logo

బిడ్డా.. ఇది నా అడ్డా..!

ప్రభుత్వ శాఖలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా మత్తు పదార్థం ‘గంజాయి’ రవాణా ఆగడం లేదు. కొద్దిరోజులుగా వరుసగా గంజాయి పట్టుబడుతున్న ఘటనలే ఇందుకు ఉదాహరణ. మత్తుపదార్థాల మాఫియాకి మన మన్యమే అడ్డాగా భాసిల్లుతోంది. వెనకుండి నడిపించేవారు ఎవరో కనిపెట్టి పట్టుకోవడం అరుదైపోయింది. వివిధ రాష్ట్రాలకు చెందిన అమాయకులు మాత్రం రవాణాలో దొరికిపోయి జైలుపాలవుతున్నారు. 

Published : 26 Jan 2022 04:10 IST

గంజాయి మాఫియాకు చిరునామాగా మన్యం
వేల ఎకరాలు ధ్వంసం చేసినా ఆగని రవాణా
నర్సీపట్నం అర్బన్‌, చింతపల్లి, పాడేరు - న్యూస్‌టుడే

ప్రభుత్వ శాఖలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా మత్తు పదార్థం ‘గంజాయి’ రవాణా ఆగడం లేదు. కొద్దిరోజులుగా వరుసగా గంజాయి పట్టుబడుతున్న ఘటనలే ఇందుకు ఉదాహరణ. మత్తుపదార్థాల మాఫియాకి మన మన్యమే అడ్డాగా భాసిల్లుతోంది.
వెనకుండి నడిపించేవారు ఎవరో కనిపెట్టి పట్టుకోవడం అరుదైపోయింది. వివిధ రాష్ట్రాలకు చెందిన అమాయకులు మాత్రం రవాణాలో దొరికిపోయి జైలుపాలవుతున్నారు.   

త ఏడాది ప్రత్యేక కార్యక్రమంగా పలుశాఖల అధికారులు సంయుక్తంగా గంజాయి తోటలను ధ్వంసం చేశారు. 7226 ఎకరాల్లో రూ.8,875 కోట్లు విలువైన గంజాయి మొక్కలు ధ్వంసం చేసినట్టు డిసెంబరు నెలాఖరులో డీజీపీ గౌతంసవాంగ్‌ ప్రకటించారు. ఇంత ధ్వంసం జరిగిన తరువాత రవాణా ఆగిపోతుందని అందరు భావించారు. ఇందుకు విరుద్దంగా దాదాపు రోజూ ఎక్కడోచోట నాణ్యమైన శీలావతి రకం పొడి గంజాయి, లేదా అత్యంత ఖరీదైన ద్రవరూప గంజాయి దొరుకుతూనే ఉంది.

తాజాగా మంగళవారం నర్సీపట్నం  
ఓ కారుని వెంటాడి మహరాష్ట్రకు చెందిన ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు 240 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మూడు రోజుల క్రితం కొయ్యూరు మండలం డౌనూరు చెక్‌పోస్టు వద పసుపులోడుతో వస్తున్న ఓ లారీని తనిఖీ చేస్తే పసుపు బస్తాల కింద సరకు దాచినట్టు గుర్తించారు. వెయ్యి కేజీలకు పైగా ఉండొచ్చని అనధికార సమాచారం. నిందితులు పరారయ్యారు. దీంతో ఈ కేసు వివరాలను ఇంకా పోలీసులకు అధికారంగా ప్రకటించలేదు.
సరిగ్గా 26 రోజుల క్రితం అనంతగిరి మండలం గుమ్మకోట వద్ద ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు వ్యాన్‌ను వెంబడించారు. నిందితుడు పరారయ్యాడు. వ్యాన్‌లో 600 కేజీల గంజాయి దొరికింది. ఈనెల నాలుగో తేదీన పిఠాపురానికి చెందిన దంపతులు వ్యాన్‌లో వస్తూ నర్సీపట్నం పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారు. వెంబడించి పట్టుకుంటే 50 కేజీలు దొరికింది.
తాటిపర్తి చెక్‌పోస్టు వద్ద ఈనెల ఐదున బెంగళూరు చెందిన ఇద్దరు నుంచి 500 గ్రాముల లిక్విడ్‌ గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదేరోజు యూపీకి చెందిన ఇద్దరి నుంచి 18 కేజీలు స్వాధీనం చేసుకున్నారు.
సీలేరు జెన్‌కో చెక్‌పోస్టు వద్ద ఈనెల ఆరున యూపీకి చెందిన వారి నుంచి 80 కేజీలు స్వాధీనం చేసుకున్నారు.


ఈనెల ఏడున బూరిసింగికి చెందిన గిరిజనుడు నుంచి ఏకంగా రూ.15 లక్షలు విలువైన తొమ్మిది కేజీల ద్రవరూప గంజాయి, అదేరోజు అరకులో 160 కేజీల, తొమ్మిదో తేదీన కాగిత టోల్‌గేటు దగ్గర తమిళనాడుకు చెందిన వ్యాన్‌లో తొమ్మిది వందల కేజీల సరకు పట్టుబడింది.


పాత నిల్వలేనా...?
ప్రస్తుతం రవాణా జరుగుతున్న మత్తుపదార్థమంతా పాత నిల్వలేనని అధికారులు భావిస్తున్నారు. గిరిజనులు పంట చేతికొచ్చాక మారుమూల అడవుల్లో ఎవరికి కనిపించని విధంగా నిల్వ చేస్తుంటారని చెబుతున్నారు. రెండు, మూడు నెలల పాటు రవాణా కొనసాగవచ్చంటున్నారు. తోటలు దాదాపు 70, 80 శాతం ధ్వంసం చేసినందున ఇకపై రవాణా తగ్గుముఖం పడుతుందని చెబుతున్నారు.


శీలావతి రకం గంజాయికి గిరాకీ ఉండడంతో తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, గోవా, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, తెలంగాణ తదితర రాష్ట్రాల వారు ఇక్కడకు వస్తున్నారు.ద్రవరూప సరకు లీటరు లక్ష రూపాయల వరకు ఉన్నట్లు సమాచారం.


నర్సీపట్నంలో మంగళవారం పోలీసులకు పట్టుబడిన కారు

సాధారణంగా ఏ వస్తువుకయినా కొరత ఏర్పడితే దాని ధర సహజంగానే భారీగా పెరుగుతుంది. ఇప్పుడు గంజాయి విషయంలోనూ అదే జరుగుతోంది. సాధారణ రోజుల్లో కేజీ గంజాయి మన్యం నుంచి మైదాన ప్రాంతానికి తరలిస్తే రూ. 2,000 వేల వరకూ వ్యాపారులు చెల్లించేవారు. ఇప్పుడు మన్యంలో తోటలను అధికారులు ధ్వంసం చేయడంతో దీనికి కొరత ఏర్పడింది. ఈ కారణంగా ప్రస్తుతం కేజీ సరకు మన్యం నుంచి మైదాన ప్రాంతానికి చేరవేస్తే రూ. 8 నుంచి రూ.10 వేల వరకూ వ్యాపారులు చెల్లిస్తున్నట్లు సమాచారం. ఈ కారణంగానే గంజాయి సాగు, రవాణాపై అధికారులు దాడులు చేపడుతున్నా.. అధికారుల కళ్లు కప్పి సరిహద్దులు దాటించేందుకు స్మగ్లర్లు రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నారు.


స్వచ్ఛందంగా ధ్వంసం

ఆపరేషన్‌ పరివర్తన కార్యక్రమం గత ఏడాది అక్టోబరు 30 నుంచి ఈ నెల 11 వరకు చేపట్టారు. పాడేరు, చింతపల్లి, గొలుగొండ ఎస్‌ఈబీ స్టేషన్ల పరిధిలో 395 ఎకరాల గంజాయి తోటలను గిరిజనులు స్వచ్ఛందంగా తొలగించారు. మిగతా తోటలను అధికారులు ధ్వంసం చేశారు. పన్నెండు వందల అడుగుల ఎత్తున ఉన్న ఓ కొండపై ఐదెకరాల్లో గంజాయి సాగు జరగడం అధికారులను విస్మయపరిచింది. వరి సాగు వెంబడి గంజాయి మొక్కలను పెంచడం గుర్తించారు. నర్సీపట్నం ఏఈఎస్‌ పరిధిలో 18 కేసుల్లో 23 మందిని అరెస్టు చేసి 1149 కేజీలు స్వాధీనం చేసుకుని ఎనిమిది వాహనాలను సీజ్‌ చేశామని ఏఈఎస్‌ రాజు తెలిపారు.


శాశ్వత చెక్‌పోస్టుల ఏర్పాటు
- సతీష్‌కుమార్‌, సెబ్‌ జాయింట్‌ డైరెక్టర్‌

మన్యం వ్యాప్తంగా ఇప్పటికే సుమారు 7,600 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశాం. ఈ సాగు ఇంకా కొన్ని ప్రాంతాల్లో మిగిలి ఉంది. ఇవి పూర్తిగా ఒడిశా సరిహద్దు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కావడంతో అక్కడకు వెళ్లేందుకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. డౌనూరు, వడ్డాది మాడుగుల, కృష్ణదేవిపేట తదితర ప్రాంతాల్లో శాశ్వత చెక్‌పోస్టులు ఏర్పాటు చేశాం. మన్యంలో గంజాయిని పూర్తిగా నిర్మూలించే దిశగా అన్ని చర్యలూ తీసుకుంటున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని