logo

నగరంలో మాదకద్రవ్యాల కలకలం

విశాఖ నగరంలో మాదకద్రవ్యాల వినియోగం మరోసారి కలకలం రేపింది. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుని, వాటిని నగరంలోని కొందరు యువతకు విక్రయిస్తున్నట్లు పోలీసులు తమ దర్యాప్తులో తేల్చారు. ఇద్దరు యువకులను టాస్క్‌ఫోర్స్‌, ఎంవీపీకాలనీ పోలీసులు అరెస్టు చేసి ఎల్‌ఎస్‌డీ బోల్ట్స్‌

Published : 25 Jan 2022 04:50 IST

యువతే లక్ష్యంగా విక్రయాలు
ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు


వివరాలను వెల్లడిస్తున్న సి.ఐ. రమణయ్య, ఎస్‌.ఐ. భాస్కర్‌

ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే : విశాఖ నగరంలో మాదకద్రవ్యాల వినియోగం మరోసారి కలకలం రేపింది. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుని, వాటిని నగరంలోని కొందరు యువతకు విక్రయిస్తున్నట్లు పోలీసులు తమ దర్యాప్తులో తేల్చారు. ఇద్దరు యువకులను టాస్క్‌ఫోర్స్‌, ఎంవీపీకాలనీ పోలీసులు అరెస్టు చేసి ఎల్‌ఎస్‌డీ బోల్ట్స్‌ 19 1/2, ఎం.డి.ఎం.ఎ. పిల్స్‌ 3, ఓసీబీ షీట్స్‌ 7, గంజాయి 20 గ్రాముల మేర స్వాధీనం చేసుకున్నారు. ఎంవీపీ పోలీసుస్టేషన్‌ సి.ఐ. రమణయ్య, ఎస్‌.ఐ. భాస్కర్‌లు వివరాలు వెల్లడించారు.

తెలంగాణ నుంచి విశాఖకు కొరియర్‌: ఈ నెల 23న మధ్యాహ్నం ఒక వ్యక్తి మాదకద్రవ్యాలను కలిగి ఉన్నట్లు నగర పోలీసు కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హా, డీసీపీ గౌతమి శాలి, టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ త్రినాథరావు తదితరులకు వచ్చిన సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సీతమ్మధారకు చెందిన కె.రాహుల్‌(22) అనే యువకుడు మాదకద్రవ్యాలు విక్రయిస్తున్నట్లు గుర్తించిన టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ త్రినాథరావు, ఎస్‌.ఐ. వాసునాయుడు, ఎంవీపీ సి.ఐ. రమణయ్య, ఎస్‌.ఐ. భాస్కర్‌, ఇతర పోలీసులు నిఘా ఉంచారు. విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న రాహుల్‌ను ఈ నెల 23న సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. ఇతని వద్ద 20గ్రాముల గంజాయి, 11 1/2 ఎల్‌ఎస్‌డీ బోల్ట్స్‌, ఓసీబీ షీట్స్‌ 7 చొప్పున స్వాధీనం చేసుకున్నారు. ఇతడి విచారణలో పెదగంట్యాడకు చెందిన ఆర్‌.అఖిల్‌ అనే యువకుడి వివరాలను తెలుసుకుని అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఎల్‌ఎస్‌డీ బోల్ట్స్‌, ఎం.డి.ఎం.ఎ పిల్స్‌ , చిన్న తూనిక యంత్రం, రూ.2వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.

* రాహుల్‌, అఖిల్‌లు ఇద్దరూ చెన్నైలో ఇంజినీరింగ్‌ చదివిన సమయంలో ఒకే గదిలో ఉండేవారు. ఈ స్నేహితులు ఇద్దరు అప్పుడే మాదకద్రవ్యాలకు బాగా అలవాటు పడ్డారు. రెండేళ్ల క్రితమే వీరి చదువు పూర్తైంది. తర్వాత విశాఖకు చేరుకున్నా, వీటిని వినియోగిస్తూనే ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. చెన్నైలోని పరిచయస్తుల ద్వారా తెలంగాణ నుంచి కొరియర్‌లో విశాఖకు దిగుమతి చేస్తున్నారు. ప్రస్తుతం అఖిల్‌ ఆన్‌లైన్‌లో ఉన్నత చదువులు చదువుతుండగా రాహుల్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

* సింథటిక్స్‌ డ్రగ్స్‌ కావటంతో కొరియర్‌ ద్వారా సులువుగా దిగుమతి చేసుకుంటున్నారు. ఒక్కో ఎల్‌ఎస్‌డీలను రూ.2 వేలకు విక్రయిస్తున్నారు. పరిచయం ఉన్న యువత, స్నేహితులకు మాత్రమే వీటిని రహస్యంగా అమ్ముతున్నారు. ప్రధానంగా గోవా, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాల్లో ఉన్నత విద్యను పూర్తి చేసిన వారిలో చాలా మంది వీటికి బానిస అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని