logo

మానవీయ సేవకు.. అత్యున్నత పురస్కారం!

పోలియో బాధితులు ఎక్కడ ఉంటే ఆయన అక్కడ ఉంటారు. వారు కనిపిస్తే చాలు వారితో మమేకమవుతారు. బాగోగులు ఆరా తీస్తారు. అవసరమైన వారికి చికిత్స చేస్తారు. వారి వైకల్యం తగ్గి నడిచేలా చేస్తారు. బాధితులకు అవసరమైన కృత్రిమ కాళ్లు,

Published : 26 Jan 2022 04:10 IST

ప్రముఖ వైద్యులు డాక్టర్‌ ఎస్‌వీ ఆదినారాయణరావుకు పద్మశ్రీ
న్యూస్‌టుడే, విశాఖపట్నం(వన్‌టౌన్‌)

గీతం విశ్వ విద్యాలయం నుంచి డాక్టరేట్‌ అందుకుంటూ..

పోలియో బాధితులు ఎక్కడ ఉంటే ఆయన అక్కడ ఉంటారు. వారు కనిపిస్తే చాలు వారితో మమేకమవుతారు. బాగోగులు ఆరా తీస్తారు. అవసరమైన వారికి చికిత్స చేస్తారు. వారి వైకల్యం తగ్గి నడిచేలా చేస్తారు. బాధితులకు అవసరమైన కృత్రిమ కాళ్లు, మూడు చక్రాల సైకిళ్లు... ఇలా ఒకటేమిటి ఏదోరకంగా సహాయ అందిస్తారు.

త నాలుగు దశాబ్దాలుగా అలుపెరగకుండా  వైద్య రంగంలో సేవ చేస్తున్న  ప్రముఖ ఎముకుల వైద్య నిపుణులు డాక్టర్‌ సుంకర వెంకట ఆదినారాయణరావు కృషికి అత్యున్నత గుర్తింపు దక్కింది. కేంద్ర  ప్రభుత్వం మంగళవారం పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది. గుజరాత్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో ఎన్నో వైద్య శిబిరాలు నిర్వహించారు. పోలియో బాధితుల కోసం ఫ్రీపోలియో సర్జికల్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ను స్థాపించి దశాబ్దాలుగా వారి సేవలో తరిస్తున్న డాక్టర్‌ ఆదినారాయణరావు సేవలకు గుర్తింపు దక్కింది.

భార్య డాక్టర్‌ శశిప్రభతో డాక్టర్‌ ఆదినారాయణరావు

* ఇదీ కుటుంబం: 1939 జూన్‌ 30న పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జన్మించిన డాక్టర్‌ ఎస్‌వీ ఆదినారాయణరావు విశాఖ ఏఎంసీలో  వైద్య కోర్సు పూర్తి చేశారు. ఎముకల విభాగంలో ఎంఎస్‌ చేసి వైద్య నిపుణునిగా పేరు గడించారు. ఆయన భార్య  డాక్టర్‌ శశిప్రభ ఏఎంసీలో ఎంబీబీఎస్‌, గైనకాలజీ విభాగంలో ఎండీ చేశారు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు. కుమార్తె డాక్టర్‌ శేషుకమల, అల్లుడు డాక్టర్‌ శ్రీధర్‌. వీరు లండన్‌లో వైద్యులుగా స్థిరపడ్డారు. కుమారుడు శశికిరణ్‌ ఇంజినీరింగ్‌ నిపుణుడు. కోడలు సోనాలి.

అవార్డులు ఇలా..
డాక్టర్‌ ఆదినారాయణరావు సేవలను మెచ్చి గతంలో ఏయూ, గీతం వర్సిటీలు డాక్టరేట్లు ఇచ్చి గౌరవించాయి. ప్రధానమంత్రి,  భారత రాష్ట్రపతి నుంచి కూడా జాతీయ స్థాయి  అవార్డులు అందుకున్నారు. క్రీడాభివృద్ధికి సైతం: నగరంలో ‘ప్రేమ’ ఆసుపత్రి స్థాపించి సేవలందిస్తున్నారు. ప్రేమ నర్సింగ్‌ కళాశాల, ఫిజియోథెరపి కళాశాల కూడా ఏర్పాటు చేశారు. జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షునిగా, రాష్ట్ర కార్యదర్శిగా చాలా కాలం పాటు సేవలందించారు. విశాఖ నగరంలో ఫుట్‌బాల్‌ క్రీడాభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలో సామాజిక, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. జాతీయ, అంతర్జాతీయ వైద్య సదస్సులు సైతం నిర్వహించారు.  తాను చదివిన వైద్య కళాశాలలో వసతుల కల్పనకు ఎంతో కృషి చేశారు.

* ఇప్పటికీ అదే తపన: ఎస్‌వీ ఆదినారాయణ 1978 నుంచి వైద్య రంగంలో సేవలందిస్తున్నారు. నగరానికి చెందిన ప్రముఖ ఎముకల వైద్య నిపుణులు డాక్టర్‌ వ్యాఘ్రేశ్వరుడి వద్ద  చికిత్సా విధానాల్లో మెలకువలు తెలుసుకున్నారు. గురువు అడుగుజాడల్లో నడుస్తూ పోలియో బాధితుల సేవకు అంకితమయ్యారు. డాక్టర్‌ ఆదినారాయణరావు అన్నయ్య డాక్టర్‌ బాలపరమేశ్వరరావు ప్రముఖ న్యూరోసర్జన్‌. వీరి నుంచే తాను సేవాభావం అలవాటు చేసుకున్నానని, వారిచ్చిన స్ఫూర్తి, ప్రేరణతో ముందుకు సాగుతున్నానని పేర్కొన్నారు. 82ఏళ్ల వయస్సులో కూడా పోలియో బాధితులకు సేవలందించేందుకు ఏ మాత్రం వెనుకడుగేయకుండా మున్ముందుకే అంటున్నారు.

మరింత బాధ్యత పెరిగింది..
ఇప్పటి వరకూ లక్షల మంది బాధితులను పరిశీలించా. దాదాపు మూడు లక్షల మందికి చికిత్సలు చేశా. 980కి పైగా వైద్య శిబిరాలను నిర్వహించా. కేంద్రం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారం నా బాధ్యతలను మరింత పెంచింది. మున్ముందు మరింతగా సేవలను విస్తరిస్తా’ అని డాక్టర్‌ ఆదినారాయణరావు  సంతోషం వెలిబుచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని