 33

సైన్స్‌: 50

న్యాయ ఫార్మసీ:

ఇంజినీరింగ్‌: 35

ఏయూ పరిధిలో కళాశాలల్లో పీజీ కోర్సులు చేసేవారి సంఖ్య: 8 వేలు (సుమారు)


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని