logo

అంగరంగ వైభవం.. సిరిమాను సంబరం

భక్తుల కొంగుబంగారం శంబర పోలమాంబ జాతర అంగరంగ వైభవంగా మంగళవారం జరిగింది. సిరిమానోత్సవాన్ని కనులారా భక్తులు తిలకించారు. మనసారా మొక్కులు చెల్లించుకున్నారు.

Published : 26 Jan 2022 04:10 IST

చదురుగుడిలోని పోలమాంబ

ఈనాడు-విజయనగరం, సాలూరు, మక్కువ, న్యూస్‌టుడే: భక్తుల కొంగుబంగారం శంబర పోలమాంబ జాతర అంగరంగ వైభవంగా మంగళవారం జరిగింది. సిరిమానోత్సవాన్ని కనులారా భక్తులు తిలకించారు. మనసారా మొక్కులు చెల్లించుకున్నారు. సమీపంలోని చెట్ల కింద వంటలు చేసుకొని సహపంక్తి భోజనాలు చేశారు. ఏటా తెల్లవారు జాము నుంచే భక్తులు బారులు తీరి ఆ తల్లిని దర్శించుకొనే వారు. ఈ ఏడాది మంగళవారం మధ్యాహ్నం 11.30 గంటల తర్వాత క్యూలైన్లు రద్దీగా కనిపించాయి. కరోనా ప్రభావంతో భక్తులను నియంత్రించడానికి  అధికారులు ముందు నుంచీ అన్ని చర్యలు తీసుకున్నారు. పది వారాల పాటు పండగ జరుగుతుందని ప్రచారం చేయడంతో ఈ ఏడాది రద్దీ కొంత తగ్గింది. మధ్యాహ్నం 3.58 గంటలకు సిరిమాను ఊరేగింపు ప్రారంభమైంది.  సిరిమాను వద్దకు భక్తులెవరూ రాకుండా పోలీసులు రోప్‌ పార్టీలతో కట్టడి చేశారు. పూజారిని ఇంటి నుంచి తీసుకొస్తుండగా.. పలువురిని అడ్డుకోవడంతో స్వల్ప తోపులాట జరిగింది. సిరిమాను కొంతదూరం కదిలాక అందరినీ అనుమతించారు. సాలూరు, బొబ్బిలి ఎమ్మెల్యేలు పీడిక రాజన్నదొర, శంబంగి వెంకట చినఅప్పలనాయుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్‌పి భంజ్‌దేవ్‌, సబ్‌ కలెక్టర్‌ భావన, దేవాదాయ శాఖ విశాఖపట్నం ఏసీ శాంతి, డీసీ శ్రీనివాస్‌రెడ్డి, అమ్మవారిని దర్శించుకున్నారు. ట్రస్టు బోర్డు ఛైర్మన్‌ పూడి దాలినాయుడు, ఈవో నగేష్‌  ఏర్పాట్లను పర్యవేక్షించారు.  ఏటా విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల నుంచి ప్రత్యేక బస్సులు నడిపే వారు. ఈ ఏడాది కరోనాతో భక్తులను నియంత్రించడానికి సాధారణ రోజుల్లోలాగే రెండు బస్సులను నడిపారు. ప్రైవేటు వాహనాలు, ఆటోలే దిక్కయ్యాయి.

సిరిమానును అధిరోహించిన పూజారి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని