logo

కొలిక్కొచ్చిన కొత్త జిల్లాల కూర్పు

కొత్త జిల్లాల కూర్పు కొలిక్కివచ్చింది. పార్లమెంటు నియోజకవర్గాలన్నీ ఒక్కో జిల్లాగా ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. అరకు పార్లమెంటును మాత్రమే రెండు జిల్లాలుగా విభజించబోతున్నారు. ఈ నియోజకవర్గం భౌగోళికంగా నాలుగు జిల్లాల్లో

Published : 26 Jan 2022 04:10 IST

రెండు జిల్లాలుగా అరకు లోక్‌సభ
వాటికి అల్లూరి సీతారామరాజు, ‘మన్యం’ పేర్లు
ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం న్యూస్‌టుడే, వన్‌టౌన్‌

కొత్త జిల్లాల కూర్పు కొలిక్కివచ్చింది. పార్లమెంటు నియోజకవర్గాలన్నీ ఒక్కో జిల్లాగా ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. అరకు పార్లమెంటును మాత్రమే రెండు జిల్లాలుగా విభజించబోతున్నారు. ఈ నియోజకవర్గం భౌగోళికంగా నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉండడంతో పరిపాలనా సౌలభ్యం కోసం రెండుగా విభజించనున్నారు. పార్వతీపురం జిల్లా కేంద్రంగా మన్యం, పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలు ఏర్పాటుకు ప్రతిపాదించారు.

విశాఖ, అనకాపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గాల విషయంలో చిన్నచిన్న మార్పులు చేసి జిల్లాలుగా ప్రకటించనున్నారు. వీటికి సంబంధించి ఏ క్షణమైనా నోటిఫికేషన్‌ జారీచేయనున్నారు. దీనికి అనుగుణంగా జిల్లాల పునర్విభజనపై మంగళవారం కొన్ని కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం నుంచి జిల్లా కేంద్రానికి సమాచారం వచ్చింది. రెవెన్యూ డివిజన్ల వారీ ఉన్న మండలాలు, జనాభా, విస్తీర్ణం, నైసర్గిక స్వరూపం తదితర వివరాలు సత్వరమే పంపాలని ఆదేశాలు వచ్చాయి. ఆయా వివరాలపై నివేదికను రూపొందించి పంపే ప్రయత్నంలో అధికారులు నిమగ్నమయ్యారు. సీఎస్‌ సమీర్‌శర్మ వీసీలో కలెక్టర్‌ డా.మల్లికార్జున, ఇతర అధికారులతో మాట్లాడినట్లు తెలిసింది.

జిల్లాల పునర్వ్యస్థీకరణకు సంబంధించి జిల్లాస్థాయిలో అధికారుల కమిటీలను గతంలోనే నియమించారు. ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటుకు ఏయే శాఖల వద్ద ఎన్నెన్ని ఆస్తులు (భూములు, భవనాలు) ఉన్నాయో గుర్తించారు. వాటికి జియోట్యాగింగ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఆ వివరాలను సంబంధిత పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేశారు. పాడేరు కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాలో అన్ని కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. ఐటీడీఏ కార్యాలయాన్ని కలెక్టర్‌ కార్యాలయంగా వినియోగించుకోనున్నారు. సెరికల్చర్‌ భవనం, భూములను, యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ను ఎస్పీ కార్యాలయం కోసం పరిశీలించారు.

కొత్తగా ఏర్పాటు చేసే భీమునిపట్నం రెవెన్యూ డివిజన్‌లో ఆనందపురం, పద్మనాభం, భీమునిపట్నం, విశాఖ గ్రామీణం, మహారాణిపేట తహసీల్దార్‌ కార్యాలయాలు ఉండనున్నాయి.

* అరకు కూర్పు ఇలా: అరకు పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాలూరు, కురపాం, పాలకొండ, పార్వతీపురం కలిపి మన్యం జిల్లాగా ఏర్పాటు చేయడానికి ప్రతిపాదించారు. అరకులోయ, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాలను  అల్లూరి సీతారామరాజు(ఏఎస్‌ఆర్‌) జిల్లాగా ఏర్పాటుకు ప్రతిపాదించారు. ప్రతిపాదిత 26 జిల్లాల్లో జనాభా పరంగా చూస్తే ఏఎస్‌ఆర్‌ జిల్లా 9,53,960 మందితో ఆఖరి స్థానంలో నిలుస్తుంది. తరువాత స్థానంలో మన్యం జిల్లా 9,72,195 మందితో ఉంటుంది. మొత్తం జిల్లాల్లో ఈ రెండు మాత్రమే 10 లక్షల లోపు జనాభాతో ఉండనున్నాయి.

* అనకాపల్లిలో: ప్రతిపాదిత అనకాపల్లి జిల్లాలో పాలనా పరమైన భవనాల నిర్మాణాలకు అవసరమైన స్థలాలను ఇదివరకు పరిశీలించారు. తుమ్మపాల చక్కెర కర్మాగారానికి చెందిన భూములు అనువుగా ఉన్నట్లు గుర్తించారు. వాటితో పాటు కొత్తూరుకు సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న ఆర్డీవో కార్యాలయం, పరిసర భూములను పరిశీలించారు.  జిల్లా అవతరించిన తర్వాత కొన్నాళ్లు పాటు అద్దె భవనాలను ఉపయోగించుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే జిల్లా స్థాయి తగ్గ భవనాలు ఇక్కడ సిద్ధంగా లేవు. అనకాపల్లి లోక్‌సభ పరిధిలో నర్సీపట్నం, ఎలమంచిలి, పాయకరావుపేట, అనకాపల్లి, చోడవరం, మాడుగుల, పెందుర్తి సెగ్మెంట్లున్నాయి.

* విశాఖ జిల్లా ఇలా: విశాఖ జిల్లా పరిధి మరింత తగ్గనున్నది. దీని పరిధిలో నగర పరిధిలో ఉన్న నాలుగు సెగ్మెంట్లు, గాజువాక, భీమిలి రానున్నాయి. శృంగవరపు కోట (ఎస్‌.కోట) నియోజకవర్గం విశాఖ లోక్‌సభ పరిధిలో ఉన్నా దాన్ని తప్పించబోతున్నారు. భీమునిపట్నం రెవెన్యూ డివిజన్‌గా అవతరించబోతోంది. నగరంలో ఇప్పటికే కలెక్టర్‌, జేసీలు, ఎస్పీ, పోలీసు కమిషనరేట్‌ తదితర కార్యాలయాలకు పక్కా భవనాలున్నాయి. కొత్త భవనాలు వంటి అవసరాలు పెద్దగా లేవు. పెందుర్తి అనకాపల్లి జిల్లా పరిధిలోకి వెళితే పారిశ్రామికంగా విశాఖకు కొంత ఇబ్బందే. పారిశ్రామిక ప్రాంతాలు కుదించుకుపోయే అవకాశం ఉంది.


త్వరలో నోటిఫికేషన్‌..

-ఎ.మల్లికార్జున, కలెక్టర్‌, విశాఖపట్నం

విశాఖ జిల్లా పరిధిలోకి విజయనగరంలో ఉన్న ఎస్‌.కోట అసెంబ్లీ సెగ్మెంట్‌ రావడం లేదు. పెందుర్తి నియోజకవర్గం అనకాపల్లి పరిధిలోనే ఉంటుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ త్వరలో రానున్నది. గతంలో పునర్విభజనకు సంబంధించిన వివరాలు పంపాం. అప్పట్లో కొన్ని ప్రతిపాదనలు వెళ్లాయి. నోటిఫికేషన్‌ వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని