logo

సంక్షిప్త వార్తలు

నిరీక్షణ జాబితా(వెయిటింగ్‌ లిస్ట్‌) ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని పలు రైళ్లకు అదనపు బోగీలు జత చేస్తున్నట్లు వాల్తేర్‌ సీనియర్‌ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. ఈ నెల 26 నుంచి 28 వరకు భువనేశ్వర్‌-కేఎస్‌ఆర్‌ బెంగళూర్‌(18463),

Published : 25 Jan 2022 04:50 IST

పలు రైళ్లకు అదనపు బోగీలు

రైల్వేస్టేషన్‌, న్యూస్‌టుడే: నిరీక్షణ జాబితా(వెయిటింగ్‌ లిస్ట్‌) ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని పలు రైళ్లకు అదనపు బోగీలు జత చేస్తున్నట్లు వాల్తేర్‌ సీనియర్‌ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. ఈ నెల 26 నుంచి 28 వరకు భువనేశ్వర్‌-కేఎస్‌ఆర్‌ బెంగళూర్‌(18463), 27 నుంచి 29 వరకు కేఎస్‌ఆర్‌ బెంగళూర్‌- భువనేశ్వర్‌(18464) ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు రెండు స్లీపర్‌ బోగీలు.. ్త ఈ నెల 25న భువనేశ్వర్‌-పుదుచ్చేరి(12898), 26న పుదుచ్చేరి-భువనేశ్వర్‌(12897) రైళ్లకు ఒక స్లీపర్‌ బోగీ.., ఈ నెల 27న భువనేశ్వర్‌-ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌(12830), 28న ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌-భువనేశ్వర్‌(12829) రైళ్లకు ఒక స్లీపర్‌ క్లాస్‌ బోగీ..,  25న విశాఖ-భువనేశ్వర్‌ (22820), 26న భువనేశ్వర్‌-విశాఖ(22819) ఇంటర్‌ సిటీ రైళ్లకు ఒక ఛైర్‌కార్‌ బోగీ, 27న విశాఖ-కొల్లాం(18567), 28న కొల్లాం-విశాఖ(18568) రైళ్లకు ఒక స్లీపర్‌ క్లాస్‌ బోగీని అదనంగా జత చేయనున్నట్లు వెల్లడించారు.


నేడు పీఆర్సీ సాధన సమితి ర్యాలీ

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: పీఆర్సీ జీఓలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ పీఆర్సీ సాధన సమితి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నగరంలో మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. కలెక్టరేట్‌ ఆవరణలోని ఎన్జీఓ హోమ్‌ నుంచి కేజీహెచ్‌ ఓపీ గేటు, జగదాంబకూడలి, సూపర్‌బజార్‌, పోలీసు బ్యారెక్సు, జగదాంబకూడలి మీదుగా మళ్లీ కలెక్టరేట్‌ వరకు ర్యాలీ కొనసాగనున్నది. పీఆర్సీ సాధన సమితి రాష్ట్ర కమిటీ పిలుపును అనుసరించి మంగళవారం నుంచి ఉద్యమ కార్యాచరణ ప్రారంభం కానున్నది. ఈ మేరకు భారీ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలని భావిస్తున్నారు. ప్రదర్శనలో అన్ని శాఖలకు చెందిన ఉద్యోగులు, కార్మికులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని జేఏసీ ఛైర్మన్‌ కె.ఈశ్వరరావు తెలిపారు.


ఎమ్మెల్యే అమర్‌నాథ్‌కి కరోనా నిర్దరణ

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌కి కరోనా సోకినట్లు ఆయన కార్యాలయ సిబ్బంది ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలకు ఏదైనా అవసరం ఉంటే నేరుగా కాకుండా అనకాపల్లిలోని కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.


అప్పన్న దేవస్థానంలో విజిలెన్స్‌ విచారణ

సింహాచలం, న్యూస్‌టుడే: సింహాచలం దేవస్థానంలో గతంలో చోటు చేసుకున్న పలు అక్రమాలు, భూముల వ్యవహారానికి సంబంధించిన అంశాలపై విజిలెన్స్‌ అధికారులు సోమవారం విచారణ చేపట్టారు. విజిలెన్స్‌ డీఎస్‌పీ అన్నెపు నరసింహమూర్తి ఆధ్వర్యంలో అధికారులు దేవస్థానం కార్యాలయంలో దస్త్రాలను పరిశీలించారు. ఇటీవల దేవస్థానానికి చెందిన సుమారు 800 ఎకరాల భూముల్లో అవకతవకలు జరిగాయన్న విషయంపై ప్రభుత్వం విజిలెన్స్‌ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. అలాగే దేవస్థానంలో అక్రమ పదోన్నతులు, మట్టి తవ్వకాలు, అక్రమ గ్రావెల్‌ తరలింపు, దేవస్థానం భూముల్లో అనుమతి లేని నిర్మాణాలు వంటి అంశాలపై విచారణ జరుగుతోంది. ఆయా అంశాలకు సంబంధించిన అదనపు సమాచారాన్ని సేకరించేందుకు వచ్చినట్లు డీఎస్‌పీ నరసింహమూర్తి తెలిపారు.


బాలిక కడుపులో వెంట్రుకల కట్ట

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: కడుపు నొప్పితో బాధపడుతున్న బాలిక(11)కి సెవెన్‌హిల్స్‌ వైద్యులు శస్త్రచికిత్స చేసి నయం చేశారు. ఓ బాలిక గత ఆరు నెలలుగా పొత్తి కడుపులో నొప్పితో బాధపడుతోంది. సెవెన్‌హిల్స్‌ ఆసుపత్రి వైద్యులు పరీక్షలు నిర్వహించి చికిత్స చేసి కడుపులో ఉన్న వెంట్రుకల కట్టను తొలగించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి బాగుందన్నారు.


జువైనల్‌ హోంకు బాలుడు

చోడవరం పట్టణం, న్యూస్‌టుడే: చోడవరంలో ఇద్దరు చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడిన బాలుడిని పోలీసుల విచారణ అనంతరం సోమవారం విశాఖలోని జువైనల్‌ హోంకు తరలించారు. ఈ నెల 17న చిన్నారులు తమ ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా.. 14 ఏళ్ల బాలుడు తన ఇంటికి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. విచారణ అనంతరం అతడిలో సత్ప్రవర్తన కలిగేలా బాలల ప్రత్యేక హోంకు తరలించినట్లు ఎస్సై విభీషణరావు తెలిపారు.


బవులువాడ క్వారీలో తనిఖీలు

అనకాపల్లి పట్టణం: గనులశాఖ విజిలెన్స్‌ ఏడీ ప్రతాప్‌రెడ్డిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో బవులువాడలోని క్వారీని గనులశాఖ అధికారులు సోమవారం పరిశీలించారు. సర్వే నంబరు 72లోని క్వారీని పరిశీలించినట్లు అనకాపల్లి గనులశాఖ ఏడీ విఘ్నేశ్వరుడు తెలిపారు. కాకినాడ గనులశాఖ డీడీ నరసింహారెడ్డి, ఏలూరు సర్వేయర్‌ చల్లాలు, అసిస్టెంట్‌ జియాలజిస్టు వెంకటరత్నం తవ్వకాలు, ఇతర వివరాలను సేకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు