logo

ఇప్పుడొచ్చాయి ఇంటర్‌ పుస్తకాలు!

మరో రెండు నెలల్లో విద్యాసంవత్సరం ముగింపుకొస్తుంది. కొవిడ్‌ కేసుల ఉదృతి ఇలానే కొనసాగితే అప్పటి వరకు కళాశాలలు కొనసాగే అవకాశం లేదు. అయినా ఇప్పటి వరకు ఇంటర్‌ విద్యార్థులకు  పాఠ్యపుస్తకాలు అందజేయలేకపోయారు.

Published : 25 Jan 2022 05:41 IST

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: మరో రెండు నెలల్లో విద్యాసంవత్సరం ముగింపుకొస్తుంది. కొవిడ్‌ కేసుల ఉదృతి ఇలానే కొనసాగితే అప్పటి వరకు కళాశాలలు కొనసాగే అవకాశం లేదు. అయినా ఇప్పటి వరకు ఇంటర్‌ విద్యార్థులకు  పాఠ్యపుస్తకాలు అందజేయలేకపోయారు. జిల్లాలో ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న ఇంటర్‌ విద్యార్థులు సుమారు 17 వేల మంది ఉంటారు. ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశాలే సెప్టెంబర్‌ నెలాఖరు వరకు జరిగాయి. ఆపై బోధన మొదలుపెట్టినా ఒక్క విద్యార్థికి పాఠ్యపుస్తకం అందలేదు. గతేడాది మిగిలిన పుస్తకాలు, తరగతి విడిచి వెళ్లినవారి దగ్గర నుంచి తీసుకున్న పుస్తకాలతో ఇన్నాళ్లు సర్దుబాటు చేసుకొచ్చారు. వాస్తవానికి ఆగస్టు నాటికే పుస్తకాలు కళాశాలలకు చేరాలి. ఈ ఏడాది సంక్రాంతి సెలవుల సమయంలో వీటిని పంపించారు. కస్తూర్బా విద్యార్థినులకు సంబంధించిన పుస్తకాలను సమగ్ర శిక్షా కార్యాలయాలకు పంపించారు. గత రెండు రోజులుగా వీటిని కేజీబీవీలకు చేరవేస్తున్నారు. విద్యార్థులందరికీ సరిపడా పాఠ్యపుస్తకాలు వచ్చినట్లు జీసీడీవో రాజేశ్వరి తెలిపారు.

బోధించేవారు కరవే..

జిల్లాలోని 34 కస్తూర్బా పాఠశాలల్లో ఇంటర్‌ తరగతులు బోధిస్తున్నారు. వాటిలో సగం పాఠశాలలకు ఇంటర్‌ బోధించే అధ్యాపకులే లేరు. పైగా పాఠ్యపుస్తకాల కొరతతో అరకొర చదువులతోనే నెట్టుకొచ్చేస్తున్నారు. గతేడాది అతిథి అధ్యాపకులను నియమించుకున్నారు. ఈఏడాది కాంట్రాక్ట్‌ పద్ధతిలో 112 పీజీటీ పోస్టుల భర్తీకి ఇటీవల దరఖాస్తులు స్వీకరించారు. సీనియార్టీ జాబితాలను సిద్ధం చేశారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాలేదని ఎదురుచూస్తున్నారు. దీంతో ఆయా పాఠశాలల్లో పదోతరగతి విద్యార్థులకు బోధించే సీఆర్టీలతో మమ అనిపిస్తున్నారు. పోని అందరికీ సరిపడా సీఆర్టీలు ఉన్నారా అంటే అదీలేదు. 40 పోస్టులు ఖాళీలున్నాయి. ఉన్న అరకొర సిబ్బందితో, పాఠ్యపుస్తకాల్లేకుండానే ఇంటర్‌ తరగతులు బోధించేస్తున్నారు. కరోనా కారణంగా అందరూ ఉత్తీర్ణలైపోతున్నారు కానీ పరీక్షలు పెట్టుంటే ఎంతమంది గట్టెక్కేవారో తెలీని పరిస్థితి ఉందని సంబంధిత అధికారులే చర్చించుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని