logo

వీర్‌, అమేయ ప్రతిభా సంపన్నులు

బాలబాలికలు చిన్నతనం నుంచే అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జున ఆకాక్షించారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీ తరపున కలెక్టర్‌ అమేయ, వీర్‌కాశ్యప్‌లకు రాష్ట్రీయ బాల పురస్కారాలను అందజేశారు.

Published : 25 Jan 2022 05:35 IST

రాష్ట్రీయ బాల పురస్కార్‌ల ప్రదానం

అమేయకు రాష్ట్రీయ బాల పురస్కార్‌ అందజేస్తున్న కలెక్టర్‌ ఎ.మల్లికార్జున

విశాఖపట్నం, న్యూస్‌టుడే: బాలబాలికలు చిన్నతనం నుంచే అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జున ఆకాక్షించారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీ తరపున కలెక్టర్‌ అమేయ, వీర్‌కాశ్యప్‌లకు రాష్ట్రీయ బాల పురస్కారాలను అందజేశారు. వీసీ ద్వారా పురస్కార గ్రహీతలతో సోమవారం దిల్లీ నుంచి ప్రధాని మోదీ మాట్లాడి వారి ప్రతిభను ప్రశంసించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ 2021లో దేశం మొత్తంగా 32 మందిని అవార్డుకు ఎంపిక చేయగా, వారిలో ఏపీ నుంచి అమేయ, కేరళ నుంచి వీర్‌ కాశ్యప్‌ ఉన్నారని చెప్పారు. వీరిని బాలబాలికలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రతి ఏడాది ఆగస్టులో దరఖాస్తులు స్వీకరిస్తారని, వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన బాలబాలికలు దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు.

* 13ఏళ్ల అమేయ ఎంవీపీ కాలనీలోని సత్యసాయి విద్యా విహార్‌లో 9వ తరగతి చదువుతోంది. ఆమెతో ప్రధానమంత్రి సంభాషించారు. ప్రధాని అడిగిన ప్రశ్నకు అమేయ బదులిస్తూ భారతీయ నృత్య రీతులను కొత్త శిఖరాలకు తీసుకెళతానని, మన కళలు, సంస్కృతిని ప్రపంచ నలుమూలలా చాటిచెప్పేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

* నేవీ చిల్డ్రన్‌ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న వీర్‌కాశ్యప్‌ ఇటీవల కేరళ నుంచి ఇక్కడికి వచ్చారు. కరోనాపై అవగాహన కల్పించేందుకు ‘బోర్డు గేమ్‌ కరోనా యుగ’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. అతన్ని కూడా ప్రధాని అభినందించారు. అనంతరం తాను రూపొందించిన పుస్తకాన్ని కుటుంబ సభ్యులతో కలిసి వీర్‌కాశ్యప్‌ కలెక్టర్‌కు అందజేశారు.

* జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పాల్గొన్నారు. కొవిడ్‌ కారణంగా రాష్ట్రీయ బాల పురస్కార్‌ అవార్డులను దిల్లీలో నిర్వహించలేదు. తొలిసారి డిజిటల్‌ బ్లాక్‌చైన్‌ టెక్నాలజీని ఉపయోగించి ప్రధానమంత్రి అవార్డులను అందించారు. కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌తో పాటు అవార్డు గ్రహీతలు, స్త్రీశిశు అభివృద్ధి సంస్థ పథక సంచాలకులు ఎం.సీతామహలక్ష్మి, జిల్లాల బాలల సంక్షేమశాఖ అధికారి ఎ.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని