logo

వినూత్న ఆలోచన.. అద్భుత ఆవిష్కరణ

మదిలో మెదిలిన వినూత్న ఆలోచనలకు రూపమిస్తూ అద్భుత ఆవిష్కరణ చేసి తమదైన శైలిలో ముందుకెళ్తున్నారు. జాతీయ స్థాయిలో విజయాలు అందుకుంటూ తమ ప్రతిభను నిరూపిస్తున్నారు మధురవాడ

Published : 22 Jan 2022 02:48 IST

అటల్‌ స్పేస్‌ ఛాలెంజ్‌ విజేతలుగా గురుకులం విద్యార్థినులు

జాతీయ స్థాయిలో సత్తాచాటిన‘ధావన్‌ స్పేస్‌ రోవర్‌’ నమూనా

కొమ్మాది, న్యూస్‌టుడే

మదిలో మెదిలిన వినూత్న ఆలోచనలకు రూపమిస్తూ అద్భుత ఆవిష్కరణ చేసి తమదైన శైలిలో ముందుకెళ్తున్నారు. జాతీయ స్థాయిలో విజయాలు అందుకుంటూ తమ ప్రతిభను నిరూపిస్తున్నారు మధురవాడ రిక్షా కాలనీలోని బాలయోగి గురుకుల ప్రతిభ పాఠశాల విద్యార్థినులు. ‘ఉమెన్‌ సేఫ్టీ డివైజ్‌’ను తయారు చేసి ‘అటల్‌ ఇన్నోవేషన్‌ మారథాన్‌’కు ఎంపికైన కొద్దిరోజుల్లోనే ‘ధావన్‌ స్పేస్‌ రోవర్‌’ పరికరాన్ని ఆవిష్కరించి జాతీయ స్థాయిలో ఖ్యాతి పొంది ‘అటల్‌ స్పేస్‌ ఛాలెంజ్‌’ విజేతలుగా నిలిచారు.

దేశవ్యాప్తంగా నిర్వహించిన పోటీల్లో..

అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్‌ కార్యక్రమంలో భాగంగా ఉపగ్రహ సైన్స్‌, సాంకేతికత విభాగంలో నీతి ఆయోగ్‌, ఇస్రో, సీబీఎస్‌ఈ సంయుక్తంగా గతేడాది అక్టోబరు(4 తేది నుంచి 10 వరకు) నెలలో ‘వరల్డ్‌ స్పేస్‌ వీక్‌-2021’ పేరిట జాతీయ స్థాయి పోటీలు నిర్వహించారు. అంతరిక్షంలో మనుషులు ఎదుర్కోనున్న సవాళ్లు, పరిష్కారాలను అన్వేషించడం ఇతివృత్తంగా పాఠశాల స్థాయిలో చేపట్టిన ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా 6,500 మంది విద్యార్థులు పాల్గొని 2,500 నమూనాలతో ఆన్‌లైన్‌లో పోటీపడ్డారు. ఇందులో ఉత్తమమైన 75 నమూనాలను ఎంపిక చేశారు. వీటిలో ఏపీ నుంచి మూడు ప్రాజెక్టులు ఎంపికకాగా అందులో మధురవాడ గురుకులంలో 8, 9 తరగతులకు చెందిన ఎం.ఊర్మిళ, వై.జెస్సికా, ఆర్‌.అరుంధతి తయారు చేసిన ‘ధావన్‌ స్పేస్‌ రోవర్‌’ పరికరం ప్రథమ స్థానంలో నిలిచింది. గైడ్‌ ఉపాధ్యాయుడు టి.రాంబాబు సారధ్యంలో ఈ పరికరాన్ని రూపొందించి జాతీయ స్థాయిలో మెరిశారు. త్వరలో నీతి ఆయోగ్‌ నిర్వాహకులు ముగ్గురు విద్యార్థినులకు అతిథుల చేతులమీదుగా బహుమతులు అందించనున్నారు.

అంతరిక్షంలో ప్రయాణించేలా..

అంతరిక్షంలోని గ్రహాల్లో ప్రయాణించేలా ‘ధావన్‌ స్పేస్‌ రోవర్‌’ పరికరానికి రూపకల్పన చేశారు. 6డీసీ మోటార్లు, ఎల్‌298 మాడ్యూల్‌, ఆర్డినోబోర్డ్‌, ఆండ్రాయిడ్‌ ఇంటర్‌ఫేస్‌, బ్యాటరీలతో రాకర్స్‌ను అనుసంధానించారు. ఎత్తుపల్లాలపై సులభంగా ప్రయాణించి, అక్కడ ఉన్న సమాచారాన్ని శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ ద్వారా మొబైల్‌కి sppbluetooth యాప్‌ను అనుసంధానిస్తూ పరికరాన్ని ఓ నమూనాగా రూపకల్పన చేశారు. విద్యార్థినులు రూపొందించిన పరికరానికి గుర్తింపు రావడంతో విద్యార్థినులతో పాటు గైడ్‌ ఉపాధ్యాయుడు టి.రాంబాబును గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి హర్షవర్థన్‌, సంస్థ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కె.సునీత, గురుకులాల సమన్వయకర్త ఎస్‌.రూపావతి, ప్రిన్సిపల్‌ ఎస్‌.వి.రమణ, వైస్‌ ప్రిన్సిపల్‌ రామ్‌ప్రసాద్‌ అభినందించారు.

విజేతలకు అభినందిస్తున్న గురుకుల విద్యాలయం నిర్వాహకులు


ఏటీఎల్‌ సహకారంతో..

నూతన ఆవిష్కరణల రూపకల్పనే లక్ష్యంగా ఏర్పాటైన అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌(ఏటీఎల్‌) సహకారంతో సైన్సు ఉపాధ్యాయులు రాంబాబు నేతృత్వంలో ధావన్‌ స్పేస్‌ రోవర్‌ నమూనాను మేం తయారు చేశాం. దీనికి జాతీయ స్థాయిలో చోటు దక్కించుకోవడం మాలో మరింత స్ఫూర్తిని కలిగించింది. పరిశోధనల వైపు గురుకులం ప్రోత్సహించడంతోనే సమాజానికి పనికొచ్చే ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతున్నాం.

- ఊర్మిళ, 8వ విద్యార్థిని


పరిశోధనలవైపు ఆసక్తి పెంచేలా..

విద్యార్థుల్లో దాగిఉన్న ప్రజ్ఞను పసిగట్టి వాటిలో తర్ఫీదు ఇవ్వడం, పదునుపెట్టడం వల్ల వ్యక్తిత్వ వికాసం పెరుగుతుంది. విభిన్న పద్ధతుల్లో విద్యాబోధన చేస్తున్నాం. ఏటీఎల్‌ సహకారంతో పరిశోధనల వైపు ఆసక్తి పెంచి నూతన ఆవిష్కరణలు చేపట్టేలా కృషి చేస్తున్నాం. 75 నమూనాల్లో ధావన్‌ స్పేస్‌ రోవర్‌ నమూనాను నీతి ఆయోగ్‌, అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్‌ నిర్వాహకులు ట్విట్టర్‌లో పెట్టి ప్రశంసించడం గర్వించదగ్గ విషయం.

- టి.రాంబాబు, ఏటీఎల్‌ ల్యాబ్‌ ఇన్‌చార్జ్‌, ఏపీ బాలయోగి గురుకులం, మధురవాడ


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని