logo

కుర్రోడి.. ‘పవర్‌’..!

అంతర్జాతీయ పోటీల్లో దేశం తరపున ప్రాతినిధ్యం వహించాలని ప్రతి క్రీడాకారుడు కల కంటాడు. అలాంటి కలను సాకారం చేసుకోవడమే కాదు.. ఏకంగా అంతర్జాతీయ వేదికపై సత్తా చాటి పతకాలు సాధించాడు నగరంలోని బుల్లయ్య డిగ్రీ కళాశాల విద్యార్థి వై.సతీష్‌కుమార్‌. గతేడాది డిసెంబరులో టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో జరిగిన ఆసియా స్థాయి పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో మూడు స్వర్ణపతకాలతో పాటు ఒక రజత పతకం కైవసం చేసుకుని శభాష్‌ అనిపించుకుంటున్నాడు.

Published : 23 Jan 2022 05:48 IST

ఆసియాస్థాయి పోటీల్లో సతీష్‌కుమార్‌ సత్తా

3 స్వర్ణాలు, ఒక రజత పతకం కైవసం


పవర్‌లిఫ్టింగ్‌లో బరువు ఎత్తుతున్న సతీష్‌కుమార్

అంతర్జాతీయ పోటీల్లో దేశం తరపున ప్రాతినిధ్యం వహించాలని ప్రతి క్రీడాకారుడు కల కంటాడు. అలాంటి కలను సాకారం చేసుకోవడమే కాదు.. ఏకంగా అంతర్జాతీయ వేదికపై సత్తా చాటి పతకాలు సాధించాడు నగరంలోని బుల్లయ్య డిగ్రీ కళాశాల విద్యార్థి వై.సతీష్‌కుమార్‌. గతేడాది డిసెంబరులో టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో జరిగిన ఆసియా స్థాయి పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో మూడు స్వర్ణపతకాలతో పాటు ఒక రజత పతకం కైవసం చేసుకుని శభాష్‌ అనిపించుకుంటున్నాడు.

- విశాఖ క్రీడలు, న్యూస్‌టుడే

సతీష్‌కుమార్‌ది పేద కుటుంబం. తల్లిదండ్రులు ఆంజనేయులు, సావిత్రి. వెదురు బుట్టలు అల్లుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సొంత జిల్లా శ్రీకాకుళం. డిగ్రీ చదవడానికి సతీష్‌కుమార్‌ విశాఖ వచ్చాడు. ప్రస్తుతం పూర్ణమార్కెట్‌ వద్ద ఉంటూ బుల్లయ్య డిగ్రీ కళాశాలలో బీఏ చివరి ఏడాది చదువుతున్నాడు. ఇక్కడ డిగ్రీలో చేరిన తర్వాత అతని బలిష్టమైన శరీరాన్ని చూసి వ్యాయామ విభాగాధిపతి డాక్టర్‌ వై.శ్రీనివాసరావు పవర్‌లిఫ్టింగ్‌ సాధన చేయమని సూచించారు. అలా రెండేళ్ల క్రితం సాధన మొదలెట్టాడు. పాతనగరంలోని ఓ వ్యాయామశాలకు వెళ్లి కఠోర శిక్షణ ప్రారంభించాడు. అక్కడ అంతర్జాతీయ కోచ్‌ ఎస్‌.కోటేశ్వరరావు వద్ద మెలకువలు నేర్చుకున్నాడు. రాష్ట్ర, జాతీయ పోటీల్లో ప్రతిభ చూపడటంతో ఆసియాస్థా.యి పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలకు ఎంపికయ్యాడు. అక్కడ పతకాలు సాధించి విశాఖ ఖ్యాతిని ఇనుమడింపజేశాడు.

మూడు స్వర్ణాలు, ఒక రజతం గెలుపొంది జాతీయపతాకాన్ని పైకెత్తి చూపుతూ..

నిత్య సాధన... పౌష్ఠికాహారం

పవర్‌లిఫ్టింగ్‌ అంటేనే కిలోల కొద్దీ బరువునెత్తాలి. ఇందుకు నిత్యం సాధన చేస్తుండాలి. దానికి తగ్గ బలిష్టమైన శరీర సౌష్టం పొందాలి. నిత్యం పౌష్టికాహారం తీసుకోవాలి. సతీష్‌కుమార్‌ రోజు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు పవర్‌లిఫ్టింగ్‌ సాధన చేస్తుంటాడు. వారంలో నాలుగు రోజులు మాంసాహారం తీసుకుంటాడు. నిత్యం పండ్లు, పాలు తీసుకుంటూ శరీర సౌష్టవం కాపాడుకుంటున్నాడు.

59కిలోల విభాగంతో సత్తా...

గతేడాది డిసెంబరులో టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌ జరిగిన ఆసియా స్థాయి పవర్‌లిఫ్టింగ్‌ పోటీల్లో సతీష్‌కుమార్‌ అదరగొట్టాడు. అక్కడ 59 కిలోల విభాగంలో పాల్గొన్నాడు. స్క్వాడ్‌ విభాగంలో 197.5 కిలోల బరువు ఎత్తి స్వర్ణం, బెంచ్‌ ప్రెస్‌ విభాగంలో 130 కిలోల బరువు ఎత్తి స్వర్ణం, డెడ్‌లిఫ్ట్‌ విభాగంలో 200 కిలోల బరువు ఎత్తి రజత పతకం గెలుపొందాడు. ఆయా విభాగాల్లో అత్యధికంగా 527.5 కిలోల బరువు ఎత్తడంతో ఓవరాల్‌ విభాగంలో మరో స్వర్ణ పతకం కైవసం చేసుకున్నాడు. అంతకు ముందు పలు జాతీయ, రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చూపి పతకాలు సాధించాడు.

కామన్‌వెల్త్‌ పోటీల్లో స్వర్ణమే లక్ష్యంగా..

భవిష్యత్‌లో కామన్‌వెల్త్‌ పోటీల్లో పాల్గొని స్వర్ణ పతకం గెలవాలన్నదే తన లక్ష్యమని సతీష్‌కుమార్‌ చెబుతున్నాడు. తల్లిదండ్రులు పేదవారు కావడంతో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నా. తనకు ప్రభుత్వం, స్పాన్సర్లు ప్రోత్సాహం అందిస్తే లక్ష్యం చేరుకుని, దేశానికి కీర్తి ప్రతిష్ఠలు తెస్తానని పేర్కొంటున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని