logo

భరిస్తారా.. విభేదిస్తారా?

విద్యుత్తు బిల్లుల కేటగిరీల్లో మార్పుచేర్పులు, వాటితో పడే భారంపై వినియోగదారుల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్తు నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) సిద్ధమైంది. విద్యుత్తు పంపిణీ సంస్థలు రానున్న ఆర్థిక సంవత్సరానికి

Published : 24 Jan 2022 01:38 IST

విద్యుత్తు ఛార్జీలపై నేటి నుంచి ప్రజాభిప్రాయ సేకరణ
ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం 

ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాట్లలో ఈపీడీసీఎల్‌ అధికారులు

విద్యుత్తు బిల్లుల కేటగిరీల్లో మార్పుచేర్పులు, వాటితో పడే భారంపై వినియోగదారుల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్తు నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) సిద్ధమైంది. విద్యుత్తు పంపిణీ సంస్థలు రానున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక ఆదాయ అవసర నివేదికల (ఏఆర్‌ఆర్‌) ఇదివరకే ఏపీఈఆర్‌సీకి అందజేశాయి. వాటిపై సోమవారం నుంచి మూడు రోజుల పాటు స్థానిక ఈపీడీసీఎల్‌ కార్పొరేట్‌ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించబోతున్నారు. ఇప్పటికే మూడు డిస్కంల పరిధిలో పలువురు తమ అభ్యంతరాలను ఆన్‌లైన్‌ ద్వారా వ్యక్తం చేయడానికి వివరాలను నమోదు చేసుకున్నారు. కేటగిరీల మార్పుల కారణంగా సామాన్యుల గృహ విద్యుత్తు వినియోగదారులపైనే ఎక్కువ భారం పడనుందని, దీనిపై పునరాలోచన చేయాలని వీరు కోరుతున్నారు.
ఏపీఈఆర్‌సీ ఛైర్మన్‌ జస్టిస్‌ సి.వి.నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నారు. మూడు డిస్కంలు, ఏపీ ట్రాన్స్‌కో, ఇంధనశాఖకు చెందిన అధికారులు ఆదివారమే విశాఖకు చేరుకున్నారు. అభ్యంతరదారులు తమ సమీప డివిజన్‌, సర్కిల్‌ కార్యాలయాల నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొంటారు. ముందుగా నమోదు చేసుకున్న వారికి మాట్లాడడానికి అవకాశం కల్పించిన తరవాత కొత్తవారు అభ్యంతరాలు చెప్పడానికి వీలు కల్పించనున్నారు. ఆ సమయంలోనే విద్యుత్తు సంస్థలు మోపే భారాన్ని ఎక్కువ మంది విభేదిస్తే ప్రభుత్వం, ఏపీఈఆర్‌సీ పునరాలోచన చేయడానికి వీలుంటుందని వినియోగదారుల సంఘాల నేతలు అంటున్నారు.

జిల్లాపై 166.86 కోట్ల భారం
ఈపీడీసీఎల్‌ ప్రతిపాదనలకుగానీ సర్కారు ఆమోదం లభించి రాయితీలు పెంచకుంటే వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి విద్యుత్తు బిల్లులు భారీగానే రానున్నాయి. ఇప్పటి వరకు 50 యూనిట్ల వరకు రూ. 1.45 చొప్పున, ఆపై 51 నుంచి 75 యూనిట్లలోపు వారికి రూ. 2.60 చొప్పున బిల్లింగ్‌ చేస్తున్నారు. ఆగస్టు నుంచి ఈ శ్లాబ్‌ను 0-30, 31-75 శ్లాబ్‌లుగా విడదీశారు. ఇకపై 30 యూనిట్లు దాటిన సామాన్య వినియోగదారులపైనా బిల్లు భారం పడనుంది. వీటి ప్రకారం జిల్లాలో నెలకు అన్నిరకాల గృహవిద్యుత్తు వినియోగదారులపై సుమారు రూ. 18.54 కోట్ల భారం పడబోతోంది. ఆగస్టు నుంచి లెక్కిస్తే తొమ్మిది నెలల్లో రూ. 166.86 కోట్లు అదనంగా విద్యుత్తు భారం మోయాల్సి ఉంటుంది. జిల్లాలో గ్రామీణ ప్రాంతంలో ఎక్కువగా 100 నుంచి 150 యూనిట్ల మధ్యలో విద్యుత్తు వినియోగిస్తుంటారు. అదే జీవీఎంసీ పరిధిలో 200 నుంచి 350 యూనిట్ల వినియోగించేవారు ఎక్కువ మంది ఉన్నారు. వీరందరిపైనా నెలకు రూ. 32 నుంచి రూ. 280 వరకు అదనంగా విద్యుత్తు ఛార్జీల భారం పడనున్నట్లు సంబంధిత అధికారులు అంచనా వేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని