logo

‘వైకాపా పాలనలో మహిళలపై అకృత్యాలు’

రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై హత్యలు, అత్యాచారాలు, లైంగిక వేధింపులను వైకాపా నాయకులే ప్రోత్సహిస్తున్నారని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత

Published : 22 Jan 2022 02:15 IST

నక్కపల్లి పోలీసుస్టేషన్‌ వద్ద మాట్లాడుతున్న అనిత

పాయకరావుపేట, నక్కపల్లి, న్యూస్‌టుడే: రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై హత్యలు, అత్యాచారాలు, లైంగిక వేధింపులను వైకాపా నాయకులే ప్రోత్సహిస్తున్నారని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. వీటిపై కేంద్ర ప్రభుత్వంతో విచారణ చేయించాలని కోరుతూ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడికి శుక్రవారం విశాఖలో వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. అత్యాచార ఘటనలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టడంలో అటు ప్రభుత్వం.. ఇటు పోలీసు శాఖ పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. నక్కపల్లి పోలీసు స్టేషన్‌ వద్ద రాజయ్యపేట అత్యాచార బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించారు. సీఐ నారాయణరావుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్లలో ఇలాంటి ఘటనలు జరిగితే ఇలాగే స్పందిస్తారా అని ప్రశ్నించారు. ఆడపిల్లలున్న సీఎం, హోం మంత్రి, ఆడవారికి రక్షణ కల్పించాలని, చేతగాకపోతే రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలన్నారు. బాధితులకు న్యాయం చేయాల్సిందిపోయి మాన, ప్రాణాలకు వెలకట్టి చేతులు దులిపేసుకుంటున్నారని విమర్శించారు. రాజయ్యపేట ఘటనలో బాలిక నిందితుడి పేరు చెబితే భయంతో వణికిపోతోందని, ఈ కేసులో నిందితుడికి బెయిల్‌ రాకుండా కఠిన శిక్ష పడేలా చూడాలని కోరారు.

* నిందితుడిని కఠినంగా శిక్షించాలని కాపు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ వీసం రామకృష్ణ, జడ్పీటీసీ సభ్యురాలు కాసులమ్మ, వైస్‌ ఎంపీపీ నానాజీ డిమాండు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పోలీసులను కోరారు. జనసేన, సీపీఎం నాయకులు బోడపాటి శివదత్‌, అప్పలరాజు, మత్స్యకార సంఘ నాయకులు వెంకటేష్‌, శ్రీను, శివ, గుర్రన్న తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు.

* బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో నిందితుడు నాగేశ్‌ పోలీసుల అదుపులో ఉన్నాడు. కేసు దర్యాప్తులో భాగంగా సీఐ, మహిళా ఎస్సై బాలిక, ఆమె కుటుంబ సభ్యులను శుక్రవారం ఘటనా స్థలానికి తీసుకువెళ్లి పరిసరాలను పరిశీలించారు.

* కొద్దిరోజుల కిందట చినదొడ్డిగల్లులో బడికి వెళుతున్న బాలికను స్థానికుడు లైంగిక వేధింపులకు పాల్పడటం, పోలీసులు అతడిపై పోక్సో కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయడం తెలిసిందే. డొంకాడ నుంచి తుని, పాయకరావుపేటలోని కళాశాలలకు వెళ్లే విద్యార్థినులు కొందరు యువకులు వేధింపులకు గురిచేస్తున్నారటూ గురువారం ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు ఇంకా నమోదు కాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని