logo

AP News: వైకాపా నాయకుడి బీభత్సం..రెవెన్యూ సిబ్బందిపై దాడి

ఆక్రమణలను తొలగించడానికి వెళ్లిన రెవెన్యూ అధికారులపై వైకాపా నాయకుడు అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డారు. అధికారులు తీసుకెళ్లిన పొక్లెయిన్‌ను సైతం తగలబెట్టేస్తామనడంతో చేసేది లేక ఉద్యోగులు వెనుదిరిగారు. దీనికి సంబంధించి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ శివకుమార్‌ తెలిపిన వివరాలు ఇవి. జీవీఎంసీ 88వ వార్డు సత్తివానిపాలెం సర్వేనంబరు 355లో సుమారు 100 ఎకరాల్లో రేవళ్ల చెరువు ఉంది.అందులో నుంచే గ్రామస్థులు రాకపోకలు సాగిస్తుండటంతో పంచాయతీ హయాంలోనే రోడ్డు నిర్మించారు.

Updated : 28 Jan 2022 08:27 IST

ఆక్రమణలు అడ్డుకోడానికి వెళ్లగా ప్రతిఘటన
పోలీసులకు ఫిర్యాదు చేసిన అధికారులు
న్యూస్‌టుడే, వేపగుంట, పెందుర్తి

ఉద్యోగులను హెచ్చరిస్తూ...

వైకాపా నాయకుడు, అతని అనుచరులు సృష్టించిన హడావుడి కలకలం రేపింది.
ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించిన తీరు నివ్వెరపరిచింది. భూ ఆక్రమణలను అడ్డుకోవటానికి  వెళ్లిన వారిని మాటలతో బెదిరించి.. చేయి చేసుకొని భయానక వాతావరణం సృష్టించిన తీరు చర్చనీయాంశమయింది.

రెవెన్యూ అధికారులపై దాడిచేస్తున్న దొడ్డి కిరణ్‌, అతని అనుచరులు

క్రమణలను తొలగించడానికి వెళ్లిన రెవెన్యూ అధికారులపై వైకాపా నాయకుడు అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డారు. అధికారులు తీసుకెళ్లిన పొక్లెయిన్‌ను సైతం తగలబెట్టేస్తామనడంతో చేసేది లేక ఉద్యోగులు వెనుదిరిగారు. దీనికి సంబంధించి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ శివకుమార్‌ తెలిపిన వివరాలు ఇవి. జీవీఎంసీ 88వ వార్డు సత్తివానిపాలెం సర్వేనంబరు 355లో సుమారు 100 ఎకరాల్లో రేవళ్ల చెరువు ఉంది.అందులో నుంచే గ్రామస్థులు రాకపోకలు సాగిస్తుండటంతో పంచాయతీ హయాంలోనే రోడ్డు నిర్మించారు. అందులో 10 ఎకరాలపైనే సాధారణ మైదాన భూమిగా మారిపోయింది. దీనిపై కొందరు కబ్జాదారుల కన్నుపడింది. కొద్దిరోజుల క్రితం 89వ వార్డు వైకాపా అధ్యక్షుడు దొడ్డి కిరణ్‌, అనుచరులు సుమారు 60 సెంట్ల భూమిలో సిమెంట్‌ పలకలతో ఫెన్సింగ్‌ వేశారు. ఈ భూమి విలువ సుమారు రూ.4 కోట్లు ఉంటుంది. ఈ ఆక్రమణలపై పెందుర్తి తహసీల్దారు కార్యాలయానికి ఫిర్యాదులు వెళ్లాయి. దీనిపై నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో ఎమ్మార్వో ఆదేశాల మేరకు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ శివకుమార్‌, వీఆర్వో రమేష్‌, సర్వేయర్‌ జగదీశ్‌, పలువురు సిబ్బంది పొక్లెయిన్‌ తీసుకుని గురువారం ఉదయం ఆక్రమణలు తొలగించడానికి వెళ్లారు. సగం ఆక్రమణలు తొలగించే సరికి వైకాపా నాయకుడు దొడ్డి కిరణ్‌, అతని అనుచరులు రెవెన్యూ అధికారులపై ఒక్కసారిగా దాడికి దిగారు. ఆర్‌ఐ శివకుమార్‌ను కాళ్లతో తన్నారు. మిగతా సిబ్బందిపై కూడా దాడిచేసి, బెదిరించారు. రెవెన్యూ సిబ్బంది దీనిని చరవాణిలో చిత్రీకరించటానికి ప్రయత్నించగా.. ఫోన్లను లాగేసుకున్నారు. పొక్లెయిన్‌ను స్వాధీనం చేసుకొని కాల్చివేస్తామని బెదిరించారు. దీంతో చేసేదిలేక ఉద్యోగులు పెందుర్తి ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం పలువురు ఉద్యోగులు పెందుర్తి పోలీసు స్టేషన్‌ ముందు నిరసన తెలిపి ఫిర్యాదు చేశారు.

పోలీసులకు  ఫిర్యాదు చేస్తున్న ఆర్‌ఐ శివకుమార్‌

దొడ్డి కిరణ్‌పై కేసు నమోదు: రెవెన్యూ అధికారులపై దాడికి పాల్పడిన వైకాపా నేత దొడ్డి కిరణ్‌ (గత ఏడాది కార్పొరేటర్‌ అభ్యర్థిగా పోటీ చేశారు), మరో 20మందిపై పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్‌ఐ శివకుమార్‌ ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ అశోక్‌కుమార్‌ తెలిపారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.

పెందుర్తి పోలీస్‌ స్టేషన్‌ కూడలి వద్ద ఆందోళన చేస్తున్న రెవెన్యూ సిబ్బంది

సీపీకి కలెక్టర్‌ లేఖ: ఈ ఘటనపై కలెక్టర్‌ మల్లికార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే దీనిపై నివేదిక రప్పించుకొని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసు కమిషనర్‌ను ఆదేశిస్తూ లేఖ రాశారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన దొడ్డి కిరణ్‌పై క్రిమినల్‌ కేసు పెట్టడంతో ప్రభుత్వ భూమి ఆక్రమణ కింద వివిధ సెక్షన్లతో కేసు పెట్టాలన్నారు. ఆర్‌ఐ, సర్వేయర్ల మీద తిరగబడిన వారిని వెంటనే అరెస్టు చేయాలన్నారు. ః తమకు రక్షణ లేకపోతే ఆక్రమణలు తొలగింపులు సాధ్యం కాదకాదని ఉద్యోగులు పేర్కొంటున్నారు.

ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని