logo

పదకొండేళ్ల బాలికపై అత్యాచారం

అభంశుభం తెలియని పదకొండేళ్ల బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన నక్కపల్లి మండలం రాజయ్యపేటలో జరిగింది. వంట చెరకు కోసం వెళ్లిన సమయంలో నోట్లో

Published : 22 Jan 2022 02:15 IST

రాజయ్యపేటలో దారుణం

స్థానికుల ఆగ్రహం

నక్కపల్లి, న్యూస్‌టుడే: అభంశుభం తెలియని పదకొండేళ్ల బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన నక్కపల్లి మండలం రాజయ్యపేటలో జరిగింది. వంట చెరకు కోసం వెళ్లిన సమయంలో నోట్లో గుడ్డలు కుక్కి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని పేర్కొంటూ బాలిక తల్లిదండ్రులు, గ్రామస్థులు శుక్రవారం నక్కపల్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీఐ నారాయణరావు తెలిపిన వివరాల ప్రకారం.. రాజయ్యపేటకు చెందిన ఏడో తరగతి బాలిక ఆమె అక్కతో కలిసి సాయంత్రం పాఠశాల ముగిసిన తర్వాత ఇంటికి వచ్చారు. వంట చెరకు కోసం సోదరి సమీపంలో ఉన్న తోటకు వెళ్లగా.. కొద్దిసేపటి తర్వాత అక్కను వెతుక్కుంటూ మరో దారిలో ఈమె కూడా వెళ్లింది. గ్రామానికి చెందిన యువకుడు గొడ్డు నాగేశ్‌ (22) బాలిక ఒంటరిగా రావడం గమనించి ఆమె నోట్లో గుడ్డలు కుక్కి తోటలోకి లాక్కెళ్లాడు. తప్పించుకునేందుకు యత్నించగా తీవ్రంగా కొట్టాడు. మెడ పట్టుకుని చంపుతానని బెదిరించి వివస్త్రను చేసి సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. అనంతరం అత్యాచారానికి పాల్పడ్డాడు. మీ అమ్మ, సోదరి స్నానం చేస్తున్నప్పుడు వీడియో తీసి తనకు వాట్సాప్‌ చేయాలని, ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ చాకుతో బెదిరించాడు. చీకటి పడుతున్నా.. చిన్న కుమార్తె ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల ఇళ్లలో ఆరా తీస్తుండగా రాత్రి తొమ్మిది గంటల సమయంలో నాగేశ్‌ బాలికతో వచ్చి దొండవాక వెళ్తుండగా కనిపిస్తే తీసుకువచ్చినట్లు చెప్పి దించి వెళ్లిపోయాడు. అతడు వెళ్లిన తర్వాత బాలిక విలపిస్తూ.. జరిగిన విషయం చెప్పడంతో బంధువులతో కలిసి పోలీసు స్టేషన్‌కు రాగా.. ఉదయాన్నే రావాలని పోలీసులు చెప్పడంతో వెనక్కు వచ్చేశారు. శుక్రవారం ఉదయాన్నే స్థానికులతో కలిసి నక్కపల్లి స్టేషన్‌కు వచ్చి సీఐకి ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ నారాయణరావు చెప్పారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను విశాఖ కేజీహెచ్‌కు పంపారు. నిందితుడు నాగేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని