logo

AP News: అమెరికాలో భారీ ప్యాకేజీతో విశాఖ యువతికి కొలువు

తొలి నుంచి సైన్సు పట్ల మక్కువ పెంచుకున్న రమ్యలేఖ ఇంటర్మీడియట్‌లో బైపీసీ గ్రూపులో చేరి... 98.5శాతం మార్కులతో ఉత్తీర్ణురాలయ్యారు. తర్వాత ఎంసెట్‌ రాసి 2,161 ర్యాంకు తెచ్చుకున్నారు. విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ సీటు...

Updated : 23 Jan 2022 08:10 IST

పరిశోధనా రంగాన మెరుపు!!

న్యూస్‌టుడే, విశాఖపట్నం

ఇంటర్‌ బైపీసీలో మంచి మార్కులు.. ఎంసెట్‌లో ఉత్తమ ర్యాంకు వచ్చిన చాలా మంది ఎంబీబీఎస్‌ వైపు మొగ్గు చూపుతారు. కానీ,  విశాఖ చెందిన మేడిద రమ్యలేఖ విభిన్నంగా ఆలోచించారు. అదే ఆమెకు ఇప్పుడు భారీ ప్యాకేజీతో కొలువును తెచ్చి పెట్టింది. రమ్య లేఖ విభిన్న ఆలోచన ఏమిటి.. ఆమె తన లక్ష్యాన్ని ఏవిధంగా చేరుకున్నారో... తెలుసుకుందాం.. 

తొలి నుంచి సైన్సు పట్ల మక్కువ పెంచుకున్న రమ్యలేఖ ఇంటర్మీడియట్‌లో బైపీసీ గ్రూపులో చేరి... 98.5శాతం మార్కులతో ఉత్తీర్ణురాలయ్యారు. తర్వాత ఎంసెట్‌ రాసి 2,161 ర్యాంకు తెచ్చుకున్నారు. విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ సీటు వచ్చినా వద్దనుకున్నారు. తిరుపతి ఎస్వీ పశువైద్య కళాశాలలో వెటర్నరీ సైన్స్‌ (పశువైద్యశాస్త్రం) కోర్సులో చేరారు. అందులో  ప్రథమ స్థానంలో ఉత్తీర్ణులయ్యారు. తర్వాత 2018లో పశుసంవర్థక శాఖలో సహాయ వైద్యురాలిగా ఉద్యోగం వచ్చినా వదులుకున్నారు. తన లక్ష్యానికి అనుగుణంగా జంతుశాస్త్రంలో పీహెచ్‌డీ చేసి శాస్త్రవేత్తగా స్థిరపడాలన్న ఆలోచనతో వివిధ పోటీ పరీక్షలకు హాజరయ్యారు.

అదే ఆలోచనగా...

విశాఖకు చెందిన వ్యాపారవేత్త మేడిద మురళీకృష్ణ, రమ దంపతుల కుమార్తె రమ్యలేఖ బాల్యం నుంచి చదువులో చురుకైన విద్యార్థినిగా పేరు తెచ్చుకున్నారు. ఆశీలుమెట్ట సమీపంలోని ఓ స్కూలులో పదో తరగతి (సీబీఎస్‌ఈ) చదివారు. పదికి పది పాయింట్లు తెచ్చుకున్నారు.  

* జీవన ప్రమాణాలు పెంచొచ్చు.: తనకు జంతువులన్నా, జంతుశాస్త్రం అన్నా తొలి నుంచి మక్కువ ఎక్కువని, ఈ కారణంగా జంతుశాస్త్రం ఆధారంగా పీహెచ్‌డీ పూర్తి చేశానని రమ్యలేఖ తెలిపారు. శాస్త్రవేత్త అయితే జంతువులు, మానవాళికి అవసరమైన ఔషధాలు కనిపెట్టవచ్చునని, తద్వారా జీవన ప్రమాణాల పెంపునకు దోహద పడవచ్చునన్నారు. తన ఉన్నతికి తల్లిదండ్రులు అండగా నిలిచారని, వివాహం అయ్యాక భర్త ప్రోత్సహించారని చెప్పారు. భర్త పి.ఆదర్స్‌ శాన్‌ఫ్రాన్సిస్‌కో నగరంలోని రాబిన్‌హుడ్‌ సంస్థలో కన్సల్టెంట్‌గా సేవలందిస్తున్నారన్నారు. వెటర్నరీ సైన్సెస్‌ కోర్సులు చేసిన వారికి మంచి ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయని పేర్కొన్నారు. 

* ప్రతిభకు గుర్తింపు: యూనివర్సిటీ ఆఫ్‌ మిన్నెసోట (అమెరికా) నిర్వహించిన ఉపకారవేతన పరీక్షల్లో ఉత్తీర్ణులై ఎమ్మెస్సీ సీటు సాధించారు. స్కాలర్‌ షిప్‌పై సీటు రావడంతో ఎటువంటి ఖర్చు లేకుండానే మిన్నెసోట వర్సిటీలో చేరారు. ఆమె ప్రతిభను గుర్తించిన వర్సిటీ అధికారులు ఎమ్మెస్సీ బదులు పీహెచ్‌డీలో చేర్చుకున్నారు. 2018లో పీహెచ్‌డీలో చేరిన రమ్యలేఖ ఈ ఏడాది జనవరి 18న కోర్సు పూర్తి చేసి పట్టా అందుకున్నారు. వెంటనే శాన్‌ఫ్రాన్సిస్‌స్కోలోని  రాణి థెరిప్యుటిక్స్‌ ఫార్మా సంస్థలో దాదాపు రూ.2కోట్ల ప్యాకేజీతో శాస్త్రవేత్తగా కొలువు లభించింది. సోమవారం నుంచి విధుల్లో చేరనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని