logo

గాజువాకలో యువకుడి దారుణ హత్య

నడిరోడ్డుపై వెళ్తున్న ఓ యువకుడిని ముగ్గురు వ్యక్తులు చుట్టుముట్టి కళ్లల్లో కారం చల్లి... ఒక్కసారిగా ఇనుపరాడ్లు, కత్తితో మూకుమ్మడిగా దాడి చేయడంతో అక్కడకికక్కడే మృతి చెందాడు. ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో 76వ వార్డు గోపాలరెడ్డినగర్‌లో

Updated : 24 Jan 2022 02:15 IST

రూ. 80 వేల బాకీ తీర్చలేదని మూకుమ్మడి దాడి 

అదుపులో ముగ్గురు నిందితులు

ప్రసాద్‌ (దాచిన చిత్రం)

గాజువాక, న్యూస్‌టుడే: నడిరోడ్డుపై వెళ్తున్న ఓ యువకుడిని ముగ్గురు వ్యక్తులు చుట్టుముట్టి కళ్లల్లో కారం చల్లి... ఇనుపరాడ్లు, కత్తితో మూకుమ్మడిగా దాడి చేయడంతో ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

* ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో 76వ వార్డు గోపాలరెడ్డినగర్‌లో జరిగిన ఘటనపై సీఐ మల్లేశ్వరరావు, బాధిత కుటుంబీకుల వివరాల మేరకు... గోపాలరెడ్డినగర్‌కు చెందిన చాత్రబోయిన ప్రసాద్‌(32) వెల్డింగ్‌ పనులు చేస్తుంటాడు. కొన్నాళ్ల కిందట విదేశాల్లో పనులు ముగించుకుని వచ్చాడు. మళ్లీ తిరిగి వెళ్లడానికి వీసా సిద్ధం చేసుకున్నాడు. అదే కాలనీకి చెందిన దగ్గర బంధువులైన శ్రీను, చిన్నా, పోతురాజుకు ప్రసాద్‌ రూ.80 వేలు బాకీ పడ్డాడు. అప్పు విషయంలో ఇటీవలే వారు గొడవ పడడంతో... ఆ వ్యవహారం గాజువాక పోలీస్‌స్టేషన్‌ వరకు వెళ్లింది.  ఈ ఏడాది మార్చిలో బాకీ డబ్బులు ఇచ్చేస్తానని ప్రసాద్‌తో అంగీకారపత్రం రాయించుకున్నారు. అయితే డబ్బులు అడిగినప్పుడల్లా ప్రసాద్‌ నిర్లక్ష్యంగా మాట్లాడుతూ, దౌర్జన్యం చేస్తున్నాడని శ్రీను, చిన్నా, పోతురాజు కక్ష పెంచుకున్నారు. దీంతో పథక రచన చేసి అంతమొందించడానికి నిర్ణయించారు. రాత్రి ఇంటి నుంచి బయటకు రాగానే ముగ్గురూ కలిసి దాడి చేయడంతో ప్రసాద్‌ అక్కడికక్కడే రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు. ఇంటికి 200 మీటర్ల దూరంలో ఘటన జరగడంతో ప్రసాద్‌ తండ్రి చిల్కుబాబు హుటాహుటిన వెళ్లి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు.

* సౌత్‌ ఏసీపీ రాజ్‌కమల్‌, సీఐ మల్లేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వచ్చే ఏడాది వివాహం చేద్దామనుకున్నామని, బాకీ తీర్చుతామని స్టేషన్లో అంగీకరించినా కిరాతకంగా తన కుమారుడిని పొట్టన పెట్టుకున్నారని చిల్కుబాబు ఆవేదన వ్యక్తం చేశారు. క్లూస్‌ సిబ్బంది ఘటనా స్థలంలో కారం, కత్తి, ఇనుపరాడ్డును స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. సీఐ మల్లేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని