logo

‘ఉపాధ్యాయుల హక్కులకు భంగం కలిగించొద్దు’

పీఆర్‌సీ ప్రతులను ఫ్యాప్టో ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం దహనం చేశారు. పట్టణంలోని గౌతమ్‌ థియేటర్‌ కూడలి వద్ద ఏపీటీఎఫ్‌, యూటీఎఫ్‌ సంఘాల నాయకులు మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. అనంతరం పీఆర్‌సీకి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు ప్రతులను కాల్చివేశారు.

Published : 19 Jan 2022 05:23 IST

పాయకరావుపేట, న్యూస్‌టుడే: పీఆర్‌సీ ప్రతులను ఫ్యాప్టో ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం దహనం చేశారు. పట్టణంలోని గౌతమ్‌ థియేటర్‌ కూడలి వద్ద ఏపీటీఎఫ్‌, యూటీఎఫ్‌ సంఘాల నాయకులు మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. అనంతరం పీఆర్‌సీకి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు ప్రతులను కాల్చివేశారు. ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో మొండివైఖరి ప్రదర్శిస్తోందని పేర్కొన్నారు. అప్రజాస్వామికంగా ఫిట్‌మెంట్‌ ప్రకటించారని ఆరోపించారు. రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామన్నారు. హెచ్‌ఆర్‌ఏ తగ్గింపు సమంజసం కాదని, తక్షణమే జీవోలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. నాయకులు కట్టా శ్రీరామచంద్రమూర్తి, షేక్‌ రహీం, కృష్ణంరాజు, కె.శ్రీను తదితరులు పాల్గొన్నారు.

పాయకరావుపేటలో..

మాడుగుల, బుచ్చెయ్యపేట, కృష్ణదేవిపేట, న్యూస్‌టుడే: ప్రభుత్వం అసంబద్ధంగా, అశాస్ర్త్రీయంగా ఇచ్చిన పీఆర్‌సీ జీవోలను మండల ఉపాధ్యాయ సంఘాలు మాడుగుల ఘాట్‌ రోడ్డు కూడలిలో మంగళవారం దహనం చేశాయి. ఇటీవల విడుదల చేసిన పీఆర్‌సీ జీవోలు రద్దు చేయాలని, 30 శాతం ఫిట్‌మెంటు మంజూరు చేయాలని, పాత హెచ్‌ఆర్‌ఏ విధానాన్ని కొనసాగించాలని, సీపీఎస్‌ రద్దు, పెన్షనర్లకు ఇచ్చే అడిషనల్‌ క్వాంటమ్‌ పెన్షన్‌ 10 సంవత్సరాలు వయసు నుంచి కొనసాగించాలని డిమాండు చేశారు. అనంతరం మానవహారంగా ఏర్పడి తమకు నష్టం కలిగించేలా విడుదల చేసిన జీవోలను దహనం చేశారు.

బుచ్చెయ్యపేటలో ఉపాధ్యాయులందరూ మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. పీఆర్‌సీ జీవో ప్రతులను మంటల్లో వేసి దహనం చేశారు. ఏపీటీఎఫ్‌ జిల్లా మాజీ అధ్యక్షుడు తమరాన త్రినాథ్‌, జిల్లా కార్యదర్శి ఎస్‌.దుర్గాప్రసాద్‌, మండల అధ్యక్ష, కార్యదర్శులు దేముడుబాబు, మధుకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

గొలుగొండ మండలం ఏఎల్‌పురంలో ఏపీటీఎఫ్‌ నాయకుడు సీిహెచ్‌.నర్సింహమూర్తి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నూతన పీఆర్‌సీ జీవో కాపీలను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ప్రధాన కార్యదర్శి ఇచ్చిన పీఆర్‌సీ నివేదిక ఆమోదించడానికి ఉద్యోగులు సిద్ధంగా లేరని పేర్కొన్నారు. ఇంటి అద్దె తగ్గించడం ఆమోదయోగ్యం కాదన్నారు. పాత శ్లాబ్‌లు అమలు చేయాలని కోరారు. పింఛనుదార్లకు అదపున క్వాంటమ్‌ ఆఫ్‌ పింఛను 70 సంవత్సరాలకు ఇవ్వాలని కోరారు. పాత పింఛను పథకం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

ఎలమంచిలి పట్టణం: పీఆర్‌సీ జీవోలను ఎలమంచిలిలో ఉపాధ్యాయ సంఘ నాయకులు మంటల్లో వేసి దహనం చేశారు. ఇంటి అద్దె భత్యం, 23 శాతం ఫిట్‌మెంట్‌ కాపీల ప్రతులను మంటల్లో వేశారు. మోసపూరిత పీఆర్సీని బహిష్కరిద్దాం అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం అర్ధరాత్రి ఇచ్చిన జీవోలను వెంటనే రద్దు చేసి ఉద్యోగులకు జీతం పెరిగేలా కొత్త జీవోలను విడుదల చేయాలని డిమాండు చేస్తూ పాత జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయ సంఘ నాయకులు ఎల్లయ్యబాబు, సన్యాసిరావు, రాణి, మల్లిపాటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

మునగపాక: మునగపాకలో మండల ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ మునగపాక కూడలిలో రాస్తారోకో చేశారు. ఉద్యోగుల హక్కులకు నష్టం కలిగించకుండా పీఆర్‌సీని సవరించాలని డిమాండ్‌ చేశారు. జీఓ ప్రతులను దహనం చేశారు. ఈ ఆందోళనలో నాయకులు రామ్మోహనరావు, ఉమామహేశ్వరరావు, ఎం.వై.రాము, సన్యాసినాయుడు, కేవీ సూర్యనారాయణ, భీశెట్టి సీతారామ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని