logo

ఈఆర్సీ విధులంటే కత్తిమీద సామే..!

ఓ వైపు వినియోగదారుల ప్రయోజనాలను కాపాడుతూ.. మరోవైపు వారికి నాణ్యమైన విద్యుత్తు సేవలందించే పంపిణీ సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేయడం విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి కత్తిమీద సాములాంటిదేనని

Published : 25 Jan 2022 04:50 IST

విద్యుత్తు నియంత్రణ మండలి ఛైర్మన్‌ జస్టిస్‌ సీవీ నాగార్జునరెడ్డి

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: ఓ వైపు వినియోగదారుల ప్రయోజనాలను కాపాడుతూ.. మరోవైపు వారికి నాణ్యమైన విద్యుత్తు సేవలందించే పంపిణీ సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేయడం విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి కత్తిమీద సాములాంటిదేనని ఆ సంస్థ ఛైర్మన్‌ జస్టిస్‌ సీవీ నాగార్జునరెడ్డి అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడక్కడా విమర్శలు రావడం సహజమేనని వాటిని సహృదయంతో స్వీకరించాల్సిన అవసరం ఉందన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డిస్కంలు ప్రతిపాదించిన విద్యుత్తు టారిఫ్‌పై సోమవారం విశాఖలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ఆయన మాట్లాడారు. డిస్కంలు రూ.12 వేల కోట్లు అదనంగా వసూలు చేయాల్సి ఉంటుందని, అందులో రూ.10 వేల కోట్లకు పైగా ప్రభుత్వమే రాయితీ కింద భరిస్తుందనే సమాచారం ఉందన్నారు. వినియోగదారుల నుంచి రూ.850 కోట్లు వసూలు చేయడానికి ఏపీఈఆర్సీ అనుమతి అడిగినట్లు తెలిపారు. దీనిపై వచ్చిన అభ్యంతరాలన్నీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ట్రూఆప్‌ ఛార్జీలనేది చట్టప్రకారం చేపట్టాల్సిన ప్రక్రియని, 2019-20లో రూ 2,500 కోట్లు వెనక్కిఇచ్చినట్లు గుర్తుచేశారు. మిగతా ట్రూఆప్‌ ఛార్జీలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈ ఏడాది స్థానిక సంస్థల నుంచి రూ.వెయ్యి కోట్లు వసూలు చేశామని, ప్రభుత్వ సంస్థలన్నింటి నుంచి బకాయిలు వసూలు చేస్తామన్నారు. ప్రజాభిప్రాయసేకరణలో సూచనలను తప్పనిసరిగా పరిశీలించి విద్యుత్తు పంపిణీ సంస్థలు, వినియోగదారులకు నష్టం కలగని రీతిలో మా పరిధిలో సరైన నిర్ణయం తీసుకుంటామని అన్నారు. కార్యక్రమంలో ఈఆర్సీ సభ్యులు రాజగోపాల్‌రెడ్డి, ఠాకూర్‌ రామ్‌సింగ్‌, ఈపీడీసీఎల్‌, ఎస్పీడీసీల్‌, సీపీడీసీఎల్‌ సీఎండీలు కె.సంతోషరావు, హరనాథరావు, పద్మజనార్దనరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని