logo

విజయం.. స్వర్ణాక్షరాల లిఖితం

భారత పెట్రోలియం, శక్తి సంస్థ (ఐఐపీఈ) ఏర్పడ్డాక శుక్రవారం తొలిస్నాతకోత్సవం నిర్వహించుకుంటోంది. 2016-20, 2017-21 బ్యాచ్‌కు చెందిన విద్యార్థులు ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు చేతుల మీదుగా పట్టాలందు కోబోతున్నారు.

Published : 21 Jan 2022 04:28 IST

ఐఐపీఈలో బంగారు పతకాలు సాధించిన విద్యార్థులు
న్యూస్‌టుడే, ఏయూ ప్రాంగణం

ఇష్టమైన కోర్సుల్లో చేరితే..
మన భవిష్యత్తును మనమే తీర్చుదిద్దుకోవచ్చు..
చక్కటి ‘బంగరు’ బాటలు వేసుకోవచ్చు. దీన్ని ఆచరించి చూపించారు.. కొందరు ఐఐపీఈ విద్యార్థులు. తాము నేర్చుకున్న కోర్సుల్లో అగ్రగ్రాములుగా నిలిచి.. అందులో బంగారు పతకాలు సాధించి..  స్నాతకోత్సవ వేళ నేడు వాటిని అందుకోనున్నారు.

భారత పెట్రోలియం, శక్తి సంస్థ (ఐఐపీఈ) ఏర్పడ్డాక శుక్రవారం తొలిస్నాతకోత్సవం నిర్వహించుకుంటోంది. 2016-20, 2017-21 బ్యాచ్‌కు చెందిన విద్యార్థులు ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు చేతుల మీదుగా పట్టాలందు కోబోతున్నారు.
అంతేకాదు.. ఈ కోర్సుల్లో ఆరుగురు విద్యార్థులు అగ్రగాములుగా నిలిచి బంగారు పతకాలు కైవసం చేసుకున్నారు. వారిలో నలుగురు విద్యార్థులు మన రాష్ట్రం వారు కాగా.. ముగ్గురు విశాఖ వాసులు కావడం విశేషం. ఈ సందర్భంగా వారు ‘న్యూస్‌టుడే’తో మాట్లాడారు.


చిన్నప్పటి నుంచే...

మాది తూర్పుగోదావరి జిల్లా అమలాపురం. మా ప్రాంతంలో ఒ.ఎన్‌.జి.సి ఉంది. చిన్నతనం నుంచి పెట్రోల్‌ రిఫైనరీ చూస్తూ పెరిగాను. అప్పటి నుంచే అందులో పనిచేయాలని కోరిక కలిగింది. జె.ఇ.ఇ. అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంక్‌ వచ్చింది. థన్‌బాద్‌ ఐఐపీఈలో చేరాలనుకున్నాను. అక్కడ సీటు రాలేదు. 2017-21 బ్యాచ్‌లో విశాఖపట్నం ఐఐపీఈలో పెట్రోలియం ఇంజినీరింగ్‌లో సీటు వచ్చింది. ఐఐటీ ఖరగ్‌పూర్‌ మెంటార్‌ కావడంతో ఇక్కడ చేరాను. ‘ఈనాడు’ దినపత్రికలో వచ్చిన వార్త చదివాక నాకు గోల్డ్‌ మెడల్‌ వచ్చినట్లు తెలిసింది. చాలా అనందంగా ఉంది. నేను ఇప్పుడు ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌లో పనిచేస్తున్నాను.  

- దంగేటి శ్రీకార్తీక్‌ (2017-21)


పుట్టి పెరిగిన ఊరిలోనే చదువు, ఉద్యోగం...!

మాది పెదవాల్తేరు. విశాఖలోనే నా చదువంతా సాగింది. ప్రస్తుతం కెమికల్‌ ఇంజినీరింగ్‌కు మంచి డిమాండ్‌ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఐచ్ఛికాన్ని ఎంచుకున్నాను. నాకు గోల్డ్‌మెడల్‌ వస్తుందని భావించలేదు. ఐఐపీఈ ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోంది. కొత్తగా చేరే విద్యార్థులు బాగా కష్టపడాలి.  నేను ప్రస్తుతం విశాఖలోని మల్కాపురం హెచ్‌.పి.సి.ఎల్‌.లో ఆపరేషన్స్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాను.

-భమిడిపాటి సాయి హర్ష (2016-20)


పెద్ద కంపెనీల భాగస్వామ్యం ఉంది...

విశాఖపట్నం ఐఐపీఈలో పెద్ద పెద్ద కంపెనీలకు భాగస్వామ్యం ఉంది. ఇందులో చేరిన విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది. భవిష్యంతా కంప్యూటర్‌ సైన్స్‌, అప్లికేషన్స్‌, పెట్రోలియం ఇంజినీరింగ్‌పైనే ఆధార పడుతుంది. జె.ఇ.ఇ.లో మంచి ర్యాంకు రావడంతో సొంత ఊరులోనే చదువుకోవాలనుకున్నాను. నాకు ఇష్టమైన పెట్రోలియం ఇంజినీరింగ్‌లో సీటు వచ్చింది. తొలినుంచి ఇనిస్టిట్యూట్‌లో టాపర్‌గా ఉండడంతో బంగారు పతకం తప్పకుండా వస్తుందని భావించాను.

- కందాళ విశ్వకాంత్‌ (2016-20)


కష్టపడిత చదివితేనే భవిష్యత్తు

మాది గాజువాక. మా నాన్న పెట్రోల్‌ బంక్‌ నడుపుతున్నారు. దీంతో పెట్రోల్‌కు సంబంధించిన కోర్సు చదవాలని చిన్నతనం నుంచే ఆసక్తి ఉండేది. జె.ఇ.ఇ.లో మంచి ర్యాంకు రావడంతో ఎక్కడ పెట్రోల్‌కు సంబంధించిన కోర్సులు ఉన్నాయో వెతికాను. విశాఖలోనే ఐఐపీఈ ఉందని, ఐఐటీ ఖరగ్‌పూర్‌ మెంటార్‌ అని తెలుసుకొని చేరాను. బంగారు పతకం వచ్చినట్లు గురువారమే నాకు విషయం తెలిసింది. విద్యార్థులు కష్టించి చదివితే మంచి భవిష్యత్తు ఉంటుందని నమ్ముతాను. ప్రస్తుతం బహుళజాతి కంపెనీలో పనిచేస్తున్నాను.  

-కొనల రేష్మారెడ్డి (2017-21)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని