logo

బిల్డర్లపై ‘రేరా’ పిడుగు

నిర్మాణ రంగానికి చెందిన బిల్డర్లు ప్రతి మూడు నెలలకోసారి నివేదించాల్సిన త్రైమాసిక రిటర్న్స్‌ దాఖలు చేయకపోవడంపై ఏపీీ రెరా (రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేషన్‌ అథారిటీ) కన్నెర్న చేసింది.

Published : 23 Jan 2022 05:37 IST

త్రైమాసిక రిటర్న్స్‌ దాఖలు చేయలేదని వెల్లడి

ఉక్కిరిబిక్కిరవుతున్న వ్యాపారులు

నిర్మాణదారులకు భారీగా జరిమానా

ఈనాడు, విశాఖపట్నం

●●

నిర్మాణ రంగానికి చెందిన బిల్డర్లు ప్రతి మూడు నెలలకోసారి నివేదించాల్సిన త్రైమాసిక రిటర్న్స్‌ దాఖలు చేయకపోవడంపై ఏపీీ రెరా (రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేషన్‌ అథారిటీ) కన్నెర్న చేసింది. 2017లో ఈ చట్టాన్ని తీసుకురాగా మొదటిసారి కొరడా ఝులిపించింది. దీంతో ఒక్కసారిగా బిల్డర్లంతా ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అంత మొత్తం ఎలా చెల్లించాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరికి వారి ప్రాజెక్టు విలువ ఆధారంగా అయిదు శాతం అపరాధ రుసుం విధించడంతో తక్కువలో తక్కువగా రూ.15 లక్షల నుంచి రూ.3 కోట్ల వరకు పెనాల్టీ విధించినట్లు రిటర్న్స్‌ దాఖలు చేసే నిపుణులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో 1,805 ప్రాజెక్టుల రిజిస్టర్‌ అవగా... క్రమపద్ధతిలో రిటర్న్స్‌ దాఖలు చేసిన వారు 800 మందే ఉన్నారు. మిగిలిన 1,005 మందికి సుమారు రూ.300 నుంచి రూ.400 కోట్లు వరకు పెనాల్టీ విధించి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అందులో విశాఖ నుంచి సుమారు రూ.100 కోట్ల వరకుండొచ్చని అంచాన.

చెల్లించకపోవడంతో: ప్రతి బిల్డరు ప్రాజెక్టు ప్రగతి వివరాలను మూడు నెలలకోసారి నివేదించాలి. ఆ ప్రాజెక్టు ఎంతవరకు వచ్చింది, దానికి ఎంత ఖర్చు అయింది, ఎన్ని విక్రయించారు వంటి వివరాలను ఆర్కిటెక్చర్‌, స్ట్రక్చరల్‌ ఇంజినీర్‌, చార్టడ్‌ అకౌంటెంట్‌ సంతకాలతో రిటర్న్స్‌ దాఖలు చేస్తుండాలి. లేకుంటే చట్టం ప్రకారం ఆ ప్రాజెక్టు విలువలో 5 శాతం జరిమానా విధించొచ్ఛు ఈ నిబంధన ప్రకారం జులై, ఆగస్టు, సెప్టెంబరు త్రైమాసికానికి రిటర్న్స్‌ దాఖలు చేయని వారికి అపరాధ రుసుం విధించింది. ప్రస్తుతం అక్టోబరు, నవంబరు, డిసెంబరు త్రైమాసిక రిటర్న్స్‌ తీసుకుంటోంది. గత విడత రిటర్న్స్‌ దాఖలు చేసిన వారికే ప్రస్తుతం స్వీకరిస్తోంది. దీంతో చాలామంది చేసేందుకు ప్రయత్నిస్తున్నా వెబ్‌సైట్లో ముందు త్రైమాసికానివి దాఖలు చేయకపోవడంతో తిరస్కరిస్తోంది. అంతేకాకుండా ఎంత జరిమానా విధించారో చూపిస్తోంది.

గడువు పొడిగించాలని: అధిక సంఖ్యలో బిల్డర్లకు ఇబ్బంది కలిగించేలా, నిర్మాణరంగం అంత బాగోలేని పరిస్థితుల్లో జరిమానా విధించడం ఏమిటంటూ పలువురు మథనపడుతున్నారు. ‘రెరా’ బాదుడు మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై క్రెడాయ్‌ విశాఖ చాప్టర్‌ ఛైర్మన్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఈ అంశంపై క్రెడాయ్‌ రాష్ట్ర ప్రతినిధులు రెరా ప్రతినిధులకు వినతి పత్రం అందజేసి రిటర్న్స్‌ దాఖలుకు కొంత గడువు ఇవ్వాలని కోరారని పేర్కొన్నారు. విక్రయాలు తక్కువుగా ఉన్న సమయంలో జరిమానాలు తమకు పెనుభారంగా మారుతాయని మళ్లీ అవకాశం ఇవ్వాలని కోరినట్లు వినతి అందజేశారని పేర్కొన్నారు.

* రెరా రిటర్న్స్‌ దాఖలు చేసే కన్సల్‌టెంట్‌ ఆర్‌కే ఆసోసియేటఫ్స్‌ నిర్వాహకులు రామకృష్ణ మాట్లాడుతూ.. చట్ట ప్రకారం ప్రతి మూడు నెలలకోసారి రిటర్న్స్‌ వేయాలి. ఇప్పటివరకు జరిమానా విధించలేదు. చట్టం వచ్చిన తరువాత ఇదే మొదటిసారి. దీంతో ఒక్కసారిగా రిటర్న్స్‌ దాఖలుకు వస్తున్నారు. ముందు త్రైమాసికానికి చేయకపోవడంతో ప్రస్తుతం చేయడానికి వీలు పడని పరిస్థితి ఏర్పడుతుందన్నారు.

ఇదిగో ఇలా

* విశాఖ-విజయనగరం సరిహద్దు ప్రాంతంలో 75 ఫ్లాట్లతో నిర్మిస్తున్న ఓ ప్రాజెక్టు యజమానికి రూ.85 లక్షలు చెల్లించాలని జరిమానా విధించింది.

* విశాఖలోని ఓ భారీ ప్రాజెక్టు యజమానికి రూ.కోటిపైనా చెల్లించాలని పేర్కొంది.

* గాజువాక ప్రాంతంలో ఓ నిర్మాణదారుడికి రూ.90 లక్షలు కట్టాలని వెబ్‌సైట్‌ చూపించింది.

* విశాఖ నగరంలో ఓ నిర్మాణదారుడికి రూ.65 లక్షలు, మధురవాడ, ఎండాడ ప్రాంతంలో భారీ నిర్మాణాలు చేపట్టిన ఓ యజమానికి రూ.75 లక్షలు చెల్లించాలని చూపిస్తోంది.

* విశాఖ శివారు ప్రాంతాల్లో వందల ఫ్లాట్లతో భారీ నిర్మాణాలు చేపడుతున్నారు. రిజిస్టర్‌ అయిన సంస్థలైతే అటువంటి వాటి యజమానులకు రూ.3 కోట్లు వరకు పడుండొచ్చని భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని