logo

ఐ.ఐ.పి.ఇ. డైరెక్టర్‌కు చేదు అనుభవం

భారత పెట్రోలియం, శక్తి సంస్థ (ఐ.ఐ.పి.ఇ.) డైరెక్టర్‌ ఆచార్య వి.ఎస్‌.ఆర్‌.కె.ప్రసాద్‌కు శుక్రవారం చేదు అనుభవం ఎదురైంది. స్నాతకోత్సవంలో పాల్గొనడానికి వీలుగా ఆయన

Published : 22 Jan 2022 02:48 IST

ఈనాడు, విశాఖపట్నం: భారత పెట్రోలియం, శక్తి సంస్థ (ఐ.ఐ.పి.ఇ.) డైరెక్టర్‌ ఆచార్య వి.ఎస్‌.ఆర్‌.కె.ప్రసాద్‌కు శుక్రవారం చేదు అనుభవం ఎదురైంది. స్నాతకోత్సవంలో పాల్గొనడానికి వీలుగా ఆయన వి.ఎం.ఆర్‌.డి.ఎ. బాలల ప్రాంగణానికి ఉదయం 9గంటలకు చేరుకున్నారు. ఆ సంస్థకు ఆయనే అధిపతి. ఉపరాష్ట్రపతి భద్రత సిబ్బంది నిబంధనల ప్రకారం ప్రాంగణంలోకి వెళ్లే వారి జాబితాను ఆ సంస్థ అధికారులు తయారు చేసి పోలీసులకు ఇచ్చారు. సంస్థ అధిపతి కావడంతో ఆయనకు పాస్‌, అనుమతులు ఎందుకనే ఉద్దేశంతో ఆయన పేరును ఆ జాబితాలో పొందుపరచలేదు. దీంతో పోలీసులు ఆయన్ను ఆపేశారు. ఉపరాష్ట్రపతి భద్రత ప్రమాణాల ప్రకారం జాబితాలో పేరున్న వాళ్లను మాత్రమే లోపలికి పంపుతామని చెప్పేసరికి ఆచార్య వి.ఎస్‌.ఆర్‌.కె.ప్రసాద్‌ హతాశులయ్యారు. వారిని ప్రశ్నించినా తమ చేతుల్లో ఏమీ లేదంటూ పోలీసులు చేతులెత్తేశారు. దీంతో ఆయన రెవెన్యూ అధికారులకు ఫోన్‌ చేసి... ఉపరాష్ట్రపతి భద్రత సిబ్బంది అనుమతి తీసుకుని, ఆ విషయాన్ని పోలీసులకు అధికారికంగా చెప్పిన తరువాత లోపలికి పంపించారు.

మరికొందరు కూడా: ఉపరాష్ట్రపతి కాన్వాయ్‌తోపాటు వచ్చిన రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కోలా గురువులు, శ్రీవెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యుడు జానకిరామ్‌ల కార్లను కూడా పోలీసులు ఆపేశారు. జాబితాలో పేర్లు లేకపోతే లోనికి పంపే ప్రసక్తే లేదని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ మున్సిపల్‌ ఛైర్మన్‌ బల్ల గిరిబాబు ప్రాంగణం సమీపానికి వచ్చినా లోనికి రాలేదు. గేటు దగ్గరికి రాకుండానే సమీపంలోని ఓ చెట్టు దగ్గరే ఆగిపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని