logo

ముగ్గురూ.. ముగ్గురే..!

నేటితరం చిన్నారులు చదువుతో పాటు తమకు ఇష్టమైన రంగంలో రాణించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పారిశ్రామిక ప్రాంతం అజంతాకాలనీకి చెందిన ముగ్గురు బాలికలు చిన్నతనం నుంచే కరాటే శిక్షణ

Updated : 22 Jan 2022 05:20 IST

అంతర్జాతీయ కరాటే పోటీల్లో బంగారు పతకాలు

సాధన చేస్తున్న బాలికలు

నేటితరం చిన్నారులు చదువుతో పాటు తమకు ఇష్టమైన రంగంలో రాణించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పారిశ్రామిక ప్రాంతం అజంతాకాలనీకి చెందిన ముగ్గురు బాలికలు చిన్నతనం నుంచే కరాటే శిక్షణ తీసుకుంటూ... ఇటీవల నగరంలో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో స్వర్ణ పతకాలు సాధించి... ఔరా అనిపించారు.

ఈ ఏడాది జనవరి 8, 9వ తేదీల్లో విశాఖ స్వర్ణభారతి ఇండోర్‌ స్టేడియంలో జరిగిన అంతర్జాతీయ కరాటే పోటీలకు మొత్తం 9 దేశాల నుంచి క్రీడాకారులు పాల్గొనాల్సి ఉన్నా... కొవిడ్‌, ఒమిక్రాన్‌ తీవ్రత దృష్ట్యా భారత్‌తో పాటు, శ్రీలంక, నేపాల్‌, భూటాన్‌, బంగ్లాదేశ్‌కు చెందిన క్రీడాకారులు మాత్రమే పాల్గొన్నారు.

* ఈ పోటీల్లో పారిశ్రామిక ప్రాంతానికి చెందిన అక్కాచెల్లెళ్లు అంగ శ్రీవత్సవ వైష్ణవి(తొమ్మిదో తరగతి), అంగ నిత్యవర్షిణి(ఏడో తరగతి)తో పాటు జి.లోహిత విజ్ఞాన నవ్యశ్రీ(ఆరో తరగతి) బంగారు పతకాలు సాధించారు.

అక్కాచెల్లెళ్లు.. అదుర్స్‌..

స్థానికంగా నివాసం ఉండే అంగ గౌరీశంకరప్రసాద్‌ 2014లో అకాల మరణం చెందారు. ఆయనకు కరాటే అంటే మక్కువ. తండ్రికి ఇష్టమైన క్రీడలో రాణించేలా శ్రీవత్సవ, నిత్యవర్షిణిని కుటుంబీకులు ప్రోత్సహిస్తున్నారు. గుల్లలపాలెం మార్కెట్‌ ఆవరణలో శిక్షకులు సీహెచ్‌.శ్రీనివాసరావు, సీహెచ్‌.సాయిగిరీష్‌, సీహెచ్‌.నవీన్‌ వద్ద చిన్నారులిద్దరూ శిక్షణ తీసుకుంటూ.. వివిధ స్థాయి పోటీల్లో రాణిస్తున్నారు.

న్యూస్‌టుడే, సింధియా

శ్రీవత్సవ విజయాలు..

* విశాఖ- ఎండాడలో 2018 ఆగస్టు 19న జరిగిన జిల్లాస్థాయి పోటీల కాటా విభాగంలో బంగారు, కుమిటీలో రజత పతకాలు సొంతం చేసుకుంది.

* సెప్టెంబర్‌ 9న స్వర్ణభారతి ఇండోర్‌ స్టేడియంలో జాతీయస్థాయి కుమిటీ పోటీల్లో రజతం.

* 2019 జనవరి 20న కరీంనగర్‌లో, ఫిబ్రవరి 17న విశాఖ రాజీవ్‌గాంధీ ఇండోర్‌ స్టేడియంలో జరిగిన జాతీయస్థాయి కుమిటీ, కాటా పోటీల్లో బంగారు పతకాలు.

* 2019 మార్చి 17న అనంతపురంలో జరిగిన రాష్ట్రస్థాయి కుమిటీ పోటీల్లో బంగారు పతకం.

* సెప్టెంబర్‌లో గుజరాత్‌ వడోదరాలో జరిగిన అంతర్జాతీయ కాటా, కుమిటీ పోటీల్లో బంగారు పతకాలు. వీటితో పాటు వివిధ స్థాయిల్లో సాధించిన అనేక పతకాలు శ్రీవత్సవ సొంతం.


శెభాష్‌..నిత్య వర్షిణి

* 2021 ఫిబ్రవరి 7న విశాఖ మధురవాడ జీవీఎంసీ మైదానంలో జరిగిన రాష్ట్రస్థాయి కరాటే కుమిటీ పోటీల్లో రజత పతకం సాధించింది.

* మార్చి 14న వరంగల్‌లో జరిగిన సౌత్‌ ఇండియా స్థాయి కాటా పోటీల్లో బంగారం, కుమిటీలో రజతం.

* ఆగస్టు 8న మారికవలసలో జరిగిన దక్షిణ భారతదేశం స్థాయి కాటా పోటీల్లో బంగారు పతకం.


ఔరా..నవ్యశ్రీ..!

ఆరో తరగతి చదువుతున్న జి.లోహిత విజ్ఞాన నవ్యశ్రీ తండ్రి శ్రీధర్‌ నేవల్‌ డాక్‌యార్డులో ఉద్యోగం చేస్తున్నారు. ఆయన శరీర సౌష్ఠవ పోటీల్లో పాల్గొని తరచూ పతకాలు సాధిస్తుంటారు. ఆయన ప్రతిభకు క్రీడా కోటాలో ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. తండ్రి స్ఫూర్తితోనే నవ్యశ్రీ చిన్నతనం నుంచి కరాటేలో శిక్షణ తీసుకుంటూ.. పతకాలు సాధిస్తుంది.

* 2021 ఫిబ్రవరి 7న మధురవాడ జీవీఎంసీ మైదానంలో జరిగిన రాష్ట్రస్థాయి కాటా పోటీల్లో కాంస్యం పతకం సాధించింది.

* మార్చి 14న వరంగల్‌లో జరిగిన సౌత్‌ఇండియా స్థాయి కాటా, కుమిటీ పోటీల్లో బంగారు పతకాలు.

* అక్టోబర్‌ 10న విశాఖ స్వర్ణభారతి స్టేడియంలో జరిగిన జాతీయస్థాయి

కాటా, కుమిటీ పోటీల్లో బంగారు పతకాలు సొంతం చేసుకుని.. పలువురు ప్రశంసలు అందుకుంది.


భవిష్యత్తులో క్రీడాకోటాలో ఉద్యోగాలు సాధించడమే తమ లక్ష్యమని చిన్నారులు తెలిపారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని