logo

పేదలైనా.. రూ. లక్షలు కట్టాల్సిందే!

ఆక్రమిత స్థలాల క్రమబద్థీకరణకు ఉద్దేశించిన జీవో నెంబరు-225 అమలు అధికారులకు కత్తిమీద సాములా మారగా...పేదలకు మాత్రం ఊహించని భారంగా మారిందంటున్నారు. 75 చదరపు గజాల వరకే

Updated : 22 Jan 2022 05:18 IST

ఆక్రమిత స్థలాల క్రమబద్ధీకరణకు నోటీసులు

అందులో విలువ చూసి బెంబేలెత్తుతున్న ప్రజలు

న్యూస్‌టుడే, ఎంవీపీకాలనీ, విశాలాక్షినగర్‌, వేపగుంట, న్యూస్‌టుడే, గాజువాక: ఆక్రమిత స్థలాల క్రమబద్థీకరణకు ఉద్దేశించిన జీవో నెంబరు-225 అమలు అధికారులకు కత్తిమీద సాములా మారగా...పేదలకు మాత్రం ఊహించని భారంగా మారిందంటున్నారు. 75 చదరపు గజాల వరకే ఉచితంగా క్రమబద్థీకరిస్తామని చెప్పిన ప్రభుత్వం ఆపై ఒక్క చ.గ. అదనంగా ఉన్నా మొత్తం స్థలానికి నిర్దేశిత ధర కట్టాల్సిందేనంటూ డిమాండు నోటీసుల్లో పేర్కొంటోంది. దీంతో ‘మాకొద్దు బాబోయ్‌.’ అంటూ పలువురు లబ్ధిదారులు వెనకడుగు వేస్తున్నారు. 2019 రిజిస్ట్రేషన్‌ విలువ ప్రకారం 75 నుంచి 150 గజాల లోపు వారు స్థలం మూలవిలువలో 75శాతం, 150 నుంచి 300 గజాల వరకు శతశాతం రిజిస్ట్రేషన్‌కు చెల్లించేలా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

* అర్హులైన లబ్దిదారులకు నివాస స్థలం క్రమబద్ధీకరణకు చెల్లించాల్సిన రిజిస్ట్రేషన్‌ మొత్తం విలువతో సహా రెవెన్యూ అధికారులునోటీసులు జారీ చేశారు. వాటిని చూసి లబ్ధిదారులు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఉదాహరణకు గత ప్రభుత్వ హయాంలో ఓ ప్రాంతంలో 130 చ.గ. స్థలం క్రమబద్ధీకరణకు రూ.65వేలు చెల్లిస్తే సరిపోయేది. ప్రస్తుతం రూ.18లక్షలు చెల్లించాలంటూ నోటీసులు జారీ అయ్యాయి. కొన్ని చోట్ల 75 చ.గ. స్థలంలో నివాసముంటున్న వారికి కూడా రూ.10.12లక్షల మేర చెల్లించాలంటూ నోటీసులు రావటం విశేషం. క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేయడానికి ముందే ఎంత నగదు చెల్లించాల్సి ఉంటుందనేది తెలియజేసి ఉంటే దరఖాస్తు చేయాలా వద్దా అనేది నిర్ణయించుకునేవారమని పలువురు పేర్కొంటున్నారు.

పెందుర్తి మండల పరిధిలో.. సుమారు 700మంది అభ్యంతరంలేని స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్నామని దరఖాస్తు చేసుకున్నారు. 225మంది క్రమబద్ధీకరణకు అర్హులని తేలారు. 92మంది వరకు 75గజాల లోపు స్థలాల్లో ఉన్నారు. ఇక మిగిలిన వారందరికీ నోటీసులు జారీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం మార్కెట్‌ విలువ ప్రకారం గజం ధర రూ. 15 వేల నుంచి 40వేల వరకు ఉంది. దీనిని బట్టి ఆయా ప్రాంతాల్లో అర్హులు రూ. 15 లక్షల నుంచి 60 లక్షల వరకు చెల్లిస్తే క్రమబద్ధీకరణ సాధ్యమవుతుంది. ‘నోటీసులు అందుకున్న రెండునెలల్లోగా క్రమబద్ధీకరించుకోవాలి. ప్రస్తుతానికి ఇంతవరకు ఎవరూ ముందుకు రాలేదు. సచివాలయ ఉద్యోగులతో సమాచారాన్ని చేరవేస్తున్నాం’ అని పెందుర్తి తహసీల్దార్‌ రామారావు పేర్కొన్నారు.

* విశాఖ తూర్పు నియోజకవర్గంలో.. సుమారు 1,733 మంది దరఖాస్తు చేయగా, వారిలో 765 మంది దరఖాస్తులు క్రమబద్ధీకరణకు అర్హత సాధించాయి.

* గాజువాక మండలంలో.. 75 చ.గ. స్థలాల్లో ఉన్న 47 మంది జీవోను వినియోగించుకోవడానికి డిమాండు నోటీసులు తీసుకుంటున్నారు. 75- 150 చ.గ.ల్లోపు 19మంది, 150-300 చ.గ.ల్లోపు ఆరుగురు ఉన్నట్లు గుర్తించారు. నోటీసులు ఇవ్వడానికి అధికారులు వెళ్తే ‘ఇంత భారంతో కూడిన క్రమబద్ధీకరణ మాకొద్దం’టూ వెనకడుగు వేయడంతో అవాక్కవుతున్నారు. 75 చ.గ.ల్లోపు వారే నోటీసులు తీసుకుంటున్నారని, పరిస్థితిని ఉన్నతాధికారులకు నివేదించామని డిప్యూటీ తహసీల్దార్‌ భారతి తెలిపారు.


రూ.18 లక్షలు చెల్లించాలన్నారు..

చినగదిలిలో 130 చ.గ. స్థలం క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేయగా.. రూ.18లక్షల మేర చెల్లించాలంటూ నోటీసులు అందజేశారు. మా ప్రాంతంలో ఒకరికైతే రూ.44 లక్షలు, మరొకరికి రూ.24లక్షలు చొప్పున చెల్లించాలంటూ నోటీసులు అందజేశారు. ఇంత మొత్తం ఎలా కట్టాలో తెలియని పరిస్ధితి.

-కొండలరావు, చినగదిలి


సంతోషం ఆవిరవుతోంది..: మేం పెందుర్తి కుమ్మర కాలనీలో ఉంటున్నాం. సుమారు 20 ఏళ్ల క్రితం 300గజాల్లో ఇల్లు నిర్మించుకున్నాం. క్రమబద్ధీకరణకు అవకాశం ఇవ్వడంతో సంతోషించాం. నోటీసుల్లో పేర్కొన్న అంకెలు చూసి కలవరపడ్డాం. నా భర్త కూలిపని చేసి కుటుంబాన్ని పోషిస్తున్నారు. ప్రస్తుతం మా స్థలాన్ని క్రమబద్ధీకరించుకోవాలంటే సుమారు రూ.60లక్షలు చెల్లించాల్సి ఉంది. అంత మొత్తం చెల్లించే వారమైతే మేం పేదలం ఎలా అవుతామన్నది ప్రభుత్వం గ్రహించి మా బాధలు ఆలకించాలి.

-చెల్లయ్యమ్మ, పెందుర్తి


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు