logo

వేర్వేరు ఘటనల్లో నలుగురి మృతి

ఐదు నిమిషాల్లో ఇంటికి చేరుకోవాల్సిన ఆ యువకుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఎదురుగా వస్తున్న బైకు బలంగా ఢీకొట్టడంతో అక్కడిక్కడే మరణించాడు. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

Published : 23 Jan 2022 04:22 IST


కోరుకొండ సురేష్‌ (పాతచిత్రం)

జిల్లాలోని వేర్వేరు ఘటనల్లో నలుగురు మృత్యువాత పడ్డారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

నర్సీపట్నం అర్బన్‌, న్యూస్‌టుడే: ఐదు నిమిషాల్లో ఇంటికి చేరుకోవాల్సిన ఆ యువకుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఎదురుగా వస్తున్న బైకు బలంగా ఢీకొట్టడంతో అక్కడిక్కడే మరణించాడు. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. నర్సీపట్నం - గబ్బాడ మార్గంలో నెల్లిమెట్ట సమీపంలో శనివారం రాత్రి 8.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పీనారిపాలెం కూడలిలో ఓ చికెన్‌ సెంటర్‌లో సహాయకుడిగా పనిచేస్తున్న అయ్యన్నకాలనీకి చెందిన కోరుకోండ సురేష్‌ (19) స్నేహితుడుతో కలిసి బుచ్చంపేట వైపు నుంచి బైకుపై నర్సీపట్నం వస్తున్నారు. ఎలమంచిలి మండలం పులపర్తికి చెందిన పి.సత్యనారాయణ, అతని మేనల్లుడైన గొలుగొండ మండలం పాకలపాడుకు చెందిన అంజూరి శంకరరావు, రోలుగుంట మండలం రత్నంపేటకు చెందిన మహిళ వరలక్ష్మితో కలిసి నర్సీపట్నం నుంచి బైకుపై రత్నంపేట వెళ్తున్నారు. బైకులు ఢీకొనడంతో ఈ ముగ్గురు తీవ్రంగా గాయపడగా సురేష్‌ స్నేహితుడు శ్యాం స్వల్పంగా గాయపడ్డాడు. వారంతా నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సురేష్‌ మృతదేహాన్ని అంబులెన్స్‌లో ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకువచ్చారు.

అరకులోయ, న్యూస్‌టుడే: వ్యాన్‌ ఢీకొని ఒకరు మృతి చెందారు. అరకులోయ పోలీసుల వివరాల ప్రకారం.. అరకులోయలోని శరభగుడకు చెందిన కొర్రా రామరాజు(35) స్థానిక గిరిజన కళా గ్రామంలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. గిరిజన సంక్రాంతి సందర్భంగా మూడు రోజులు ఇంట్లోనే ఉన్నారు. శనివారం ఉదయం విధులకు హాజరయ్యేందుకు ద్విచక్రవాహనంపై సహచరుడు గెమ్మెలి శేషుగిరిరావు(41)తో బయలుదేరాడు. ఐదు నిమిషాల్లో కళా గ్రామానికి చేరుకుంటారనగా మార్గమధ్యంలో పెట్రోల్‌బంక్‌ సమీపంలో ఎదురుగా వస్తున్న వ్యాన్‌ వీరిని ఢీకొంది. ఈ ప్రమాదంలో రామరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన శేషుని చికిత్స నిమిత్తం అరకులోయ వైద్య కేంద్రానికి, అక్కడి నుంచి పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.


లారీ ఢీ: రైతు..

చోడవరం గ్రామీణం, న్యూస్‌టుడే: చోడవరం నుంచి గోవాడ వెళ్లే మార్గంలో సోమేశ్వరరావు బంగ్లా సమీపాన చెరకు లారీ ఢీకొన్న సంఘటనలో ఓ పాడి రైతు శనివారం తెల్లవారుజామున మృతిచెందాడు. ఎస్సై విభీషణరావు కథనం ప్రకారం.. గోవాడ గ్రామానికి చెందిన ఏడువాక కోటి అప్పారావు (56) తన కుమారుడితో కలిసి ద్విచక్ర వాహనంపై పొలానికి వెళ్తుండగా ముందు వెళ్తున్న వ్యాన్‌ని తప్పించబోయాడు. అదే సమయంలో చోడవరం నుంచి గోవాడ వైపు చెరకు లోడుతో వస్తున్న లారీ ఢీకొనడంతో తలకు బలమైన గాయం కావడంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


కాలువలో పడి ..

ఎస్‌.రాయవరం, న్యూస్‌టుడే: మద్యం మత్తులో కాలువలో పడి వంటమాస్టర్‌ మృతి చెందిన ఘటన మండలంలోని తిమ్మాపురంలో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం.. తిమ్మాపురంలో నివాసం ఉంటున్న మోటూరి శ్రీనివాసరావు(48) ఎలమంచిలి మండలం పులపర్తిలోని ఓ హోటల్‌లో వంటమాస్టరుగా పనిచేస్తున్నారు. గ్రామంలోని ఆదర్శ పాఠశాలకు సమీపంలో ఉన్న మురుగు కాలువలో పడి ఉండటం చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సిబ్బందితో అక్కడకు చేరుకున్న ఎస్సై కాలువలో నుంచి శ్రీనివాసరావును బయటకు తీసి నక్కపల్లి ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే శ్రీనివాసరావు మృతిచెందాడని నిర్ధారించారు. మద్యం మత్తులో బహిర్భూమికి వెళ్తూ కాలువలో పడి మృతిచెంది ఉంటాడని పోలీసులు పేర్కొన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

అనకాపల్లి పట్టణం: జాతీయ రహదారి వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. రహదారి పక్కన ఆగి ఉన్న బొలేరో వాహనాన్ని ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులు అనకాపల్లి ఎన్టీఆర్‌ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనిపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని